‘‘సూర్య’ ఎఫెక్ట్
– త్రిమూర్తుల పెత్తనంపై ‘సూర్య’లో కథనం
– ఎట్టకేలకు వారిని కదిలించిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: వైద్యారోగ్య శాఖలో సుదీర్ఘ కాలం తిష్ఠవేసి, పీఠం వద లని అధికారులను మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఎట్టకేలకు కదిలించారు. ఆ ముగ్గురిపై ఇటీవలి కాలంలో సోషల్‌మీడియా వేదికగా వస్తున్న విమర్శలపై, ‘సూర్య’ వార్తా కథనం వెలువరించిన నేపథ్యంలో.. రంగంలోకి దిగిన మంత్రి సత్యకుమార్, ఆ కథనంపై విచారణకు ఆదేశించారు. తాజాగా కొన్ని బదిలీలకు ఉత్తర్వులిచ్చిన క్రమంలో ప్రభుత్వం దిద్దుబాటుకు దిగింది.
ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా మంత్రిత్వశాఖలో వివిధ పదవుల్లో పనిచేస్తున్న సీనియర్ డిప్యూటీ డైరెక్టర్లకు స్థానభ్రంశం కలిగింది. నేషనల్ హెల్త్ మిషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న యమ్.గణపతిరావును ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి బదిలీ చేసి ఆ స్థానంలో యన్.హెచ్.యమ్ లో డయాలిసిస్ కి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డి.ప్రకాశరావును నియమించారు.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో డి.డిగా పనిచేస్తున్న వి.వి.శేషారెడ్టిని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.ఆ స్థానంలో ఒంగోలు సర్వజనాసుపత్రిలో పనిచేస్తున్న యమ్.మంజులను నియమించారు. యన్.హెచ్.యమ్ లో పనిచేస్తున్న డా.యమ్.విజయలక్ష్మిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో డిప్యూటీ డైరెక్టర్‌గా కె.అప్పారావు స్థానంలో బదిలీ చేశారు.