హైదరాబాద్‌లో వీధిలైట్లు వెలగడం లేదు
– తూతూమంత్రంగా జీహెచ్ఎంసీ సమావేశాలు
– ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న పోరాటానికి బిజెపి మద్దతు
– కేంద్రం పంపుతున్న యూరియా ఎలా పక్కదారి పడుతోంది?
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్: నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఖాసిం రజ్వీ దుర్మార్గాలు, దురాగతాలు, అత్యాచారాలను ప్రజలకు తెలియజేస్తూ, తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా అమ్మి, తన పాత్రికేయ ధర్మాన్ని నిర్వర్తిస్తూ, తెలంగాణ విముక్తి కోసం నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యమైన ఏకైక పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ వర్థంతి ఈ రోజు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు.
అనేకసార్లు ఖాసిం రజ్వీ అనుచరులు, రజాకార్లు బెదిరింపులు చేసినప్పటికీ, తన ప్రాణాలను లెక్కచేయకుండా తన కలం ద్వారా పోరాటం చేసి, పాత్రికేయ సమాజానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన వర్థంతి సందర్భంగా బిజెపి తరఫున, అలాగే తెలంగాణ ప్రజల తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం.
అలాంటి మహనీయుల త్యాగఫలితం, సర్దార్ వల్లభాష్ పటేల్ చొరవ ఫలితంగా, హైదరాబాద్ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది. బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే (సెప్టెంబర్ 17)ను ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ లిబరేషన్ డేను కేంద్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తాం.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై చేసిన మాటలు కోటలు దాటినా, హైదరాబాద్‌లోని ఏ గల్లీలోనైనా వారు చేసిన పనులు నామమాత్రమే ఉన్నాయి. దేశంలోనే వీధిలైట్లు వెలగనటువంటి నగరం అయిన హైదరాబాద్‌లో, ప్రధాన రహదారుల్లో కూడా వీధిలైట్లు వెలగడం లేదు.
గతంలో బిజెపి తరఫున కార్పొరేటర్లు వీధిలైట్ల కోసం ధర్నా చేసినప్పటికీ, ప్రతి మున్సిపల్ డివిజన్‌కు 50 లైట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 50 లైట్లు కూడా ఎక్కడ ఇవ్వలేదు. హైదరాబాద్ నగరం అనేక సమస్యలతో విలవిలలాడుతోంది, నగరం అనాథగా మారిపోయింది.
హైదరాబాద్ అనేది కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ మాత్రమే కాదు. మల్టీస్టోర్ బిల్డింగులు, పెద్దపెద్ద కాంప్లెక్సులు ఉన్న ప్రాంతాల్లోనే ఆదాయాన్ని ఖర్చుపెట్టడం సరికాదు. ఈ కారణంగా, హైదరాబాద్‌లోని మధ్యతరగతి మరియు పేద ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోంది.
కనీస రోడ్ల సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ లేని ప్రాంతాలకు మంచినీటి సరఫరా, పార్కులను రక్షించడం, వరదనీటి పైపులైన్లను క్లీన్ చేయడం వంటి పనులు చేయకుండా, సమస్యలను పరిష్కరించలేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడింది. అనేక రోజులుగా వీటి పరిష్కారం కోసం బిజెపి డిమాండ్ చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ సమావేశాలు తూతూమంత్రంగా నిర్వహిస్తోంది. ప్రజాసమస్యలపై జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడేందుకు బిజెపి కార్పొరేటర్లకు మైకు ఇవ్వడం లేదు. ప్రజల ఇబ్బందుల గురించి ప్రభుత్వం కచ్చితమైన పరిష్కారం చూపడం లేదు.
గతంలో కేసీఆర్ “విశ్వనగరం చేస్తానని” చెప్పాడు. దానికంటే ఎక్కువ చేస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశారు. హైదరాబాద్ నగర ఇమేజ్ను నిలుపుకోవాలి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లు ప్రధాన విభాగాలు. ఈ విభాగాలకు కనీస నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ధర్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ టెండర్లు వేయడం కూడా ముందుకు రాలేదు. టెండర్ల పాల్గొని పని చేస్తే డబ్బులు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో దుస్థితి. డెవలప్డ్ సిటీ అని చెప్పుకుంటారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో వర్షం పడితే మోకాళ్ల లోతు నీరు రోడ్లపై నిలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.
