Suryaa.co.in

Editorial

కౌన్సిల్ చైర్మన్‌పై కోర్టుకెళ్లనున్న ఎమ్మెల్సీలు

– ముందు గవర్నర్‌కు ఫిర్యాదు
– ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించని చైర్మన్ మోషెన్‌రాజు
– జగన్ ఆదేశాలతో పెండింగ్‌లో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు
– తమ ప్రాథమిక హక్కుకు విరుద్ధమంటున్న ఎమ్మెల్సీలు
– ఇప్పటికే జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణచక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ రాజీనామా
– తాజాగా కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ రాజీనామా
– చైర్మన్ వైఖరిపై ఎమ్మెల్సీల ఆగ్రహం
– ఆయన తీరుతో నిలిచిపోయిన కమిటీలు
– అసెంబ్లీ కమిటీలకే పరిమితమైన కమిటీలు
– కౌన్సిల్ నుంచి పేర్లు పంపించని చైర్మన్
– 2027 వరకూ ఇంతేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

జాతీయ స్థాయిలో శాసనవ్యవస్ధ-న్యాయవ్యవస్థ మధ్య వివాదం మొదలైన నేపథ్యంలో ఏపీ శాసనమండలి చైర్మన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు ప్రశ్నాస్త్రాలు సంధించిన నేపథ్యంలో.. ఏపీ మండలి చైర్మన్ మోషెన్‌రాజుపై కోర్టుకు వెళ్లేందుకు, వైసీపీ ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటివరకూ పోతుల సుతీన, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణచక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ కూడా రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. వీరంతా స్పీకర్ ఫార్మెట్‌లోనే తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. సహజంగా సభ్యులు రాజీనామా చేసిన తర్వాత వారిని స్పీకర్ పిలిపించి, మీరు మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నారా? లేక ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తున్నారా అని అడగడం సంప్రదాయం. ఆ తర్వాత వారికి కొంత సమయం ఇస్తారు. అప్పటికీ సభ్యులు అదే వైఖరికి కట్టుబడి ఉంటే వారి రాజీనామాలు ఆమోదిస్తారు.

కానీ తెలుగు రాష్ట్రాల్లో గత 25 ఏళ్ల నుంచి విచిత్ర సంప్రదాయం కొనసాగుతోంది. సభ్యులు రాజీనామా చేసినప్పటికీ, స్పీకర్-చైర్మన్ తమ విచక్షణాధికారాలు వినియోగించుకుని, వాటిని ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం అలవాటయిపోయింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి ఆ సంప్రదాయం విజయవంతంగా కొనసాగుతోంది. అటు కోర్టులు కూడా స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం లే కపోవడం, వారికి మరింత స్వేచ్ఛ లభించినట్లయింది. దీనిపై రాజ్యాంగపరమైన చర్చ కొనసాగుతోంది.

ఇప్పుడు ఏపీలో తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల లేఖలు, చైర్మన్ మోషెన్‌రాజు దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ నుంచి ఎంపికయినందున మోషెన్‌రాజు, తన పార్టీకి తన నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించవద్దని సూచించినట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారంగా సాంకేతికంగా వైసీపీ బలం కొనసాగేలా చూడటమే జగన్ లక్ష్యమంటున్నారు.

ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు తొలుత గవర్నర్‌ను కలిసి, చైర్మన్‌పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే హైకోర్టులో కేసు వేయాలని భావిస్తున్నారు. తమ హక్కులను చైర్మన్ కాలరాస్తున్నారని, రాజీనామాలు ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి శాసమండలి చైర్మన్ వైఖరి వల్ల అసెంబ్లీ కమిటీల చాలాకాలం నిలిచిపోయాయి. అసెంబ్లీ, మండలి కమిటీలు భర్తీ చేయాలంటే స్పీకర్-చైర్మన్ ఒక జాబితా ఇవ్వాలి. అసెంబ్లీ-మండలి భ్యులు కలసి ఉన్న కమిటీలు కూడా చైర్మన్ వైఖరి వల్ల నిలిచిపోయాయి. ఇది తమ హక్కులను హరించడమేనని, చైర్మన్ వైఖరి వల్ల కమిటీలకు దూరమవుతున్నామని ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దానితో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చొరవ తీసుకుని.. స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని సమన్వయం చేసుకుని సీఎం వద్దకు ఈ సమస్య తీసుకువెళ్లారు. ఫలితంగా మండలి సభ్యులు లేకుండా, కేవలం అసెంబ్లీ సభ్యులతోనే కమిటీలు పూర్తి చేసిన పరిస్థితి. ఆరకంగా చైర్మన్ వైఖరి వల్ల దాదాపు ఏడాది పాటు సభ్యులు కమిటీలో కొనసాగే అవకాశం పోగొట్టుకోవలసి వచ్చింది.

ఇదిలాఉండగా.. సభ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను.. విప్ ఉల్లంఘించి సమర్ధించడం ద్వారా, అనర్హత వేటు వేయించుకునే వెసులుబాటు కూడా లేకపోలేదంటున్నారు. అప్పుడయినా చైర్మన్ వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. అయితే చైర్మన్ వైసీపీకి చెందిన వారయినందువల్ల, ఆ పని చేయకపోవచ్చన్నది మరికొందరి అభిప్రాయం.

ఈ క్రమంలో 2027 వరకూ చైర్మన్‌ను ఏమీ చేయలేమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 2026లో కొందరు రిటైర్ అవుతుండగా, 2027లో చాలామంది రిటైర్ అవనున్నారు. పైగా చైర్మన్ మోషెన్‌రాజుకు 2027 వరకూ పదవీకాలం ఉంది. ప్రస్తుతం మండలిలో వైసీపీకే సంఖ్యాబలం ఉండటం గమనార్హం. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామాలు ఆమోదిస్తే, టీడీపీ సభ్యులు చైర్మన్‌పై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టే ప్రమాదం ఉందని.. అందుకే జగన్ సూచన ప్రకారం చైర్మన్ ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించడం లేదని ప్రచారం జరుగుతోంది.

అయినా మోషెన్‌పై వైసీపీ అసంతృప్తి
వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు పెండింగ్‌లో ఉంచినప్పటికీ, వైసీపీ నాయకులు మోషెన్ రాజు తీరుపై అసంతృప్తిగా ఉండటం ఆశ్చర్యం. ఆయన గత శాసనమండలి చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ మాదిరిగా వ్యవహరించడం లేదన్నది, వారి అసంతృప్తికి ప్రధాన కారణం. వైసీపీ ప్రభుత్వంలో మండలి చైర్మన్‌గా పనిచేసిన షరీఫ్, అమరావతి కోసం నిలబడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కిపంపించారు. అదేవిధంగా అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేశారు. ఆ స్థాయిలో మోషెన్‌రాజు వ్యవహరించడం లేదని, ఫలితంగా ఒక్కసారి కూడా ఈ సమావేశాల్లో చైర్మన్ వ్యవహరిశైలి వల్ల.. టీడీపీ ప్రభుత్వం ఇబ్బందిపడిన దాఖలాలు లేవన్నది, వైసీపీ అసంతృప్తికి మరో కారణంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE