కర్మాగారం కాదది.. నీ జీవాధారం..!

కష్టపడితే శ్రామికుడు..
ఆ కష్టాన్ని
ఇష్టంగా పడితే కార్మికుడు..
అదే కష్టాన్ని నష్ఠంగా చూపి
నికృష్ఠంగా ఎత్తుగడలు
వేస్తే అది సర్కార్..
ఇప్పుడు అలా సృష్టించిన నష్టాలకు..కష్టాలకు
పరాకాష్టగా రగిలిన
మరో రావణకాష్టం
విశాఖ ఉక్కు..
ప్రైవేటీకరణ
ఇనప పాదాల కింద
నలుగుతున్న
ఆంధ్రుల హక్కు..!
తెలుగు జాతి
కంటి వెలుగు..
కలల కర్మాగారం..
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భాండాగారం..
ఇక ఎవరికయ్యేనో
కొంగు బంగారం..!?

ఒకనాటి ఆర్తనాదాలు..
ఆనాటి సింహనాదాలు..
ఇందిరమ్మ చెవికే చేసి చిల్లు
విశాఖ గగనాన విరిసింది
ఉక్కు పరిశ్రమ హరివిల్లు..
మూడు పదుల కాలం ముగియక మునుపే
మండబెట్టేస్తున్నారు
మన ప్రతిష్ట…
దరిద్రం సర్కారు రూపంలో
వేసి తిష్ట..
ఎవరి బుర్రలో పుట్టిందో
ఇలాంటి ఆలోచన
నశించి వివేచన..
తెలుగుగడ్డపై
పారిశ్రామిక ప్రగతికి
అధోగతి పట్టిద్దామని
చితి పేర్చి నిప్పు పెట్టేద్దామని..!

కక్షగట్టి మో”ఢీ”కొడుతుంటే
మిత్రుడనుకున్న “అమిత్”రుడు
వంత పాడుతూ కుట్రల
వంట వండుతుంటే..
ఆదుకోవాల్సిన..
అడ్డుకోవాల్సిన…
ఇక్కడి నేతలు జగన్నాటక సూత్రధారుల వోలె
నర్మగర్భ చిద్విలాసాలు చిందిస్తుంటే
చిరాకు పుట్టదా…
ఏమైనా అంటే
గుమ్మడికాయ తడుముళ్ళా..
స్వామియే మోడీ అప్పా అంటూ సమర్పించే ఇరుముళ్ళా..
ఉక్కు ప్రైవేతీకరణ వెనక ఇన్ని చిక్కుముళ్ళా..?

ఇప్పుడిక్కడ అయిదుకోట్ల
హృదయాల ఆవేశం…
ఆ వెనక 32 ఆత్మల ఆక్రోశం..
పదిహేడు వేల మంది ఉద్యోగుల బ్రతుకుల్లో
అయోమయ సన్నివేశం..
వీటితో పనిలేని
కార్పొరేట్ పడగ
రాజకీయ నాయకుల నేతృత్వంలో
జరుగుతున్న ఆందోళన
సబ్బునీటి బుడగ..
అంతా హస్తినాపురి
పెద్దల ప్రణాళిక…
ఎవరి పాత్ర ఏమిటన్నది
అంతుచిక్కని ప్రవల్లిక…
కమలపంకముల
జిగిబిగి అల్లిక..
ఉక్కు కర్మాగారంపై
రాజకీయ రంగవల్లిక..!

దశాబ్దాల నాటి నినాదం..
విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు..
పునరుజ్జీవమై..సజీవమై..
సింహనాదమై..
తెలుగోడి రణనినాదమై..
వాదమై..వేదమై..
ఉక్కుపై మోపుతున్న
ఉక్కు పాదాన్ని అణచదా..
కుట్రదారుల మెడవంచదా..!

ఒక్కటి గుర్తుంచుకో..
కర్మాగారం కాదది
నీ జీవాధారం
తెలుగు జాతి రుధిరం..
వీరుల ఆత్మార్పణం..
2014లో ఇలాగే ఢిల్లీ పెద్దలు
నడిరోడ్డుపై మట్టుబెట్టిన
నీ తెలుగుతల్లికి నువ్వు సమర్పించే తర్పణం..
బలిసిన ఏ ప్రైవేటోడికి
నీ చెమట..రక్తం..
ఆపై ఒకనాటి నీ అన్నల బలిదానం కారాదు
అచ్చున్న అప్పనం..!

అందుకే..అందుకే..
తెలుగువీర లేవరా
దీక్షబూని సాగరా…
ఈ ఉక్కు…ఈ హక్కు
నాదే అని చాటించి..
ప్రతి మనిషి తొడలు కొట్టి
తోడేళ్ళను తరిమి కొట్టి..
చురకత్తులు పదునుపెట్టి
తుది సమరం మొదలుపెట్టి..
సింహమై గర్జించాలి..
విజయం సాధించాలి..
మరోసారి జాతి మొత్తం..
చేయెత్తి జైకొట్టు తెలుగోడికి..
గుండె తెగువోడికి అనునటుల..!
అప్పుడే..అప్పుడే..
మన ఉక్కు..మనకే దక్కు..
ఢిల్లీవోడి చెంప చురుక్కు..
చూపించు మళ్లీ మళ్లీ
ఆంధ్రుడి చమక్కు…!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

Leave a Reply