-దమ్మున్న పోలీసు ఉంటే సీఎం జగన్ పై కేసు నమోదు చేయాలి
-జగన్మోహన్ రెడ్డి తలపాగా కడితే అభినవ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కళ్ళజోడు పెడితే కే ఎల్ రావు
-మంత్రి షెకావత్ ను అవమానించే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
-కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సిఐడి చీఫ్ సుమోటో సునీల్ కుమార్
-అమరావతి, పోలవరాన్ని అభివృద్ధి చేయాలి
-సీఎం ది ఒక మాట … సలహాదారుది మరొక మాటా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రంలో దమ్మున్న పోలీసు ఎవరైనా ఉంటే, అసెంబ్లీ వేదికగా కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఐపీసీ 153 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు వస్తే తమ తడాఖా చూపిస్తామంటున్న మంత్రి అప్పలరాజుతో పాటు, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మంత్రులు, మాజీ మంత్రులపై ఐపిసి 153 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలన్నారు.
ఏపీ సిఐడి చీఫ్ గా వ్యవహరిస్తున్న సుమోటో సునీల్ కుమార్, తక్షణమే వర్గ, వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, మాజీ మంత్రులపై కేసులు నమోదు చేయాలని… నిజాలు చెప్పే తనలాంటి వారిపై కాదని చురకలు అంటించారు .కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలను చేస్తున్నముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ మంత్రులపై ప్రతిపక్షాలు కేసులు నమోదుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి డోకా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్పారని స్పష్టమవుతుందన్న ఆయన అబద్దం చెప్పిన వారు తక్షణమే తమ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అమరావతి అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని చెబుతూనే, మరొకవైపు అమరావతి అభివృద్ధికి నిధుల ఖర్చు గురించి కుంటి సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదివేల కోట్ల రూపాయలను వెచ్చించి, అమరావతి ప్రాంతంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. అమరావతి అభివృద్ధి కోసం కొంత పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం పెడితే, ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని సి ఆర్ డి ఏ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 12,800 కోట్ల రూపాయలను వెచ్చించాలని సి ఆర్ డి ఏ కోరడం జరిగిందని, ఆ డబ్బులను కూడా 2037లో తిరిగి వెనక్కి ఇస్తామని పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. అయినా, ముఖ్యమంత్రి మాత్రం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని ఎక్కడ నుంచి తెస్తామని అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించారని ముఖ్యమంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్న ఆయన, అవన్నీ శాశ్వత భవనాలేనని గుర్తు చేశారు. ప్రస్తుతమున్న సచివాలయ భవనం స్థానం లో అద్భుత సచివాలయ భవనాన్ని నిర్మించుకున్న తర్వాత, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం ఆ భవనాన్ని కేటాయించడం కోసమే, దానిని తాత్కాలిక భవనంగా పేర్కొనడం జరిగిందన్నారు.
అంతేకానీ భవనాలేవి తాత్కాలిక భవనాలు కావని అన్నారు. అమరావతిలో ఏమున్నదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన, ఈనాడు దినపత్రికలో ప్రచురించిన అమరావతి అభివృద్ధి దృశ్యమాలికను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. అమరావతిని గత ప్రభుత్వ హయాంలో రాత్రి పగలు కష్టపడి ఎంతో అభివృద్ధి చేశారని కితాబు ఇచ్చారు. కళ్ళుండి చూడలేని కబోదులు మాత్రం , అమరావతిలో ఏముంది గ్రాఫిక్స్ తప్ప అంటూ మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టుగానే, అమరావతి అభివృద్ధిని కొనసాగించి ఉంటే అద్భుతాలు ఆవిష్కృతమై ఉండేవన్నారు. 24 కిమీ సీడ్ యాక్సెస్ రోడ్డు ను, టిడిపి ప్రభుత్వ హయాంలో 19 కిలోమీటర్ల మేర పూర్తి చేశారని, ఆ మిగతా ఐదు కిలోమీటర్ల పూర్తి చేసి ఉంటే బాగుండేదన్నారు.
కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం గురించి పట్టించుకోలేదని చెప్పారు. ఏమైనా అంటే… అమరావతి అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ ప్రజలు ఎవ్వరూ తమ ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మడం లేదన్నారు. అమరావతి ప్రాంతంలో విట్, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రైవేటు సంస్థలకు నిబంధనల ప్రకారం స్థలాన్ని కేటాయిస్తే సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. న్యాయస్థానం ఉన్న ప్రాంతాన్ని లా సిటీ అని పేర్కొంటే, అన్ని నగరాలు ఒక్క అమరావతిలోనేనా అని ప్రశ్నించే వారికి ఏమి సమాధానం చెబుతామంటూ ఎద్దేవా చేశారు. ఇక అమరావతి నగరంలో ఒకే సామాజిక వర్గ ప్రజలు ఉన్నారన్న వాదనలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.
ఎస్సీ ఎస్టీలు 32 శాతం ఉండగా, ముఖ్యమంత్రి అతిగా ప్రేమించే సామాజిక వర్గం 23 శాతం ఉన్నారని, అతిగా ద్వేషించే సామాజిక వర్గం అంతకంటే తక్కువే ఉన్నారన్నారు. బీసీ మైనార్టీలు 17 శాతం ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎకరా పొలం గలిగిన రైతులు 6000 మంది ఉండగా, రెండు ఎకరాల పొలం కలిగిన రైతులు 8000 మంది ఉన్నారని, వీరంతా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని… ఎకరా, రెండెకరాల భూమి కలిగిన రైతులు పెత్తందారీలా అంటూ ప్రశ్నించారు.
దమ్ముంటే ఎన్నికలకు వెళ్ళండి
మూడు రాజధానులను రెఫరండంగా పేర్కొంటూ దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు. మూడు రాజధానులను రెఫరండంగా భావిస్తూ, ఎన్నికలకు వెళ్తామన్నా తమ ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సై అన్నారని గుర్తు చేశారు. విశాఖవాసులు ఇక్కడకు మీరు రావొద్దు… రాజధాని వద్దని పేర్కొంటున్నారన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తే, కర్నూలు న్యాయ రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తెలిసి, మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయనకు సలహాలు ఇస్తున్న ఆ దిక్కుమాలిన సలహాదారులు ఎవరో నంటూ చురకలాంటించారు. న్యాయవాదులకైనా బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించుకొమ్మని పార్లమెంటులో చట్టం చేశామని, అంతేకానీ ఆ తరువాత రాజధాని ని మార్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టలేదని గుర్తు చేశారు.
రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని మాట వరసకు అనుకుందాం… అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికైతే, ఆయన మూడు రాజధానులు వద్దని, ఆరు రాజధానులను ఏర్పాటు చేస్తానంటే వీలవుతుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం,సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తారని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీ వేదికగా ఇష్టారీతిలో అబద్దాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతులంతా కోటీశ్వరులేనని ఒక మంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నిజమైన క్షతగాత్రులే పాదయాత్ర చేస్తారన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అమరావతి మున్సిపాలిటీ ప్రతిపాదనను ఏడు ఎనిమిది మంది మినహా, 23 గ్రామాల ప్రజలు ఏకపక్షంగా తిరస్కరించారని గుర్తు చేశారు.
అభినవ మోక్షగుండం సీఎం జగన్
తలపాగా కడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినవ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని, కళ్ళజోడు పెడితే కే ఎల్ రావు అని రఘురామకృష్ణం రాజు చురకలు అంటించారు. జగన్మోహన్ రెడ్డి సివిల్ ఇంజనీరింగ్ లో ఇరిగేషన్ స్పెషాలిటీ చేసి ఉంటారని, అది ఎంతో క్లిష్టమైన సబ్జెక్టు అయినప్పటికీ, అందులో ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమీ తెలియదని, ఎమ్మెల్యేగా కూడా ఆయన అనర్హుడని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇంజనీర్లు ఆమోదించిన డిజైన్ మేరకే ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ ను నియమించి చేపట్టిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అంతేకానీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇంజనీర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు బడుద్దాయిలు అన్నట్టు, మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఇంజనీర్లు మాత్రమే మహానుభావులు అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. 2010 సంవత్సరం నాటి పోలవరం ప్రాజెక్టు ఫోటోలను చూపెట్టి, గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి పనులు చేపట్టలేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్న ఆయన, 2019లో టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టు పనులను తాము చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. బేయర్స్ కంపెనీ ఆధ్వర్యంలో డయా ఫ్రమ్ వాల్ నిర్మించారని, రివర్స్ టెండ రింగ్ కోసం పనులు ఆలస్యం చేయడం వల్లే, డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని చెప్పారు. కేంద్రాన్ని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ లో పనిచేసిన ఇంజనీర్లను, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ ను అవమానించే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. పోలవరం, అమరావతిని అభివృద్ధి చేయకుండా కట్టు కథలు చెప్పి, ఇతరులపై నెపం నెట్టి, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
