– బీసీవై నేత బోడె రామచంద్ర యాదవ్
మంగళగిరి: గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్, నిర్వాహకులు, గ్రామస్తులకు, ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్పందించిన హిందూ సంఘాలు, బీసీ సంఘాల ప్రతినిధులకు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, యాదవ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయన్నారు.
తాను కూడా తక్కెళ్లపాడుకు వెళ్లి విగ్రహం ఏర్పాటు చేయవద్దని నిర్వాహకులకు చెప్పి వస్తే… విగ్రహం పెట్టబోమని ప్రకటించి మళ్లీ రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో తాను విశాఖపట్న నుంచి ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునిచ్చానన్నారు. దీంతో వివాదాన్ని గుర్తించిన నారా లోకేష్ జోక్యంతో నిర్వాహకులు భేషజాలకు పోకుండా ఆ విగ్రహాన్ని తొలగించి, ఎన్టీఆర్ రూపంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
వివాదాస్పద ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన తనపై కొందరు బెదిరింపులకు దిగుతున్నారని రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడతామని, కుట్ర చేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటి ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో తన ఇంటిపై దాడి చేసిన అల్లరిమూకల పరిస్థితి ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వస్తామని కొందరు తనను టార్గెట్ చేసి మాడ్లాడుతున్నారని వాటన్నిటికీ బెదిరే ప్రసక్తే లేదన్నారు.