– నమ్మక ద్రోహానికి…పోరాటానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి.
– నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు… ప్రజలే ముఖ్యం
– అందుకోసం ఎందాకైనా తెగిస్తా. రోడ్డెక్కి కొట్లాడేందుకు సిద్ధం
– బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బీసీకు ద్రోహం చేస్తున్న పార్టీ కాంగ్రెస్
– ఇప్పుడు బీసీ జపం చేస్తే నమ్మి మోసపోదామా?
– బీజేపీ అంటేనే బీసీల పార్టీ…
– నేను గెలిస్తే నా వేతనమంతా స్కూల్స్ అభివ్రుద్దికే ఇచ్చేస్తానని ప్రకటించిన అంజిరెడ్డి
కరీంనగర్: నమ్మక ద్రోహం నయవంచనకు – పోరాటాలకు, ధర్మ రక్షణకు మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నయవంచన, నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్, టీచర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన వారం రోజుల్లోనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్ సర్కార్ పై యుద్దం ఆరంభిస్తామని ప్రకటించారు.
తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యాం కానేకాదని, ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. మంత్రిగా ఉంటూ గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన హైదరాబాద్ లో ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బీసీలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ…ఇయాళ బీసీ జపం చేయడం సిగ్గు చేటన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పచ్చీస్ ప్రభారీల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, గోపి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు..
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం తథ్యం. ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీచర్, గ్రాడ్యూయేట్ ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేసేలా కష్టపడాలి. ఎందుకంటే ఓటు అడిగే అర్హత బీజేపీకి మాత్రమే ఉంది. బీజేపీ గెలుపును కూడా ఎవ్వరూ ఆపలేరు. అన్ని సర్వేల్లోనూ అంజిరెడ్డి ముందస్తులో ఉన్నారు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఇప్పుడు బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే నవ్వొస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే బీసీల పార్టీ. ప్రధానమంత్రి బీసీ వ్యక్తి. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీనే సీఎంను చేస్తామని గత ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించినం. కానీ కాంగ్రెస్ లో సీఎం ఎవరు? బీసీ జాబితాలో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేస్తోందెవరు? బీసీలకు అన్యాయం జరిగితే నోరు మెదపనోరు బీసీ బీసీ అని జపం చేస్తుంటే మోసపోదామా? ఇతరులు ఎవరు గెలిచినా ఎన్నికల తరువాత వాళ్లంతా కాంగ్రెస్ లో చేరతారు. నిఖార్సుగా నిజాయితీగా నిలబడి మీ పక్షాన పోరాడేది బీజేపీ మాత్రమేనని గుర్తుంచుకోవాలి.
బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేక పోటీ నుండి తప్పుకుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులు దొరకక బయటి వాళ్లను అరువు తెచ్చుకుంది. మాజీమంత్రి జీవన్ రెడ్డి పోటీ చేయబోనని తప్పుకోవడమే ఆ పార్టీపట్ల వ్యతిరేకతకు నిదర్శనం. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు రూ.7 నుండి రూ.10 వేలు పంచుతున్నారు. అయినా బాధపడాల్సిన పనిలేదు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పైసలు పంచినా… 2 లక్షల 25 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు. మేధావులు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులు రారు. తగిన గుణపాఠం చెబుతారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించిన వారం రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల పక్షాన దీక్షలతో ఉద్యమాలు చేసి ప్రభుత్వ మెడలు వంచుతాం…. ప్రభుత్వంపై యుద్దం చేస్తాం. ఒక్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.లక్ష నుండి 10 లక్షల దాకా వసూలు చేయబోతున్నరు.
ప్రజా సమస్యలపై, 6 గ్యారంటీలపై బీజేపీ నిలదీస్తుంటే… కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎల్ఆర్ఎస్ పేరుతో వేల కోట్ల దోపిడీకి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25 లక్షల 53 వేల 786 దరఖాస్తులు వస్తే.. ఒక్కో దరఖాస్తుకు తక్కువలో తక్కువ లక్ష రూపాయల నుండి 10 లక్షల రూపాయల దాకా వసూలు చేసి రూ.50 వేల కోట్ల జమ చేయాలని సిద్ధమైనరు. ఖజానాలో పైసల్లేక…అప్పుల పుట్టక…గతిలేక…ఎల్ఆర్ఎస్ పేరుతో భారీ దోపిడీకి స్కెచ్ వేసింది.
ఇంతకుముందు ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే ఆదాయమంతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే పోయేంది. ఏ వార్డులో ఎల్ఆర్ఎస్ ద్వారా ఎంత మొత్తం వస్తుందో అందులో 30 శాతం ఆ వార్డు అభివ్రుద్ధికే ఖర్చు చేసేవాళ్లు. మిగిలిన 70 శాతం కూడా ఆ మున్సిపాలిటీ, కార్పొరేషన్ అభివ్రుద్ధికే ఖర్చు చేసేవాళ్లు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను ఎత్తేసింది.
మొత్తం స్టేట్ ఖజానాకే జమ చేయాలని రూల్ తెచ్చి దోచుకునేందుకు సిద్ధమైంది. ప్రజల జేబులను గుల్ల చేసేందుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. ఒక్క పైసా కూడా కట్టొద్దని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు… మాటకు కట్టుబడాల్సిందే. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందే.
నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన నిలదీస్తుందెవరు? మీ కోసం జైలుకు పోయిందెవరు? మీ కోసం లాఠీ దెబ్బలు తిన్నదెవరు? మీ కోసం రక్తం చిందించిందెవరు? పీఆర్సీ కోసం, డీఏల కోసం, బదిలీలు, ప్రమోషన్లు, గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన కొట్లాడి కాళ్లు చేతులు విరగ్గొందెవరు…. బీజేపీ కార్యకర్తలు కాకుండా ఇంకెవరైనా మీ పక్షాన పోరాటాలు చేశారా? నన్ను జైలుకు పంపేందుకు హిందీ పేపర్ లీక్ చేశారని అపవాదు వేసిన సంఘటనను మర్చిపోయారా?
కేంద్ర మంత్రిగా ఉంటూ గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన పోరాడిన. ఎందుకంటే నాకు మంత్రి పదవి ముఖ్యం కానేకాదు… నాకు ప్రజలే ముఖ్యం. వాళ్ల సమస్యల పరిష్కారమే ముఖ్యం. అందుకోసం ఎందాకైనా తెగిస్తా. రోడ్డెక్కి కొట్లాడేందుకు సిద్ధం… ఎమ్మెల్సీ ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్. భారీ మెజారిటీతో గెలిచి తీరాలి. అందుకోసం కార్యకర్తలంతా సోషల్ మీడియాను విస్త్రతంగా వాడుకోవాలని కోరుతున్నా.