Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కూటమి అరాచకాలపై పోరాటం చేస్తాం

– వైయస్‌ జగన్‌ చూపిన మార్గంలోనే తిప్పి కొడతాం
– చంద్రబాబుకి విలువలు, సిద్ధాంతాలు లేవు
– అధికారమే పరమావధి. రాజ్యాంగంపై గౌరవం లేదు
– మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి స్పష్టీకరణ

నరసరావుపేట: మున్సిపల్‌ ఎన్నికల్లో అనైతిక గెలుపు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవషహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అరాచకాలపై పోరాటం చేస్తామని, తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ చూపిన మార్గంలోనే తిప్పి కొడతామని నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు.

రాజ్యాంగాన్ని గౌరవించి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాటిస్తారో లేదో చూద్దామని వేచి చూసిన ప్రజలకు.. ఆయన ఈ ఎన్నికలతో తన విధానాలేంటో చూపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైయస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లు కూల్చివేయడం, దాడులు చేయడం, కిడ్నాప్‌ చేయడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు మినహా మొత్తం మున్సిపాలిటీలను వైయస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. తాడిపత్రిలో మైజారిటీకి ఒకే సీటు తక్కువగా వచ్చింది. నాడు జగన్‌ కావాలనుకుంటే, ఈజీగా ఆ మెజారిటీ సాధించి, అక్కడ కూడా వైయస్సార్‌సీపీ గెల్చేలా చేయొచ్చు. కానీ, ఆయన ఆ పని చేయకపోవడంతో, అక్కడ టీడీపీ ఛైర్మన్‌ పదవి దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా అంగీకరించారు.

పిడుగురాళ్లలో మొత్తం 33 స్థానాల్లో వైయస్సార్సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. కానీ నేడు పోలీసులును అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు కిడ్నాప్‌లు చేసి వైస్‌ ఛైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్‌ సైదావలికి సెల్యూట్‌ చేస్తున్నా. ప్రలోభాలకు గురి చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, ఆఖరికి కష్టపడి కట్టుకున్న ఇంటిని, ఆయన బంధువు ఇంటిని కూల్చివేసినా టీడీపీకి మద్దతి­చ్చేది లేదని తేల్చి చెప్పాడు. సైదావలి లాంటి కార్యకర్తలే జగన్‌కు శ్రీరామ రక్ష. వారిని పార్టీ పరంగా అన్నివిధాలా ఆదుకుంటాం.

ఎవరెవరు బెదిరిస్తున్నారో, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారో అందర్నీ గుర్తుంచుకుంటాం. ఎవర్నీ వదిలిపెట్టం. చట్ట విరుద్ధంగా పని చేస్తూ, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న పోలీసులందర్నీ గుర్తుంచుకుంటాం.

LEAVE A RESPONSE