సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ బరిలో వీవీఎస్ లక్ష్మణ్?

– ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్‌ను బరిలో దించనున్న బీజేపీ
– అంబర్‌పేట్ అసెంబ్లీ నుంచి కిషన్‌రెడ్డి పోటీ?
– కేంద్ర నాయకత్వం నుంచి లక్ష్మణ్‌కు గ్రీన్‌సిగ్నల్?
– సీఎం రేసులో కిషన్‌రెడ్డి?
– అందుకే అసెంబ్లీ నుంచి పోటీ
– తెలంగాణలో కిషన్‌రెడ్డి సొంత సర్వే?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో వీలయినన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలిచేందుకు బీజేపీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా, పార్టీకి సంబంధించిన నిఘా వర్గాలను ర ంగంలోకి దించిన కేంద్ర పార్టీ, నివేదికలు తెప్పించుకుంటోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జులుగా వ్యవ హరిస్తున్న కేంద్రమంత్రుల నుంచి, క్షేత్రస్థాయి నివేదికలు తీసుకున్నట్లు తె లుస్తోంది. ఇప్పటికే సదరు కేంద్రమంత్రులు బూత్ కమిటీ నాయకులతో భేటీ అయి, క్షేత్ర స్థాయి నివేదికలు రూపొందించారు. అయితే బూత్ కమిటీలు పటిష్టంగా లేవని తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అందులో భాగంగానే, ఆయా నియోజకవర్గాల్లో కులాలు-మతాల వారీగా ఓట్లు, ఆ నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగల నేతల పేర్లు కేంద్ర నాయకత్వానికి నివేదించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బీజేపీకి పట్టున్న సికింద్రాబాద్ పార్లమెంటుపై, ఒక కేంద్రమంత్రి నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా, రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధిగా భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. లక్ష్మణ్ తండ్రికి డాక్టర్ శాంతారామ్‌కు మంచి పేరుంది. లక్ష్మణ్ సరైన అభ్యర్ధి అవుతారని, సదరు కేంద్రమంత్రి ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఆయన అభ్యర్ధి అయితే తటస్తులు కూడా పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది ఆ కేంద్రమంత్రి చేసిన సిఫార్సుగా తెలుస్తోంది. ఆ మేరకు వీవీఎస్ లక్ష్మణ్‌కు కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా ప్రస్తుత సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేట అసెంబ్లీ నుంచి, పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్‌రెడ్డి, ప్రస్తుతం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని, ఎక్కువకాలం ఢిల్లీలోనే గడుపుతున్నారన్న అసంతృప్తి కార్యకర్తల్లో లేకపోలేదు. నగర పార్టీ కార్యకర్తలకు ఆయన ఎక్కువ సమయం కేటాయించడం లేదని, ఉన్న రెండు రోజులు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడటం కూడా సాధ్యం కావడం లేదన్నది సీనియర్ల అసంతృప్తి.

పైగా సికింద్రాబాద్ లోకసభ పరిధిలో, ఆయన ఇప్పటివరకూ కొత్తగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ లేదన్న విమర్శ స్థానికంగా వినిపిస్తోంది. గతంలో బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ, ఎక్కువ సమయం నగరానికే సమయం కేటాయించేవారని, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. సీనియర్లకు దత్తాత్రేయ ఇచ్చిన గౌరవంతో పోలిస్తే, కిషన్‌రెడ్డి ఇచ్చే విలువ శూన్యమంటున్నారు. ఆయన పాత తరం నాయకులను పక్కనపెట్టి, కొత్త నేతలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శ కూడా పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది.

కాగా, బండారు దత్తాత్రేయ వర్గం కిషన్‌రెడ్డి కార్యక్రమాలకు దూరంగా ఉండటంతోపాటు, కిషన్‌రెడ్డి కూడా దత్తాత్రేయ వర్గాన్ని దూరంగా పెట్టారన్న చర్చ, పార్టీ వర్గాల్లో చాలా కాలం నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో.. మళ్లీ ఆయనకు సీనియర్లు సహకరించే అవకాశాలు లేవన్న నివేదిక కూడా, కేంద్ర నాయకత్వానికి వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం.

మరోవైపు తెలంగాణలో పార్టీ బలపడుతున్న నేపథ్యంలో, బీజేపీ అధికారం లోకి వస్తుందన్న భావన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో సీఎం రేసులో ఉండేందుకే కిషన్‌రెడ్డి సైతం, అసెంబ్లీకి పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి గత అసెంబ్లీ సమయంలో ఇంకా ఫలితాలు రాకముందే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సీఎం అభ్యర్ధులుగా రేసులో ఉన్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా, పూర్తి స్థాయి సమయాన్ని రాష్ట్ర రాజకీయాలకు కేటాయించవచ్చన్న యోచన కూడా కిషన్‌రెడ్డి లేకపోలేదంటున్నారు. కాగా కిషన్‌రెడ్డి రాష్ట్రంలో బీజేపీ విజయావకాశాలపై సొంతగా సర్వే చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.