మకాలి ఇంగ్లండ్లో శిక్షపడ్డ నేరస్థుడు
కలోనిఅల్ (colonial) ఆలోచనాసరళికి అతీతంగా ..
భారతావనిలో ప్రణాళికాబద్ధమైన విద్యావిధానం ఇంగ్లిష్ పాలకుల ప్రతినిధి మకాలి (Macaulay, మెకాలె కాదు)కి వేలయేళ్ల పూర్వమే మొదలయింది. గురుకులాలలో విద్యను అభ్యసించడమూ, ఉపాధ్యాయులు, గురువుల దగ్గర కావ్య , వ్యాకరణాలు నేర్చుకోవడమూ, పౌరోహిత్యం, అర్చకత్వం వంటివి నేర్చుకోవడమూ, వృత్తి విద్యలు అభ్యసించడమూ కాకుండా మనదేశంలో విశ్వవిద్యాలయ స్థాయిలో వేలయేళ్ల క్రితమే ప్రణాళికాబద్ధమైన విద్య నేర్పబడింది. కొందరు గుడ్డిగా అనుకుంటున్నట్టుగానూ, చెబుతున్నట్టుగానూ అది ఇంగ్లిష్ వాళ్ల వల్ల మొదలవలేదు.
తక్షశిలా విశ్వవిద్యాలయం 2,500యేళ్ల క్రితంది. ప్రపంచంలోనే మొట్ట మొదటి విశ్వవిద్యాలయం. సామాన్య శకానికి పూర్వం 5వ శతాబ్దిలో గాంధార రాజ్యంలో, ఇప్పటి కాందహార్, పాకిస్తాన్ సరిహద్దులో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. ఇది మనదేశ విశ్వవిద్యాలయం. ఇందులో వేలాది మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ 64 వేర్వేరు విషయాల (subjects) బోధన, అధ్యయనం ఉండేవి. వాటిల్లో శస్త్రచికిత్స , వైద్యం, యుద్ధకళ, రసాయన శాస్త్రం, గణితం, విలువిద్య, ఆర్థికశాస్త్రం, వ్యాకరణం, సాహిత్యం, సంగీతం, నృత్యం, భౌతికశాస్త్రం, జ్యోతిషం, ఖగోళశాస్త్రం, సైనిక విజ్ఞానం వంటివి ఉన్నాయి.
పాణిని, చాణక్యుడు, పంచతంత్రం రాసిన విష్ణుశర్మ ఇక్కడే చదువుకున్నారు. చంద్రగుప్తమౌర్యుడు ఇక్కడే చదివాడు. కొందరు గ్రీకులు, రోమనులు ఇక్కడ చదివారు. ఈ విశ్వవిద్యాలయాన్ని సామాన్యశకం 5వ శతాబ్దిలో చొరబడ్డ హూణులు ధ్వంసం చేశారని పరిశీలకులు రాశారు.
తక్షశిలా విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయంలో స్పష్టత లేదు. పుష్పగిరి విశ్వవిద్యాలయం, దీన్ని సామాన్యశకానికి పూర్వం 2వశతాబ్దిలో అశోకుడు నిర్మించాడు.
నలందా విశ్వవిద్యాలయం, దీన్ని సామాన్యశకం 5వ శతాబ్దిలో కుమార గుప్తుడు నిర్మించాడు. వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది బోధకులు, వందలాది మంది ఉపబోధకులు ఉండేవారు ఈ విశ్వవిద్యాలయంలో. ఇక్కడ వైద్యం, విజ్ఞానం, జ్యోతిషం, సాహిత్యం, కళలు, మహాయానబౌద్ధం వంటివి నేర్పబడేవి. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. నాగార్జున, ధర్మపాల, దిజ్ఞాన, శీలభద్ర కమలకేయ వంటివారు ఇక్కడ ఉపకులపతులుగా ఉండేవారు. 7వ శతాబ్దిలో చైనీస్ యాత్రికుడు షాన్ జాంగ్ (XuanZang) ఈ విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు.
ఇతడి మరో పేరు హైయన్ సాంగ్ (Hiuen Tsang, హువాన్ త్సాంగ్ కాదు). 1193లో టర్కీ ముస్లిమ్ చొరబాటు దారుడు ముహమ్మది బఖ్తయర్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయానికి నిప్పంటించి నాశనం చేశాడు అనీ, నిద్రిస్తున్న బౌద్ధసన్యాసుల్ని తలలు నరికి చంపేశాడని చరిత్రకారులు చెప్పారు. ఈ ఖిల్జీ విక్రమశిలా, ఒదంతపురి విశ్వవిద్యాలయాల్ని కూడా ధ్వంసం చేసేశాడు. (మనదేశంలో బౌద్ధాన్ని పెద్దగా నాశనం చేసింది కూడా ఇతడే) ఇతడికి పూర్వమే 1027లో జగద్దల విశ్వవిద్యాలయం ముస్లిమ్ చొరబాటుదారుల దాడికి ధ్వంసం అయింది.
