Suryaa.co.in

Andhra Pradesh

డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త రాష్ట్రంగా మారాలి

– ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ అక్ష‌రాత‌స్య పెంపొందించాలి
– వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకునేలా చేయాలి
– ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్సాప్‌లోనే పొందేలా చూడాలి
– దీని ఉప‌యోగిత‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి
– జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ బాధ్య‌త తీసుకోవాలి
– అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశం
– ఈ నెలాఖ‌రుకు వాట్సాప్‌లో 300 ర‌కాల సేవ‌లందిస్తామ‌న్న అధికారులు*

అమ‌రావ‌తి: రాష్ట్రంలోని ప్ర‌తి పౌరుడూ డిజిట‌ల్ అక్ష‌రాస్యుడిగా మారాలి, త‌ద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త క‌లిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాల‌ని, ఆ దిశ‌గా అధికారులు కృషి చేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. పీపుల్స్ ప‌ర్సెప్ష‌న్‌, ఆర్టీజీఎస్ పైన సోమ‌వారం స‌చివాలయంలో ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ప్ర‌గ‌తి గురించి స‌మీక్షించారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లంద‌రూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ సుల‌భంగా ఉప‌యోగించుకునేలా, ప్ర‌భుత్వం నుంచి ఏ సేవ కావాల‌న్నా అధికారులు, కార్య‌ల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేకుండా కేవ‌లం త‌మ ఫోనులో వాట్సాప్ ద్వారా త‌మ‌కు కావాల్సిన సేవ‌లు పొందే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా క‌ల్పిస్తోంద‌న్నారు.

దీనిపై ప్ర‌జ‌ల్లో ఇంకా కొంత అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ స‌మ‌ర్థ‌వంతంగా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను విరివిగా వినియోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లంద‌రూ ఈ బాధ్య‌త తీసుకుని త‌మ జిల్లాలో ప్ర‌జ‌ల్లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. స‌చివాల‌యాలు, స‌చివాల‌య సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

వాట్సాప్ ద్వారా అర్జీలు ఇవ్వొచ్చు

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌లు కేవ‌లం ప్ర‌భుత్వం నుంచి సేవ‌లు పొంద‌డ‌మే కాద‌ని, ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకోవ‌చ్చ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ స‌దుపాయం గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. నిర‌క్ష‌రాస్యులు కేవ‌లం తమ ఫిర్యాదును వాయిస్ ద్వారా కూడా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌భుత్వానికి తెలిపే స‌దుపాయాన్ని త్వ‌ర‌లో క‌ల్పించ‌బోతున్నామ‌ని తెలిపారు.

పౌరుల్లో డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త పెరిగితే వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగిత కూడా పెరుగుతుంద‌న్నారు. వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ప్ర‌జ‌లు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగించుకునే స‌దుపాయం క‌ల్పించే చ‌ర్య‌లు కూడా వేగంగా చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. డేటా లేక్ ఏర్పాటు డేటా అనుసంధాన ప్ర‌క్రియ కూడా వేగ‌వంతంగా జ‌ర‌గాల‌న్నారు. డేటా లేక్ ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అనుస‌రిస్తున్న అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌ను పాటించాల‌న్నారు.

నెలాఖరుకు 350 సేవ‌లు

వాట్సాప్ ద్వారా ప్ర‌స్తుతం 200 ర‌కాలైన సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నామ‌ని ఐటీ మ‌రియు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఈ నెలాఖ‌రులోపు మ‌రో 150 అద‌న‌పు సేవ‌లు క‌ల్పిస్తామ‌ని త‌ద్వారా వాట్సాప్ ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న సేవ‌లు 350కి చేరుతాయ‌న్నారు. త‌దుప‌రి ద‌శ‌లో మొత్తం 500 సేవ‌లు క‌ల్పిస్తామ‌న్నారు. మే నెల‌లో మొద‌టి ద‌శ డేటా లేక్ ఏర్పాటు పూర్తి చేస్తామ‌ని వివ‌రించారు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సును పెద్ద ఎత్తున ఉప‌యోగించుకుని ఒన్ స్టేట్ ఒన్ యాప్ విధానంలో ప్ర‌జ‌ల‌కు అన్ని సేవ‌లు కేవ‌లం ఒక ప్లాట్‌ఫాంలో ల‌భించేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు.

అన్న క్యాంటీన్ల‌లో భోజనం భేష్

అన్నా క్యాంటీన్ల‌లో భోజ‌నం రుచిక‌రంగా ఉంద‌ని ప్ర‌జ‌లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో పీపుల్స్ ప‌ర్సెప్ష‌న్‌పై సీఎంకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌పై 90 శాతం ప్ర‌జ‌లు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని అధికారులు తెలియజేశారు. అన్న క్యాంటీన్ల‌లో వ‌డ్డిస్తున్న భోజ‌నం రుచిక‌రంగా, నాణ్య‌త ఎలా ఉంది అని అడిగిన ప్ర‌శ్న‌కు భోజ‌నం చాలా బాగుంద‌ని 94 శాతం మంది ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

అన్న క్యాంటీన్ల‌లో ప‌రిశుభ్ర‌త ఎలా ఉంది అని అడిగిన ప్ర‌శ్న‌కు 96 శాతం మంది అన్న క్యాంటీన్లు నీట్‌గా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ‌గా, 4 శాతం మంది మాత్రం ప‌ర‌వాలేదు అని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అలాగే పింఛ‌ను పంపిణీపైన కూడా ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు. పింఛ‌ను పంపిణీ చేసే సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌పై 82.5 శాతం మంది సంతృప్తి చెందారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ ఎక్క‌డైతే ప్ర‌జ‌లు అసంతృప్తి ఎక్కువ‌గా వ్య‌క్తం చేశారో అక్క‌డ స‌మ‌స్య‌లు ఏంటీ అనేది తెలుసుకుని వాటిని పరిష్క‌రించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో పుర‌పాల‌క శాఖ మంత్రి పి.నారాయ‌ణ‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కె.అచ్చ‌న్నాయుడు, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, అట‌వీశాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్. సీఎం కార్య‌ద‌ర్శులు ముద్దాడ ర‌విచంద్ర‌, పీఎస్ ప్ర‌ద్యుమ్న‌, రాజ‌మౌళి, హోంశాఖ ఐటీ సెల్ ఐజీ శ్రీకాంత్‌, ఐజీ ఈగ‌ల్ ఆర్ కె ర‌వికృష్ణ‌, సీఈఓ వి. క‌రుణ‌, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE