Suryaa.co.in

Telangana

ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులందరినీ క్షేమంగా రప్పిస్తాం

– కేంద్ర మంత్రి కార్యాలయానికి ఇప్పటికే లేఖ రాశాం
– విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం
– ఎవరూ టెన్షన్ పడొద్దని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం నేపథ్యంలో భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థినీ, విద్యార్థులందరినీ స్వదేశానికి రప్పించేందుకు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని చొప్పదండి నియోజకవర్గంలో బండి సంజయ్ పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ వీడియో సందేశాన్ని పంపారు. అందులోని ముఖ్యాంశాలు…

ఉక్రెయిన్ లో ఉన్న 20 వేల మంది భారతీయ విద్యార్థినీ, విద్యార్థులను తరలించేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే విదేశీ దౌత్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఉక్రెయిన్ లో నివసిస్తున్న, విద్యనభ్యసిస్తున్న తెలంగాణ పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో తెలంగాణ విద్యార్థినీ, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? వారిని రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విదేశాంగ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశాం.

తెలంగాణ విద్యార్థుల వివరాలు సేకరించేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను సైతం ఏర్పాటు చేశాం. కాబట్టి ఎవరూ టెన్షన్ పడొద్దు. అక్కడున్న భారతీయులను క్షేమంగా తరలించే బాధ్యత కేంద్రం తీసుకుంది. మేం నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం.

భారత్ మొదటి నుండి శాంతిని కోరుకునే దేశం. అమెరికాతో శత్రుత్వం లేదు, రష్యాతో ఇబ్బంది లేదు. అన్ని దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగిస్తూ శాంతి వాతావరణం నెలకొల్పడమే భారత్ లక్ష్యం. యుద్దాన్ని భారత్ కోరుకోవడం లేదు. యుద్దం ఆగడానికి అవసరమైన అన్ని దౌత్యపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.

నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఏ కూటమికి మద్దతు ఇవ్వడం లేదు. తటస్థ వైఖరి తీసుకుంటున్నాం. అవసరమైతే శాంతి కోసం పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాం.
రష్యాతో మాకు పంచాయతీ లేదు. అమెరికాతో శత్రుత్వం లేదు. మోదీ విదేశీ నీతి కారణంగా అన్ని దేశాలు భారత్ వైపు చూస్తోంది.

కరోనాకు ముందు ప్రపంచం వేరు… కరోనా తరువాత వేరు… భారత్ దేశం ప్రపంచానికి దిక్సూచిగా నిలిచింది. వ్యాక్సిన్ విషయంలో 30 దేశాలకు సరఫరా చేసింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ద ప్రభావం భారత ఆర్దిక వ్యవస్థపై ప్రభావం పడకుండా మోదీ ప్రభుత్వం యత్నిస్తోంది. ముఖ్యంగా పెట్రో ధరలను అదుపు చేయడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

LEAVE A RESPONSE