బ్రహ్మాండమైన అభివృద్ధి అంటూ సాక్షి కథనం
సాక్షి దినపత్రికలో బ్రహ్మాండమైన అభివృద్ధి అనే కథనం పై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పుంజుకొని 12 లక్షల కోట్లకు జిఎస్ డిపి చేరినట్టు సాక్షి దినపత్రిక తన కథనంలో పేర్కొనడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 31 లక్షల ఇళ్ల నిర్మాణంలో, కేవలం 5 ఇళ్ళను మాత్రమే మూడున్నర ఏళ్ల కాలవ్యవధిలో పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన ఇళ్లకు నీలిరంగు వేసుకొని, తామే పూర్తి చేశామన్నట్టుగా తమ ప్రభుత్వ పెద్దలు బిల్డప్ ఇస్తున్నారన్నారు . రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలయిందని, అంతా వలసలు వెళ్తున్నారన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణ రంగం పుంజుకోవడం లేదని, రాష్ట్రం ఎడారిగా మారిందని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతూనే, అప్పులు చేయవలసిన అవసరం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల పిఎఫ్ డబ్బులు, వైద్య విధాన పరిషత్, ఇంటర్మీడియట్ బోర్డ్ వద్ద నిలువ ఉన్న డబ్బులను తీసుకోవలసిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని నిలదీశారు.
విశాల హృదయంతో పవన్ కళ్యాణ్ చెప్పి ఉంటారు
తమ పార్టీకి 40 నుంచి 60 స్థానాల మధ్య సీట్లు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాల హృదయంతో చెప్పి ఉంటారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ… ఆయన చెప్పినట్లుగా అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రజలు రోడ్డుపైకి రావాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ఉత్తర్వులను రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా చదివి వినిపించారు.
ఏ పార్టీ అభ్యర్థికి కూడా గ్రామ వాలంటీర్లు, పోలింగ్ ఏజెంట్ గా ఉండడానికి వీల్లేదని ఆయన తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. అలాగే ఆధార్ లింకేజి కార్యక్రమములోనూ గ్రామ వాలంటీర్ల ప్రమేయం లేకుండా, ప్రతిపక్షాలు ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. గ్రామ వాలంటీర్లు ఎవరైనా జోక్యం చేసుకుంటే, వెంటనే మొబైల్ ఫోన్లో ఫోటో తీసి, ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సిఐడి
కోర్టు తీర్పును ఏపీ సిఐడి చీఫ్ సుమోటో సునీల్ కుమార్ ధిక్కరించారని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఈనెల 19, 20, 21వ తేదీలలో ఉదయం 10 గంటల నుంచి తన పై నమోదైన, ఐపీసీ 153 ఏ కేసు విచారణ నిమిత్తం హాజరుకావాలని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. తనను కస్టడీలో హింసించిన విధానం, చంపడానికి చేసిన ప్రయత్నాన్ని గతం లో తాను కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా, వర్చువల్ విధానం ద్వారా విచారణకు కోర్టు అనుమతినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇదే కేసులో ఆంధ్రజ్యోతి సంస్థ , టీవీ5 వారిని కూడా కలిసి విచారించవలసి ఉన్నదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొనగా, ముగ్గురిని కలిపి హైదరాబాద్ నగరంలోని దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో విచారించాలని ఆదేశించిందన్నారు. విచారణకు 15 రోజుల ముందు నోటీసులు జారీ చేయాలని కూడా పేర్కొనడం జరిగిందన్నారు. అయితే కోర్టు ఆదేశాలను పాటించకుండా, తనను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన సిఐడి చీఫ్ సుమోటో సునీల్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
తాపీ ధర్మారావు జయంతి శుభాకాంక్షలు
సరళమైన భాషలో తెలుగు బోధించడానికి కృషిచేసిన మహానుభావుడు తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా తెలుగు మాధ్యమ దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 19వ తేదీన జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని రఘురామకృష్ణంరాజు గారు తెలిపారు. తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూనే, తెలుగు భాషను హతమార్చే ప్రయత్నాన్ని చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు బుద్ధి రావాలని ఆకాంక్షించారు.