చట్టసభల్లో చర్చకు అవకాశం ఉన్నా వీధిపోరాటాల వైపే చంద్రబాబు మొగ్గు!

( వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభసభ్యులు)

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య చట్టసభల్లో చర్చల ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని రాజ్యాంగం రూపొందించిన మహానుభావులు ఆశించారు. ప్రధాన ప్రతిపక్షం సహా అన్ని ప్రతిపక్షాలు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేయాలి. అంతేగాని, అన్ని సమస్యలు, అంశాలపై విపులంగా చర్చించే అవకాశం ఇచ్చే చట్టసభల సమావేశాల సమయంలో ఈ పార్టీలు వీధి ఘర్షణలకు దిగకూడదు.

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో పాటించాల్సిన ఈ కనీస సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం తెలుగుదేశం విస్మరిస్తోంది. ఏపీ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచే శాసనసభలో విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ వీధిపోరాటాలు మొదలుపెట్టింది. రైతు సమస్యలు వంటి ఏవైనా గంభీరమైన విషయాలు ఉన్నప్పుడు శాసనమండలి, శాసనసభకు హాజరై పాలకపక్షాన్ని నిలదీయాల్సిన తెలుగుదేశం తన బాధ్యత మరచింది. ఈ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ లోకేష్‌ తమ పార్టీని ఉభయసభల్లో తమ పార్టీ సభ్యులను పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో నడింపించాల్సిన బాధ్యత వదిలేశారు.

ఉభయసభల సమావేశాలు మొదలైన సెప్టెంబర్‌ 15 నుంచే తమ పార్టీని చట్టసభలను చట్టుపక్కల కార్యకలాపాలకే పురికొల్పుతున్నారు. రెండ్రోజుల విరామం తర్వాత సోమవారం ఆరంభమైన అసెంబ్లీ ముట్టడికి తెలుగుదేశం రైతు విభాగం ప్రయత్నించింది. చట్టసభలకు హాజరయ్యే వైఎస్పార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల వాహనాలు మార్గమధ్యంలోనే ఆగిపోయేలా చేయడంలో టీడీపీ రైతు విభాగం తాత్కాలికంగా సఫమైంది. కాని, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎనలేని నష్టం కలిగించింది.

అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు నమ్మకమా?
1978 నుంచి 1983 జనవరి వరకూ, 1989 నుంచి ఇప్పటి వరకూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష ఉపనేతగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు తెలుసు. మూడేళ్ల క్రితం సీఎం హోదాలో ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు దంచేవారు. చట్టసభలే దేవాలయాలు అని చెప్పేవారు. 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మున్నెన్నడూ కనీవినీ ఎరగని ఘోర పరాజయం ఆయన పార్టీ మూటగట్టుకుంది. అప్పటి నుంచీ చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం సడలిపోయినట్టు కనిపిస్తోంది.

అందుకేనేమో, అసెంబ్లీకి హాజరవడం మానుకున్న ఈ మాజీ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలుగుదేశం, దాని అనుబంధ సంస్థలు వీధిపోరాటాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. అధినాయకుడు లేకుండా అసెంబ్లీకి హాజరైన తెలుగుదేశం శాసనసభ్యులు ఏదో గొడవపెట్టుకుని సభ నుంచి సస్పెండ్‌ అయ్యేలా వ్యవహరిస్తున్నారు. పక్షపాతరహితంగా వ్యవహరించే సభాధ్యక్షుల సమక్షంలో చట్టసభల్లో జరిగే చర్చల్లో పాల్గొంటూ, పాలకపక్షంతో మాట్లాడాల్సిన టీడీపీ రభస చేయడానికే మొగ్గు చూపుతోంది. ఉదయం సభలు ప్రారంభమయ్యే సమయానికి చట్టసభల ఆవరణ వెలుపల భద్రతా బలగాలతో ఘర్షణకు తెరలేపుతోంది.

అనవసరమైన ఉద్రిక్తతకు సభ వెలుపల, బయటా కారణమౌతోంది. కొద్ది రోజులు జరిగే వర్షాకాల సమావేశాల్లో అర్ధవంతమైన చర్చలకు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మాదిరి వ్యవహరిస్తే ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం పలచనయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం సీనియర్‌ మోస్ట్‌ తెలుగు రాజకీయవేత్త చంద్రబాబు గారు ఎంత త్వరగా గ్రహిస్తే విశాల తెలుగుసమాజానికి అంత మంచిది.

Leave a Reply