Suryaa.co.in

Andhra Pradesh

రెండేళ్లలో 50 లక్షల కేబుల్ కనెక్షన్లకు పెంచుతాం

• ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్ వర్క్
• గ్రామీణ ప్రాంతాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ ను చేరువ చేస్తాం
– ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ గా జీవీ రెడ్డి
– ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి

విజయవాడ: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3వ అంతస్థు లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీసులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్లను రెండేళ్ల‌ కాలంలొ యాభై లక్షలకు పెంచుతామన్నారు.

నాకు చైర్మన్ గా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించారన్నారు.

ఇది సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్ వర్క్ అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఏపీఎస్ఎఫ్ఎల్ అని అన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల కేబుల్ కనెక్ష న్లు మాత్రమే ఉన్నాయన్నారు. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీస్ లు ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతామన్నారు. ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లకు పోటీగా ప్రజలకు సర్వీస్ లు అందిస్తామన్నారు.

గత ప్రభుత్వం లో ఏం జరిగింది, ఏం చేశారనే అంశాల పై త్వరలోనే ఆధారాలతో మాట్లాడతానన్నారు. ఎపి ఫైబర్ నెట్ ను ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇంటర్ నెట్, ఫోన్, కేబుల్ పూర్తి క్వాలిటీ తో అందిస్తామన్నారు. నేడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సహజంగా మారి పోయిన తరుణంలో నెట్ కనెక్షన్ అందరికీ ఆవశ్యకమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఈ సేవలు అందాల్సిన అవసరం ఉందన్నారు. 2014 లో ప్రారంభ సమయంలో ‌బాగా కనెక్షన్లు తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రైవేటు సంస్థ లకు కనెక్షన్ల కోసం మళ్లారన్నారు.

మళ్లీ పూర్తి క్వాలిటీ తో ప్రసారాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. యాభై లక్షల కనెక్షన్లు రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం లో అక్రమాల పై అధ్యయనం చేసిన తరువాత స్పందిస్తానన్నారు. ప్రజలకు నాణ్యమైన ప్రసారాలు అందచడం పైనే ప్రస్తుతం మా ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయన్నారు.

చైర్మన్ ను అభినందించిన వారిలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, గాలి భానుప్రకాష్, బీఎన్ విజయ్ కుమార్, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, కొండ్రు మరళీ మోహన్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, నాయకులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పాతూరి నాగభూషణం తదితరలు ఉన్నారు.

LEAVE A RESPONSE