( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుపై మక్కువ ఎక్కువైన నా లాంటి వాళ్లకు మొన్నటి వరకూ తెలియని ‘వృద్ధనారీ పతివ్రత’ అన్న సామెతకు అర్ధం.. ఓ మూడు, నాలుగురోజుల క్రితమే తెలిసింది. అది కూడా ఒకసారి కాదు. రెండుసార్లు! ఒకసారి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో అయితే.. రెండోసారి సాక్షి టీవీ దర్శించడం వల్ల ఆ సామెతకు అర్ధమేమిటో తెలిసింది. నిజానికి ఆ సామెత బూతు కాదన్నది చాలామందికి తెలిసిందే గానీ, దానికి పూర్తి అర్ధమేమిటో మొన్నటివరకూ ప్రపంచానికి తెలిసింది కాదు. దానికి పర్యాయపదంగా పత్తిత్తులు అనే పదం వాడుతుండటం మాత్రమే మనకు తెలుసు.
* * *
ఒకవేళ అలాంటి ప్రజాస్వామ్య పతివ్రతులు లేదా పత్తిత్తులు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గానీ ఆ రౌండ్‌టేబుల్ పెట్టకపోతే.. సాక్షిలో లబ్ధ ప్రతిష్ఢుడైన ఆ జర్నలిస్టు యాంకరు పార్టులుగా కన్నీరు కార్చిన విషాద దృశ్యం చూసి ఉండకపోతే.. ప్రపంచానికి వాస్తవాలేమిటో తెలియక.. అసలు వాస్తవం అనే పదమే సజీవ సమాధి అయి ఉండేది.
అంతగొప్ప సుద్దులు, సందేశాలు, సంకేతాలు, సూక్తిముక్తావళిని జమిలిగా వినిపించిన ప్రజాస్వామ్య కమ్ పత్రికాస్వామ్య ప్రవచనకర్తలకు.. మూకుమ్మడిగా నోబెల్ అవార్డు ఇచ్చినా తక్కువేనన్నది పతిక్రాలోకం కోడై కూస్తున్న వ్యాఖ్య. కాకపోతే ఇన్ని దశాబ్దాల తెలుగు చరిత్రలో వాడుకలో ఉన్న ‘వృద్ధ నారీ పతివ్రత’ అనే సామెత.. ఈ ప్రజాస్వామ్య కమ్ పత్రికాస్వామ్య ప్రవచనకర్తల అనుగ్రహభాషణ పుణ్యాన.. ‘వృద్ధ పరుష పత్నీవ్రతు’లని మార్చుకునేందుకు కారణం కావడం బాధాకరం. అందుకు తెలుగుసామెతలు సృష్టించిన తెలుగుపెద్దలకు క్షమాపణలు.
* * *
ఇది మొన్నటి ముచ్చట. అమరావతి మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారన్న కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన సాక్షి యాంకరు, వృద్ధ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మళ్లీ ముఖానికి రంగేసుకుని రంగమెక్కేశారు. అది ఆయన జీవనాధారం కాబట్టి, అందులో తప్పేమీ లేదు. కాకపోతే సాక్షి వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించే క్రమంలో.. భావోద్వేగానికి గురయిన ఆ వృద్ధ జర్నలిస్టు, విడతలుగా కార్చిన టన్నుల కొద్దీ కన్నీరు, సత్యాన్వేషులను కదిలించే ఉండాలి.
అంత వృద్ధాప్యంలోనూ, తాను జైలులో అనుభవించిన యాతనను గుర్తు చేసుకునే క్రమంలో , కొమ్మినేని కుళ్లి కుళ్లి రోదించి.. అంతలోనే దానిని బలవంతంగా దిగమింగుకున్న దృశ్యం చూసిన ప్రజాస్వామ్య కమ్ పత్రికాస్వామ్య ప్రియులకు..అక్రమ కేసులతో జైళ్లకు వెళ్లిన వారి ఈతిబాధలు ఇంత వేదనాభరితంగా ఉంటాయా అనిపించకమానదు.
* * *
జైలు నుంచి బెయిల్‌పై విడుదలయి, మళ్లీ ‘సాక్షి’ రంగమెక్కిన కొమ్మినేని.. తన తొలి జాతి సందేశాన్ని విషణ్ణవదనంతో ప్రారంభించి, ఆ ఫ్లోలో గొంతు గద్గదమై, మధ్యలో కుళ్లుతూ ఏడ్చి, మళ్లీ మధ్యలో తమాయించుకుని, మళ్లీ మరోసారి ‘గంగాభవానుడ’యిన దృశ్యమది! ‘నేను జీవితాన్ని చాలించాల్సి వస్తుందా? ఊపిరిపోతుందా? వృత్తిని, ఊపిరిని తీసుకోవాల్సి వస్తుందా అని బాధపడినటువంటి సం… (గుక్కపెట్టి ఏడుపు..మధ్యలో కూనిరాగం. మళ్లీ ఆపుకుని..) సందర్భాలయితే ఉన్నాయి’’ అని బాధపడిపోయారు.