మేం ప్రజా సమస్యలపై మేం మాట్లాడితే కాంగ్రెస్ మంత్రులు మమ్మల్ని విమర్శిస్తున్నారు. విమర్శలు మాత్రమే చేస్తూ.. తమ పని అయిపోయిందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్‌కు పౌర సరఫరాలను మెరుగుపరిచే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం వహించాలి.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజా సమస్యలు, నగర అభివృద్ధి అంశాలపై బిజెపి ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఉలిక్కిపాటు, భయం ఎందుకు? బిజెపి నాయకులను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ని, మాజీ శాసనసభ్యులను, బిజెపి కార్పొరేటర్లను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అణచివేసే ప్రయత్నం చేయడం దుర్మార్గం. హైదరాబాద్ లో మెజారిటీ ప్రజలు బిజెపికి అండగా ఉన్నారు. ప్రజా సమస్యలను, కష్టాలను లేవనెత్తుతూ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతగా బిజెపి నిలుస్తోంది.
మేం జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ హైదరాబాద్ లో మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. హైదరాబాద్ లో ఒకటి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తోంది. అదే అక్రమంగా భూముల వ్యాపారం. మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లు కొనసాగుతోంది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోని నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు హోల్ సేల్ గా, ఎవరి కోటాలు వారికన్నట్లు అక్రమంగా భూముల వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తాం.
ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం అనేది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉంది. కాంగ్రెస్ 2023లో అభయహస్తం మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగు డీఏలన్నింటినీ తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గతంలో ఉన్నటువంటి డీఏలకు అదనపు డీఏలు పెండింగులో చేరాయి, కానీ పెండింగ్ డీఏలు చెల్లించలేదు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యాలను చెల్లిస్తోంది. మరోవైపు తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదు.
గత కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ రిపోర్టులో ఆలస్యం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలలలోపు సిపార్సులను అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేవిధంగా ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేస్తామన్నారు. సప్లిమెంటరీ బిల్లులన్నింటినీ 15 పనిదినాల్లో చెల్లిస్తామని చెప్పారు. అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి 15 పనిదినాలు కాలేదేమో?
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు పీఆర్సీలు చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, మరో మూడు పీఆర్సీలు పెరిగి 6 అయ్యాయి. అందులో ఒక కరువుభత్యం చెల్లిస్తామని చెప్పారు. అది కూడా 28వ వాయిదాల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కాంగ్రెస్ హయాంలో వాయిదాలతో చెల్లిస్తే, పూర్తి చేయడం కష్టమే.
గతంలో 2023లో అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదు. అసలు వేతన సవరణ సంఘం ఉందా లేదా అనేది కూడా తెలియదు. మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ అమల్లో ఉండేది. గత కేసీఆర్ ప్రభుత్వం క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టింది. కానీ అది కూడా క్యాష్ లెస్ గానే మిగిలిపోయింది.
కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
ఉద్యోగులు దాచుకున్న డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీపీఎఫ్ మొత్తాలను విత్‌డ్రాపై మారిటోరియం విధించడం దారుణం. 63 దీర్ఘకాలిక పెండిగ్ సమస్యలపై 200 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీగా ఏర్పడి, వారి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేలకోట్ల బకాయిలను చెల్లించడం లేదు. ఈ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న పోరాటానికి బిజెపి తెలంగాణ రాష్ట్రశాఖ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది.
సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యమానికి బిజెపి అన్ని రకాలుగా పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా, కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చిన హామీల మేరకు, ఉద్యోగస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
రూ. 2,650 విలువ గల యూరియా బస్తాను కేంద్ర ప్రభుత్వం రూ. 266 సబ్సిడీ ధరలో రైతులకు అందజేస్తోంది. అయితే, అటువంటి బస్తాను రైతులు అధిక ధరలకు, రూ. 400కి కొనాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? దీని వెనుక అసలు కుట్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలి.
తెలంగాణకు కేంద్రం పంపుతున్న యూరియా ఎలా పక్కదారి పడుతోంది? ఎలా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తోంది? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. ఇప్పటికే తెలంగాణలో 2.04 లక్షల టన్నుల యూరియా ఖరీఫ్ సీజన్ కోసం ఓపెనింగ్ స్టాక్‌గా ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో విత్తనాలు కూడా వేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం…. కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేదని ప్రకటించి భయానక వాతావరణాన్ని సృష్టించింది.
ఇతర దేశాల్లో ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ, గత 11 సంవత్సరాలుగా ఎరువుల ధర ఎంత పెరిగినా కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం పడకుండా, మేలు చేసే విధంగా సబ్సిడీతో రూ. 265కే బస్తాను అందజేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 80,000 కోట్ల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరించింది.