– పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించండి
– నారావారి ఆరోగ్య సేవా అని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు
– వెంటనే రూ.2700 కోట్లు విడుదల చేయండి
– నిధుల విడుదలకు ఏపీసీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరసన
విజయవాడ : రాష్ట్రంలో ఆరోగ్యం స్ట్రెచర్ ఎక్కింది. ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యానికి భరోసా… ఈ పథకాన్ని స్ట్రెచర్ ఎక్కించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మండిపడ్డారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో ఏమన్నారంటే.. ఆరోగ్య శ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతోంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని కోమాలో నెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇదెక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. అనాడు వైఎస్ఆర్ హయాంలో పథకం గొప్పగా సాగింది. వైఎస్ఆర్ కి గొప్ప పేరు తెచ్చి పెట్టిన పథకం ఆరోగ్య శ్రీ. వైఎస్ఆర్కి పేద ప్రజల పట్ల ప్రేమకు నిదర్శనం ఆరోగ్య శ్రీ పథకం.
పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని పథకాన్ని రూపకల్పన చేశారు. వైద్యం కోసం ఆస్తులు అమ్మకూడదు.. అప్పుల పాలు కాకూడదు అని ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదవాడికి కార్పొరేట్ వైద్యం కోసం పెట్టిందే ఆరోగ్య శ్రీ. వైఎస్ఆర్ గుండెల్లో నుంచి ఆరోగ్య శ్రీ పథకం పుట్టింది.
ఆరోగ్య శ్రీ ద్వారా కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారు. ఈరోజు వరకు కూడా ఆరోగ్య శ్రీ కింద ఏడాదికి 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పునర్జన్మ పొందుతున్నారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్య శ్రీ కొనసాగించే పరిస్థితి లేదు.
బిల్లులు చెల్లించలేదు అని గత 14 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపి వేశారు. ఆరోగ్య శ్రీ కింద కేసులు పట్టకుండా రోగులను తిప్పి పంపిస్తున్నారు. కనీసం రోజుకు ఎనిమిది వేల ఆరోగ్య శ్రీ కేసులు రాష్ట్రంలో నమోదు అవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆరోగ్య శ్రీ అందకుండా పడుతున్న బాధలకు సమాధానం ఎవరు చెప్తారు? ఆరోగ్య శ్రీ తీసివేస్తే మళ్ళీ ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలా? లేకుంటే వైద్యం అందలేదు అని చనిపోవలా? రాష్ట్ర ప్రజలకు వైద్యం అందక చావమని చెప్పకనే చెప్తున్నారా? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే ఇదేనా మీరు కలిగించే భరోసా?
పేద ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఆరోగ్య భద్రత ఇవ్వని మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద బెడ్లు లేవు. పథకం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతంగా అమలు చేయడం ఏంటి ? ఆరోగ్య శ్రీ కింద ప్రతి నెల 350 కోట్ల మేర ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాలి. కూటమి పాలన 16 నెలల్లో 5900 కోట్ల మేర బిల్లులు పెట్టారు. ఇందులో 5200 కోట్లు మాత్రమే చెల్లించారు
ఇంకా 700 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత వైసీపీ పాలనలో 2024 ఏప్రిల్ నాటికి 2 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.
ఇవి ఇంతవరకు చెల్లించలేదు. మొత్తం కలుపుకొని 2700 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. ఇంత మొత్తం పెండింగ్ పెడితే ఆసుపత్రులు ఎలా నిలదొక్కుకుంటాయి?
బకాయిలు వైసీపీ పాలనలో ఉన్నవే అని కూటమి ప్రభుత్వం తప్పించు కుంటుంది. వైసీపీ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే ఆ బకాయిలు వైసీపీ పెట్టింది సరే. వాళ్ళకు ఉన్న బుద్ధి హీనత ఆది. వైఎస్ఆర్ పథకం అని తెలిసి బకాయిలు పెట్టారు. కానీ పాత బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత మీదే. మీ బుద్ధి ఎక్కడకు పోయింది అని అడుగుతున్నాం. ప్రజలు మీకు అధికారం ఇస్తే మీకు బాధ్యత లేదా అని ఆడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్లను పరిగణలోకి తీసుకోండి.
2700 కోట్ల వెంటనే చెల్లించండి..లేదా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు ముందు 7 వందల కోట్లు అయినా విడుదల చేయండి. ఆరోగ్య శ్రీ పథకాన్ని చంపుతాం అంటే ఊరుకోం. పథకానికి ఏ పేరు అయినా పెట్టుకోండి. ఆరోగ్య శ్రీ ఎన్టీఆర్ వైద్య సేవా అయినా సరే… నారావారి ఆరోగ్య సేవా అయినా సరే… పథకాన్ని కొనసాగించండి. ఆరోగ్య శ్రీ పెట్టీ వైఎస్ఆర్ దేవుడు అయితే… చంద్రబాబు రాక్షసుడు అయ్యాడు. ఇప్పటి వరకు లక్షమంది రోగులకు ట్రీట్మెంట్ అందలేదు. ఆరోగ్య శ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించక పోతే నేను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరిస్తున్న.