Suryaa.co.in

Telangana

దళితబంధు ఖాతాల్లో నగదు జమ చేశాం

-మంత్రి కొప్పుల వెల్లడి

దళితబంధు పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదంటూ వెలుగు పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఖండించారు. సర్కార్ నుంచి సరిపడ నిధులు విడుదల చేయడం లేదంటూ తప్పుడు వార్తలు రాయడం బాధాకరమన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు నచ్చిన వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని వెల్లడించారు.

మొదటి విడతగా లబ్దిదారులకు మంజూరు చేసిన దళిత బంధు నిధులతో ఎక్కువ మంది ట్రాక్టర్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు, కిరాణా, మెడికల్ షాపులు, సర్వీస్, సప్లై పాయింట్లు పెట్టుకున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో 1298 మంది లబ్దిదారులకు గాను 1268 మంది ఖాతాల్లోకి పూర్తి నగదు జమ చేయడం జరిగింది. 1268 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3462 మంది లబ్దిదారులకు గాను 3320 మంది ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరిగింది. 3314 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యింది.

నాగర్ కర్నల్ జిల్లా చారుగొండ మండలంలో 1407 మంది లబ్దిదారులకు గాను 1373 మంది ఖాతాల్లోకి పూర్తి నగదు జమ చేయడం జరిగింది. 1373 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో 2223 మంది లబ్దిదారులకు గాను 2002 మంది ఖాతాల్లోకి పూర్తి నగదు జమ చేయడం జరిగింది. ఈ జిల్లాలో 745 యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయ్యాయి.

ప్రతీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వంద యూనిట్లకు సంబంధించి 11,835 మంది లబ్దిదారులకు గాను 11739 మంది ఖాతాల్లో పూర్తి నగదు జమ చేయగా.. 11301 యూనిట్లు గ్రౌండ్ చేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. మరో వారం రోజుల్లో మొత్తం యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో పశువులకు ముఖ్యంగా ఆవులు, గేదెలకు లంపీ డిసీజ్ వ్యాధి సోకడంతో వాటి రవాణా నిలిచిపోయింది. వీటికి సంబంధించిన యూనిట్ల గ్రౌండింగ్ లో అంతరాయం ఏర్పడింది. రవాణాపై నిషేధం ఎత్తి వేయగానే గేదెలు, ఆవులకు సంబంధించిన యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి చేస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

LEAVE A RESPONSE