Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం

– కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతాం
-విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కృంగిపోము
-ఇంటి పార్టీ బీఆర్ఎస్
-తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గులాబీ జెండాను ఎగర వేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు.. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అనేక ప్రతికూలతలు ఉన్న తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేశాం.. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశం లోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచింది.

తెలంగాణ ప్రజల సహకారం తోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది మా పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము.. ఆనాడు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి.. తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్.. సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్దే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారు.

తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశాము. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రంలో అద్భుతమైన స్పందన లభించింది.

దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేవు.. అయితే, కేసీఆర్ గారు తలపెట్టిన ఏ పని నైనా వదలకుండా ముందుకు తీసుకు పోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసు. బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంట పట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి.

భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరికీ.. మాకు అందరికీ మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. విజయాలకు పొంగి పోము, అపజయాలకు కృంగి పోము.. ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తు లోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం.. తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం.. తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ బీఆర్ఎస్.

తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయి.తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాది మంది తెలంగాణ అమర వీరులకు పేరు పేరునా ధన్యవాదాలు.. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం.. కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతాం

LEAVE A RESPONSE