• చేనేతకు మంచి బ్రాండింగ్ కల్పిస్తాం
• ప్రతి కుటుంబం చేనేతను ఆదరించాలి
• చేనేతకు జాతీయ స్థాయిలో 10 అవార్డ్సు గర్వకారణం
– చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్ల
విజయవాడ: ఇండియన్ హ్యాండ్ మేడ్ తో తయారైన చేనేత, హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్ల తెలిపారు. “గాంధీ బునకర్ మేళా”ను(జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2025) ను విజయవాడ శ్రీ శేష సాయి కల్యాణ వేదికలో సోమవారం సుచిత్ర ఎల్ల, చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి.రేఖా రాణి, 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి లతో కలిసి ప్రారంభించారు.
జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2025 ను ప్రారంభించిన అనంతరం జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చేనేత వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ను ఆసక్తిగా గమనించారు. అంతేకాకుండా ఒక్కో చీర తయారీకు ఎన్ని రోజులు పడుతుంది. ఎంత మంది చీర తయారీలో పాల్గొంటారు అని స్టాల్స్ నిర్వాకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్ల హాజరై మాట్లాడుతూ చేనేత, హస్తకళల ప్రొడక్ట్స్ ను జాతీయ, అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు బాధ్యత తీసుకుని పనిచేస్తామన్నారు. ఈ వస్తువులకు బ్రాండింగ్ ఎలా చేయాలో వాటికి ఇంకా ఆదరణ ఎలా చేయాలో అనే విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.
కళలను, ఆర్టిజన్స్ ను, హ్యాండీ క్రాఫ్ట్స్ ను అభివృద్ధి చేయటం మనందరి బాధ్యత అని అన్నారు. మన కుటుంబాలు చేనేతను ఆదరించేలా చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. హ్యాండ్ ల్యూమ్స్ ఒక జీవనోపాధి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ క్రింద మన చేనేతకు 10 అవార్డ్స్ రావడం చేనేతకు గర్వకారణం అన్నారు. మొత్తం దేశంలో 30 అవార్డ్స్ లో మనకు 10 అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఇందులో బాపట్ల జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు, రాష్ట్రంలో 9 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు.
చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి.రేఖా రాణి మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులను పెంచేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ను ఆగస్టు నెలలో ఏర్పాటు చేస్తామన్నారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ రీయింబర్స్ మెంట్ కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచే కార్యక్రమంలో భాగంగా వీటిని ఏర్పాటు చేశామన్నారు.
కార్యక్రమంలో 8 వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, చేనేత, జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్ రాజారావు, డిప్పూటీ డైరెక్టర్ బి.నాగేశ్వరరావు, ఏడీలు హరికృష్ణ, వనజ, తదితరలు పాల్గొన్నారు.
“గాంధీ బునకర్ మేళా” విశేషాలు
“గాంధీ బునకర్ మేళా”ను (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన -2025) ప్రదర్శనలో దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనలో బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, హ్యాండిక్రాఫ్ట్స్ విభాగం లో 5, ఆంధ్ర రాష్ట్రం నుండి 45 చేనేత సంఘాలు పాల్గొననున్నాయి.
ఈ వస్త్ర ప్రదర్శనలో అన్నిరకాల చేనేత ఉత్పత్తులు ఉత్పత్తి ధరలకే అందుబాటులో ఉంచబడును. కాటన్/సిల్క్ చీరలు, డ్రస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, కలంకారి, జంథాని, కార్పెట్స్ వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఈ మేళాలో ప్రదర్శన, అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. కావున, విజయవాడ, పరిసర ప్రాంత ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, చేనేత కార్మికులను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.