మునుగోడులో బిజెపి,టీఆర్ఎస్ లను ఓడించాలి

-ప్రతి పౌరుడిపై రూ.2.25 లక్షల అప్పు మోపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
-నీళ్ళు రాకుండా అడ్డుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
-రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు మునుగోడు దిక్సూచి అవ్వాలి
-మునుగోడు గడ్డ ఇప్పటికి ఎప్పటికి కాంగ్రెస్ అడ్డ
-మండల సమన్వయ కమిటీ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దేశ సంపదను అమ్ముతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ పోకడలతో దేశాన్ని ఏలుతున్న బిజెపిని మునుగోడులో ఓడించి ఇక ప్రజా వ్యతిరేక పాలన చాలు అన్న సందేశాన్ని మునుగోడు ప్రజలు దేశానికి ఇవ్వాలని సిఎల్ పి నేత భట్టి విక్రమార్క కోరారు. 8 సంవత్సరాలుగా తెలంగాణ సంపదను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేయడమే కాకుండా ఐదు లక్షల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు. మిషన్ భగీరథ, చెరువుల పూడిక తీత పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులతో ప్రతి పౌరుడిపై తలసరి అప్పు రూ.2.25 లక్షలు భారం మోపారన్నారు. అప్పులు చేసి తెలంగాణను దివాలా తీయించడానికేనా? కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని నిలదీశారు. ధరల పెరుగుదలతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారే తప్పా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని, కానీ మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రంగా ఉన్న ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని తెలిపారు.

నీళ్ళు రాకుండా అడ్డుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగం పనులు పూర్తి చేయకుండా మునుగోడు ప్రాంతానికి నీళ్ళు రాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా పూర్తి చేయకపోవడం వివక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా నదిలో ఉన్న నీళ్లను పొలాల్లోకి గలగల పారించే వాళ్ళమని తెలిపారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికార అహంకారంతో మీడియాను గుప్పిట్లోకి తీసుకొని భయపెట్టో.. ప్రలోభ పెట్టో… వారికి అనుకూలంగా ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నాయని, ఆ ప్రచారాన్ని చూసి ప్రజలు మోసపోవద్దని సూచించారు.

మునుగోడు దిక్సూచి కావాలే..
రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నికలు దిక్సూచి కావాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సంకేతాన్ని మునుగోడు ఓటర్లు ఈ రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. మద్యం ప్రలోభాలకు ఓటును వృధా చేయొద్దని, ప్రజా సంక్షేమ రాజ్యానికే మీ ఓటును బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాలన్నారు.

కాంగ్రెస్ సిద్ధాంత భావజాలమే ప్రజలను ఆకర్షిస్తుందని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్సీలు ప్రేమ్ సాగర్ రావు, పోట్ల నాగేశ్వరరావు, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు నర్సిరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నెమిండ్ల శ్రీనివాస్, సత్యనారాయణ రావు, రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.