వల్లభి విశ్వవిద్యాలయం సామాన్య శకం 475 -1200లలో సౌరాష్ట్రలో ఉండేది. ఇక్కడ చట్టం, ఆర్థికశాస్త్రం, వ్యవసాయం, జ్యోతిషం వంటివి బోధింపబడేవి. 12వ శతాబ్ది కాలానికి కాంచిపురంలోనూ ఒక విశ్వవిద్యాలయం ఉండేది. ముస్లిమ్ ల దాడులలో దాదాపుగా భారతావనిలో 20 విశ్వవిద్యాలయాలు ధ్వంసం అయ్యాయి.
మనదేశంలో 12 వ శతాబ్ది వరకూ విశ్వవిద్యాలయాల్లో సాగిన ప్రణాళికాబద్ధమైన విద్యావిధానం ముస్లిమ్ చొరబాటు దారుల దాడుల వల్ల ఒకదశలో లేకుండా పోయింది. ముస్లిమ్ రాజుల పాలనలో దేశంలో అప్పటి వరకూ చలామణిలో ఉన్న సాంస్కృతిక, సాంప్రదాయిక విధానాలూ, విద్యావిధానాలూ అల్లకల్లోలం అయిపోయాయి. అటు తరువాత ముస్లిమ్ రాజుల పరిపాలన నుండి దేశంలోని భాగాలు బ్రిటిష్ ప్రభుత్వంలోకి వెళ్లాయి.
“శారీరికంగా భారతీయులే అయినా మానసికంగా వాళ్లను ఇంగ్లీష్ వాళ్లను చెయ్యాలి…” అని అప్పటి ఈస్ట్ ఇండియా పాలకులకు మకాలి ప్రతిపాదన చేశాడు. ఆ ప్రతిపాదన ప్రాతిపదికగా 1835లో మన దేశంలో ఒక విద్యావిధానం అమలులోకి తీసుకురాబడింది. ఇంగ్లీష్ వాళ్ల విద్యాప్రణాళిక మన ఆలోచనావిధానంపై వాళ్లకు కావాల్సిన ప్రభావాన్ని తీసుకొచ్చింది.
ఇవాళ మనదేశంలో చదువుకున్నవాళ్లు అని అనబడుతున్నవాళ్లు విద్యావిషయంగా, సాంస్కృతికంగా, ఆపై చారిత్రికంగా కలోనిఅల్ (colonial) ఆలోచనాసరళితో వ్యవహరిస్తున్నారు. ఇంగ్లిష్ వాళ్లు చూపిన తప్పుడు విధానానికి బలై, వాళ్లు చూపించిన విధానంలో మనల్ని మనం చూసుకుంటూ పెద్దతప్పు చేస్తున్నాం.
ఈ కలోనిఅల్ ఆలోచనవల్ల మన చరిత్ర మనకు కనిపించదు. అందువల్ల అసలు మనకు చరిత్రే లేదని ప్రగాఢంగా నమ్ముతాం. శోచనీయం ఇది. చైనీస్ యాత్రికుడు షాన్ జాంగ్ కంచి వరకూ ప్రయాణించి భారతావనిలో నెలకొని ఉన్న విస్మయకరమైన విద్యావిధానాన్ని ప్రస్తుతించాడు. ఇక్కడి సంస్కృతిని ప్రశంసించాడు.
తక్షశిలా, నలందా విశ్వవిద్యాలయాల కాలానికి ఇంగ్లిష్ రాజ్యం లేదు. మకాలి లేడు. మనకు విద్య మకాలి వల్ల రాలేదు. మకాలి వల్ల ఇంగ్లిష్ వాళ్లకు కావాల్సిన విద్య మనకు వచ్చింది. రామకృష్ణ మఠానికి చెందిన స్వామి హర్షానంద వంటి వాళ్లు కొన్ని దశాబ్దుల క్రితమే ఈ విషయంపై అవగాహన కలిగించేట్టు తెలియజెప్పారు.
ఇవాళ్టికీ మనలో కొందరు ఇంగ్లిష్ పాలనవల్లే మనకు విద్య వచ్చింది అనీ, అసలు మనదేశంలో చదువు అనేదే లేదు అనీ అనుకోవడం, అనడం వాస్తవ విరుద్ధం ఆపై అవగాహనారాహిత్యం. మనదేశంలో విద్య ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. పైన చెప్పబడిన విశ్వవిద్యాలయాల్లో శ్రద్ధ ఉండే అన్ని వర్గాల ప్రజలూ విద్యను అభ్యసించే వారు.
