-2030 నాటికి క్యాన్సర్ నివారణలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉంటుంది
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
క్యాన్సర్ నివారణకు వైయస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. రాబోయే పదేళ్లలో క్యాన్సర్ నివారణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. అనంతరం మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడారు.
ఏపీ బడ్జెట్‌లో రూ.400 కోట్లను క్యాన్సర్ నివారణకు కేటాయించారని, క్యాన్సర్ స్క్రీనింగ్‌కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. కర్నూలులో రూ.120 కోట్లతో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటు జరుగుతోందన్నారు. అదేవిధంగా విశాఖ కేజీహెచ్‌లో రూ.60 కోట్లతో క్యాన్సర్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విడదల రజిని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని తెలిపారు.