– ‘డేర్ టూ డ్రీమ్’ శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: యువతలో అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తూంకుంటలోని అలంకృత రిసార్ట్లో ‘డేర్ టూ డ్రీమ్’ పేరిట సిఖ్ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.
ఆలోచనలకు, ఆకాంక్షలకు పరిమితులు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా యువతకు దిశా నిర్దేశం చేశారు. కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడటం కూడా అంతే ముఖ్యమన్నారు. గెలుపోటముల గురించి ఆలోచించొద్దని, లక్ష్యాన్ని చేరుకునే వరకూ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలని సూచించారు.
కృషి, పట్టుదల లేకుండా ఏ కల సాకారం కాదన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సిఖ్ సొసైటీ ప్రతినిధులు తేజ్ దీప్ కౌర్, గగన్ కోహ్లీ, సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.