స్వామి వివేకానంద మనదేశంలో ఇంగ్లీష్ వాళ్లు ప్రవేశపెట్టిన విద్యావిధానంలోని ఆంతర్యాన్ని బయట పెట్టారు. ఈ విద్యావిధానంపై స్వామి వివేకానంద చెప్పినవి ప్రతి ఒక్కరూ చదవాలి. ఈ విద్యావిధానంలోని ఆపాయం అర్థమవుతుంది.
మనల్ని మనకే కాకుండా చేయడానికి, మన మధ్య చిచ్చుపెట్టడానికి విద్య ద్వారా ఆర్య , ద్రావిడ భేదాన్ని సృష్టించారు. సరైన ఆధారం చూపకుండా ఆర్య , ద్రావిడ ఆలోచనను మనలో కలిగించింది ఇంగ్లిష్ మేధ. ఆర్య, ద్రావిడ భేదం ఒక అబద్ధం. పలువురు విస్తృతమైన పరిశోధనలు చేసి ఆర్య , ద్రావిడ భేదం కల్పితం అని సహేతుకంగానూ, బుద్ధితోనూ తెలియజేశారు.
ఈ ఆర్య , ద్రావిడ అసత్యాన్ని బట్టబయలు చేస్తూ ఎన్నో గొప్ప రచనలు వచ్చాయి. Aryan Dravidian theoryని ఒక “abandoned theory” అని Oxford Dictionary స్పష్టంగా చెప్పింది. కాలంలో వాస్తవాలు నమోదయ్యాక ఇంగ్లిష్ వాళ్ల Oxford Dictionary వాస్తవాన్ని తెలియజేస్తోంది.
మకాలి విద్యావిధానం వల్ల మనం పెడతోవ పట్టాం. మకాలి ఒక విద్యావిధానాన్ని మనదేశంలో ప్రవేశపెట్టి మానసిక బానిసల్ని సాధించగలిగాడు. దేశానికి స్వతంత్రం వచ్చినా మానసికమైన ఆపై ఆలోచన పరమైన స్వతంత్రం పొందలేక, ఇంకా చింతన పరంగా బానిసత్వాన్ని నింపుక్నున్న వాళ్లు ఉన్నారు అంటే అది మకాలి విద్య ఫలితమే.
సరైన వాటిని చదవకపోవడం, సరిగ్గా చదవకపోవడం, చదివిన వాటిని అర్థం చేసుకోలేకపోవడం మన మేధావులకు ఇతడివల్లే వచ్చింది. బ్రిటిష్ పాలనలో మనపై రుద్దిన విద్యాప్రణాళికకు రూపశిల్పి అయి, ఇవాళ్టి మన మేధావుల్ని మానసిక బానిసల్ని చేసిన మకాలికి ఇంగ్లండ్ లోనే వాస్తవాల్ని వక్రీకరించినందుకు గాను చట్టపరంగా శిక్ష పడింది! “Macaulay, Thomas Babington, 1st Baran Maculay (1800- 59) a convicted historian”. మనదేశంలో ఉద్యోగ విరమణ చేసి (1848) ఇంగ్లండ్ వెళ్లి స్థిరపడ్డాక ఒక దశలో ఇతడు చేసిన లేదా చెప్పిన తప్పులకు ఇతడికి ఇంగ్లండ్ లోనే శిక్షపడింది.
చారిత్రిక తప్పులకూ, సత్యాన్ని బలిచేసినందుకూ శిక్షపడిన చరిత్రకారుడు మకాలి. “Macaulay has been convicted of historical inaccuracy, of sacrificing truth ….” అని ‘Chambers Biographical Dictionary’ లో చెప్పబడింది. ఇతడు తన దేశంలోనే వాస్తవాల్ని వక్రీకరించినందుకు గాను చట్టపరమైన శిక్షను అనుభవించాడు అంటే ఇతడు ఎలాంటివాడో తెలిసిపోతుంది. దీనిని బట్టి మనదేశంలో విద్యావిషయంగా ఇతడు ఏం చేసుంటాడో అర్థం చేసుకోవచ్చు.
మన వాళ్లు మానసికంగానూ, విద్యావిషయంగానూ ఇంగ్లీష్ బానిసత్వం నుంచి విముక్తులవాలి. కాలం చెల్లిన పాత తప్పుల నుంచి మనం బయటపడాలి. కలోనిఅల్ ఆలోచనాసరళికి అతీతంగా వాస్తవాల్ని మనం మెదడుకు ఎక్కించుకోవాలి. మన భావితరాల్ని మనలా సాంస్కృతిక, చారిత్రిక అనారోగ్యం బారినపడకుండా మనం రక్షించుకోవాలి. మనదేశ భవిష్యత్తు సరిగ్గానూ, క్షేమంగానూ ఉండాలి.
– రోచిష్మాన్
9444012279