మరో సందర్భంలో.. ‘‘ నన్ను దెబ్బతీసేవిధంగా, కుట్ర జరగటం మాత్రం నాకు ఆవేదన కలిగించింది. నిజంగా.. (మళ్లీ దీర్ఘంగా శ్వాసపీల్చుకుని, ఏడుపు ఆపుకుని) ఈ జీవిత చరమాంకంలో, వృతి చరమాంకంలో చివరికి వృత్తిని ఇంక( ఇదంతా ఏడుపు గొంతుతోనే) అని వాపోయిన కొమ్మినేని వేదనపై ఎంతమంది బాధపడ్డారో తెలియదు గానీ.. దానిపై సోషల్‌మీడియా ట్రోలింగ్‌కు మాత్రం కొదవలేదు.
* * *
ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు అనే వృద్ధ జర్నలిస్టు.. తనకంటే వయసులో పెద్దవాడయిన, వృద్ధ రాజకీయనేత చంద్రబాబునాయుడును.. తన ‘పదహారేళ్ల’ యువ యజమాని, నాటి సీఎం జగన్ అరెస్టు చేయించి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించినప్పుడు ఏమన్నారో చూద్దాం. ‘‘ కొందరయితే.. ఆ.. బాబు గారిని ఈ వయసులో అరెస్టు చేస్తారా? అంటున్నారు. ఈ వయసులో ఏంటి? 87 ఏళ్ల వయసులో ఓం ప్రకాష్ చౌతాలా ఉన్నాడు. 75 ఏళ్ల వయసులో లాలా ప్రసాద్‌యాదవ్ ఉన్నాడు. వాళ్లేమిటి? మధుకోడా, జయలలిత ఉన్నారు’’ అని, ఇదే కొమ్మినేని తాతయ్య తాదాత్మ్యంగా సెలవిచ్చారు. అదే 70 ఏళ్ల వృద్ధుడనయిన తనను అరెస్టు చేసినప్పుడు మాత్రం.. గుక్కపెట్టి ఏడ్చి, తన జీవితం ఏమవుతుందోననుకున్నానని టన్నుల కొద్దీ కన్నీరు కార్చడమే కామెడీ.
* * *
నిండుసభలో తన భార్యను దూషించినందుకు వేదనాభరితుడై, ప్రెస్‌మీట్‌లో ఆ అవమానం గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టిన చంద్రబాబును.. ఇదే సాక్షి అండ్ వైకాపేయుల బృందం, సోషల్‌మీడియా వేదికగా చేసిన ట్రోలింగ్ ఇంకా గుర్తే. చంద్రబాబు ఏడుపుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అదే వైసీపేయులు, వారికి కవచంగా నిలిచే జర్నలిస్టుయోధులు-విశ్లేషకులు.. ఇప్పుడు కొమ్మినేని అనే వృద్ధ జర్నలిస్టు, తనకు జరిగిన అవమానం తలచుకుని గుక్కపెట్టి-కుళ్లి కుళ్లి ఏడిస్తే మాత్రం, ఎక్కడలేని జాలి చూపించడమే వింత.
* * *
ఈ విషాదభరిత ఘట్టంలో వృద్ధ జర్నలిస్టు కొమ్మినేని వారికి, మిగిలిన సాటి వృద్ధ జర్నలిస్టుల దన్ను దొరకటం కొమ్మినేని సారు అదృష్టం. ఆయనకు బెయిలిచ్చిన జస్టిస్ మిశ్రా నుంచి.. కొమ్మినేని అరె స్టును ఖండించిన ‘వృద్ధ పురుష పత్నీవ్రతుల’ంతా, తమ వాదనకు మద్దతుగా వినిపించిన మూకుమ్మడి పదం.. ‘కొమ్మనేని 70 ఏళ్ల వృద్ధుడన్న’దే! 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేని తాతయ్యను అరెస్టు చేయడం దారుణం, అప్రజాస్వామ్యం అన్నది సాటి వృద్ధ పతివ్రతుల వాదన లాంటి వేదన.. వేదన లాంటి వాదన!
* * *
మరి నోబెల్ అవార్డు గ్రహీత.. శాంతికామకుడు.. ఎప్పుడూ ‘ షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ’, భుజం మీద శాంతికపోతంతో తిరిగే ‘అహింసామూర్తి’.. క్షమాగుణంలో ఏసయ్య సైతం ఈర్ష్యపడే జగనన్న జమానాలో.. ఒక పోస్టును ఫార్వార్డ్ చేసినందుకు 75 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబు ఇంటిమీదకెళ్లి, ఆయన ఒంటిమీదున్న లుంగీని కూడా ఊడదీసి అదే బెజవాడ పోలీసులు దాష్ఠీకం చేసినప్పుడు.. సాటి జర్నలిస్టయిన అంకబాబుపై పోలీసుల దాడిని, ఈ ‘వృద్ధపురుష పత్నీవ్రతుల సంఘం’ ఎందుకు ఖండించలేదన్నది పాత్రికేయలోకపు ప్రశ్న.
* * *
బహుశా 75 ఏళ్ల అంకబాబు కంటే , 70 ఏళ్ల కొమ్మినేని తాతయ్య వయసెక్కువని భావించినట్లున్నారు కామోసు! మరో వృద్ధురాలయిన గుంటూరు శంకర్‌విలాస్ యజమానిని సీఐడీ పోలీసులు వేధించినప్పుడు.. ఈ ‘అఖిలభారత వయోవృద్ధుల సంక్షేమ సంఘం’ ఎక్కడుందన్నది సాటి పెన్షనర్లు సంధిస్తున్న మరో ప్రశ్న. పోనీ ఈ వృద్ధ జర్నలిస్టుల సంఘ నాయకుల వాదన ప్రకారం చూసుకున్నా… 75 ఏళ్ల చంద్రబాబు అరెస్టును కూడా ఈ వయోధికుల సంఘం ఖండించాలి కదా? తన 60వ పుట్టినరోజు వేడుకలో ఉన్న నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును, హైదరాబాద్ నుంచి గుంటూరుకు చెరబట్టిన పోలీసుల చర్యను మరెందుకు ఖండించలేదబ్బా?!
* * *
మొత్తానికి 70 ఏళ్ల కొమ్మినేని శ్రీనివాసరావు తాతయ్య అరెస్టు దారుణమన్నది ఢిల్లీ మిశ్రా గారి నుంచి హైదరాబాద్ అమర్ తాతయ్య వరకూ చేసిన వాదన. సీన్ కట్ చేస్తే… పురుషుల్లో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.. మనుషుల్లో వృద్ధులు వేరయా అన్నది, ఇప్పటి మారిన జనరేషన్ సామెత. మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచారం.. చిన్నారిపై 75 ఏళ్ల పాస్టర్ అత్యాచార యత్నం.. చిన్నారిని తల్లినిచేసిన వృద్ధుడు వంటి వార్తలు పత్రికలు- చానెళ్లలో చూస్తునే ఉన్నాం. కాబట్టి వయసుకు-నేరానికి సంబంధం ఏమిటో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఇది ఇప్పుడు అసందర్భమే అయినప్పటికీ..లోకం తీరు ఇలాగే అఘోరించింది మరి!
* * *
ఇక అంతకు రెండురోజుల ముందు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదికగా.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ‘పెద్దముత్తయిదుల సంఘం’ ఒకటి, కొమ్మినేని తాతయ్య అరెస్టు, ఏపీలో పాతరేసిన పాత్రికేయ పరిణామాలపై తీరికూర్చుని చర్చ నడిపిన తీరు.. అందులో అనుగ్రహ భాషణం చేసిన, సీనియర్ తాతయ్యల సూక్తిముక్తావళి ముచ్చట గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజాస్వామ్యం పుట్టి కళ్లుతెరిచిన తర్వాత, ఇప్పటివరకూ పెపంచకంలో జరగనన్ని కిరాతకాలన్నీ.. ఇప్పుడు ఏపీలోని కూటమి సర్కారు హయాంలోనే జరుగుతున్నాయన్న వేదన లాంటి రోదన, పాత్రికేయ విలువలను ఏపి పాలకులు పది అడుగుల లోతు పాతరేస్తున్నారన్న, హాహాకారాల వంటి పెడబొబ్బలతో సోమాజిగూడ ప్రతిధ్వనించింది.
