మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తాడేపల్లి: అమరావతి రాజధాని కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల మంత్రి స్పందించారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన రాజధాని నిర్మాణానికి నిర్ధిష్ట కాల పరిమితి తీర్పు పై మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాం. చంద్రబాబుకు తన బినామీ భూముల విలువ తగ్గుతుందన్న బాధ. అందుకే అనేక అడ్డంకులను సృష్టిస్తున్నాడు. మేం ఒక్కొక్క అడ్డంకిని అధిగమిస్తూ వెళతాం. మా ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు దగ్గర కన్విన్స్ చేయగలం అనే నమ్మకం ఉంది. మేము రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగ స్ఫూర్తితోనే నిర్ణయాలు తీసుకున్నాం. రైతులకు అత్యధిక మేలు చేసేది మా ప్రభుత్వమే. అమరావతి ప్రాంత రైతులకు ఏ మాత్రం నష్టం లేకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. అన్ని అడ్డంకులు అధిగమించిన వెంటనే విశాఖకు పాలనా రాజధాని ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా విధానమని మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం వైయస్ జగన్ నేడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నగదును జమ చేశారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రైతులకు అండగా ఇవాళ ఇన్ పుట్ సబ్సిడీ, వైయస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణం కార్యక్రమాలు ప్రారంభించారు. గతంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఆత్మహత్యలకు పాల్పడే వారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరువు మండలాలు ఉండేవని, రాష్ట్రంలో ఇవాళ కరువు ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం లేని పరిస్థితి అన్నారు. చంద్రబాబు 2014లో రుణ మాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశాడు. 13 లక్షల టన్నుల ధాన్యం అధికంగా సగటున గత మూడేళ్ల నుంచి ఉత్పత్తి అవుతోందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.