* * *
ఏపీ పరిణామాలపై హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో తీరి కూర్చుని తీర్పులిచ్చిన ‘పెద్ద ముత్తయిదువల సంఘం’లో వ్యక్తమయిన అమూల్య- అనన్య-అనితరసాధ్యమైన ఆగ్రహజ్వాల సారాంశం ఏమిటంటే.. ‘‘ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు ఐక్యంగా ఉండి, ప్రభుత్వంపై ఉద్యమించాలి. ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపెట్టేలా చే స్తున్నాయి. 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేని అరెస్టు అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది’’- ఇదీ ‘ప్రజాస్వామ్యం-పత్రికాస్వేచ్ఛ’ అనే అంశంపై, లబ్థప్రతిష్ఠులైన సీనియర్ జర్నలిస్టుల ఆవేదన.
వీరిలో వృద్ధుడైన కొమ్మినేని శ్రీనివాసరావు కంటే వయసులో పెద్దవారే ఎక్కువగా ఉన్నందున.. వృద్ధ జర్నలిస్టు తాతయ్యల హితోక్తులు, ఏపీలోని అదే వృద్ధ పాలకులకు వినిపించిందో లేదో తెలియదు. ఇదే జర్నలిస్టుల తాతయ్యలు హైదరాబాద్‌లో కాకుండా, ఏ బెజవాడలోనో, ఏ గుంటూరులోనే వేదన సభ పెట్టి ఉంటే, అది ఆంధ్రా పాలకులకు వినిపించి ఉండేదేమో?! అది వేరే ముచ్చట!!
* * *
ఇక హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ‘పెద్దముత్తయిదువల రౌండ్‌టేబుల్’లో పాల్గొన్న వారంతా నిష్పాక్షికంగా..నిర్మొహమాటంగా.. ఏ పార్టీకీ ఆరోవేలు కాకుండా, అంటే ఏ పార్టీ పల్లకీని భుజం పుండ్లు పడేలా మోయకుండా.. గళధారులు కాకుండా, ఆ పార్టీలు విసిరే పదవుల భిక్షను తీసుకోని, నిఖార్సయిన వీరవిప్లవ కలం యోధులేనట! వారికి ఆ పార్టీ- ఈ పార్టీలతో సంబంధం లేకుండా.. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, వారి పాలనలో జర్నలిస్టులపై జరిగే దురాగతాలను ఎవరికీ వెరవకుండా, పార్టీల మొహమాటాలు లేకుండా నిర్మొహమాటంగా నిగ్గదీసి- నిలేసి- కడిగిపారేసే పులుకడిగిన ముత్యాలేనట. అంటే ఒక దేవులపల్లి అమర్, ఒక రామచంద్రమూర్తి, ఇంకో అల్లం నారాయణ, మరో శైలేష్‌రెడ్డి, ఒక దిలీప్‌రెడ్డి, ఇంకో ధనుంజయరెడ్డి, విజయ్‌బాబు వంటి నిష్పక్షపాత కలం యోధుల కలయికతో ప్రెస్‌క్లబ్ పునీతమయిందట.
* * *
ఏపీలో పత్రికాస్వామ్యంపై జరుగుతున్న పాతకంపై హైదరాబాద్ నుంచి పొలికేక వేసిన పాత్రికేయ సింహం దేవులపల్లి అమర్‌కు.. వైసీపీ అధినేత జగనన్న సన్నిహితుడయినప్పటికీ, జగన్ జమానాలో ఒక్క సర్కారీ పదవి కూడా తీసుకోని నిఖార్సయిన జర్నలిస్టు సంఘ విప్లవనేత అన్న పేరు తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా, ఆంధ్రా సర్కారు ఇవ్వజూపిన సలహాదారు పదవిని.. ఆత్మగౌరవంతో తృణప్రాయంగా తిరస్కరించి, నయాపైసా ఆంధ్రా ప్రజల పన్ను అనుభవించని త్యాగశీలి. పోరాటయోద్ధ.
* * *
ఇక తొలిరోజుల్లో సాక్షిని వెలిగించిన పాతిక్రేయ స్రష్ఠ రామచంద్రమూర్తి కూడా, జగన్ కొలువులో చిన్నపాటి పదవి కూడా తీసుకోని పుణ్యమూర్తి అన్న పేరుంది. ఏ అంశంపైనయినా నిర్మొహమాటంగా, నిజాయితీగా, ఏ పార్టీకీ కొమ్ముకాయరనే పేరున్న ‘పాత్రికేయ బ్రహ్మ’ విజయ్‌బాబు కూడా జగనన్నకు సన్నిహితుడయినప్పటికీ, జగన్ దివాణంలో ఎలాంటి పదవులూ అనుభవించని కర్మయోగి. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడు- జగన్‌కు ఆప్తుడయినప్పటికీ, తండ్రీకొడుకుల జమానాలో సర్కారీ పదవికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న దిలీప్‌రెడ్డి నిష్పాక్షిత గురించి ఎంత చెప్పినా తక్కువే.
* * *
సరే.. సాక్షి దివాణంలో పనిచేసినప్పటికీ, జగన్ సర్కారులో చిన్న పదవి కూడా తీసుకోని అత్యంత నిఖార్సయిన జర్నలిస్టు ధనంజయరెడ్డి లాంటి త్యాగరాజు భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనిపించరు. వీరంతా జగన్ జమానాలో 75 ఏళ్ల వృద్ధ జర్నలిస్టు అంకబాబుపై పోలీసుల దాష్ఠీకం, ఈనాడు అధినేత రామోజీపై సీఐడీ దూకుడు, టీవీ 5 మూర్తిపై పోలీసుల దౌర్జన్యంతోపాటు.. మీడియాను అణచివేసేందుకు జగన్ తెచ్చిన నల్లచట్టానికి వ్యతిరేకంగా, పిడికిలి బిగిలించి పోరాడిన జర్నలిస్టు ఉద్యమకారులే.
* * *
ఇక కేసీఆర్‌కు ఆప్తులు- ఆంతరంగికులయినప్పటికీ.. సర్కారు కొలువులకు దూరంగా ఉండి.. జర్నలిస్టులను పదడుగులలోతు పాతరేస్తామన్న కేసీఆర్ హెచ్చరికలను గుండె ధైర్యంతో ఎదిరించి, వాటిని ఖండించిన ఒక అల్లం నారాయణ, మరో శైలేష్‌రెడ్డి నిష్పాక్షిక-నిర్మొహమాట పాత్రికేయం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
* * *
హైదరాబాద్ అడ్డాగా జర్నలిస్టులపై ఏపీ సర్కారు చేస్తున్న దాడులను జగన్‌భక్త -బాబు వ్యతిరేక జర్నలిస్టులు ముక్త కంఠంతో ఖండించిన క్రమంలో, ఏపీ నేలమీద నిలబడి వాటిని ఖండించిన తెదేపా భక్త జర్నలిస్టులే కనిపించకపోవడం ఆశ్చర్యం. అంటే ఆ మేరకు ఆ పార్టీ, జగన్ మాదిరిగా విశ్వసనీయులను తయారుచేసుకోవడంలో విఫలమైందా? జగన్ అధికారం కోల్పోయి ఏడాదయినా, ఇంకా ఆయన కోసం భక్తబృందం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారంటే.. అది నిస్సందేహంగా జగన్‌కు ఉన్న విశ్వసనీయతే. అలాంటి విశ్వసనీయతను ఇన్నేళ్ల చరిత్ర ఉన్న తెదేపా, ఎందుకు సంపాదించుకోలేకపోయిందన్నదే పాత్రికేయులను ఆశ్చర్యపరిచే అంశం.
* * *
నిజానికి హైదరాబాద్‌లో తీరి కూర్చుని.. కూటమి సర్కారు పోకడపై విరుచుకుపడిన వీరవిప్లవ జర్నలిస్టులలో, ఏపీయుడబ్ల్యుజే సంఘానికి చెందిన తాజా-మాజీ నాయకులే ఎక్కువ. రాష్ట్రం విడిపోయిన ప్పటికీ- పేర్లు మారినప్పటికీ, ఏపీ-తెలంగాణ ఏపీయుడబ్ల్యుజే నేతల మధ్య బంధం ఏదో ఒక రూపంలో ఇంకా వర్ధిల్లుతూనే ఉంది. ఇప్పుడు ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా ఉన్న ఆలపాటి సురేష్‌కుమార్ కూడా ఆ సంఘాన్ని చాలాకాలం వెలిగించిన జర్నలిస్టు నాయకులే. ఇప్పుడాయన కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవిలో కొనసాగుతున్నారు.
సహజంగా నామినేటెడ్ పోస్టులంటే, పార్టీలకు ఏదో ఒక రూపంలో సేవచేసిన వారికే ఇస్తారన్నది బహిరంగమే. ఈ క్రమంలో.. ఒకప్పటి తమ సంఘ సహచరులు తనకు కొలువు ఇచ్చిన ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తుంటే, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్‌గా దానిని తిప్పికొట్టకుండా, మౌనరాగం ఆలపించడం ఏమిటన్నది పాత్రికేయలోకంలో జరుగుతున్న చర్చ.