– మహిళల రక్షణకు శక్తి యాప్ తెచ్చాం, పోలీసులు అప్రమత్తంగా లేకపోతే చర్యలు
– ఈగల్ వ్యవస్థతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం
– రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం
– నా రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకు తావులేదు
– గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం,ఇప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం
– శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి: శాంతి,భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే తాటతీస్తామని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రజలు స్వేచ్చగా తిరగలేని పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలు భయం లేకుండా సంతోషంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యమని అన్నారు.
ఈగల్ తో డ్రగ్స్,గంజాయిపై ఉక్కుపాదం
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో డ్రగ్స్ , గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. బాధ్యతకలిగిన ప్రతిపక్షంగా దీనిపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తే తిరిగి మా కార్యలయంపైనే దాడులు చేశారు. ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ కార్యాలయమంటే దేవాలయం. గతంలో ఎక్కడా పార్టీ ఆఫీస్ లపై దాడులు జరిగిన ఘటనలు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చూడలేదు. రాజకీయ కక్షసాధింపులకు నేను దూరంగా ఉంటాను. గత పాలకులు కనీసం గంజాయి, డ్రగ్స్ పై సమీక్ష చేయలేదు.
అసెంబ్లీలో చర్చించిన పాపాన పోలేదు. మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారిలో మార్పు అంత తేలిగ్గా రాదు. వ్యవస్థీకృతంగా మారిన గంజాయిసాగు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చాం. స్వార్ధం కోసం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి పండించేందుకు వీల్లేదు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడికక్కడ ఏజెన్సీలను పెట్టి రాష్ట్ర సరిహద్దుల్లోకి కూడా డ్రగ్స్ రానివ్వము. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం.తమ పిల్లలు ఎలా ఉంటున్నారో తల్లిదండ్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేయాలి.
సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాస్తే అంతే సంగతులు
గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారారు. సోషల్ మీడియా ముసుగులో రోత పుట్టించే రాతలు రాశారు. మహిళలపై వ్యక్తిగత దూషణలు చేశారు. ఆడబిడ్డలు తలెత్తుకుని తిరగలేని విధంగా పోస్టులు పెట్టారు. అసెంబ్లీ లోపల, బయటా బూతులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వాటన్నింటికీ చెక్ పెట్టాం. అసెంబ్లీలో బూతులకు తావులేదు. అర్ధవంతమైన చర్చ జరుగుతోంది. మరోవైపు తీవ్ర వాదం అరికట్టాలి. మత సామరస్యం పెంచాలి. ముఠా నాయకులు, రౌడీ అనే మాట వినపడకూడదని నేను గతంలో కూడా మెసేజ్ ఇచ్చి ఆచరణలో చేసి చూపించాను.
పేదల భూములు కాపాడతాం
ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం కింద కొత్త చట్టం తీసుకొస్తున్నాము. గత పాలకులు చేసిన భూ మాఫియా అంతా ఇంతా కాదు. 22 ఏ ఉపయోగించి భూ దందాలు చేశారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రభుత్వ, పేదల , ఫారెస్ట్ భూములు కొట్టేశారు. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. భూ కబ్జాలకు పాల్పడితే కొత్త చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తాం. ఇకపై ఎవరైనా భూ కబ్జా అనాలంటే భయపడాలి. నేరాలు చేసి ,సాక్ష్యాలు తారుమారు చేసి తప్పించుకునే వారికి కాలం చెల్లింది రాత్రి సమయంలో డ్రోన్ పెట్రోలింగ్ చేస్తాము. సీసీ టీవీ కెమెరాలు పెడుతున్నాం.. 26 సైబర్ సెక్యూరిటీ స్టేషన్లు పెడుతున్నం. నేరస్థులను వెంటనే పట్టుకుంటాం. నేను సమైక్యాంధ్రలో ప్రతి రెవెన్యూ డివిజన్ కు పోలీస్ డ్వ్రాగ్స్ ను పెట్టి నేరాలకు అడ్డుకట్ట వేశాను.
రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలు
సంచలనం కలిగించిన వివేకానంద హత్య ఉదంతం తలుచుకుంటే ఆందోళన కలుగుతుంది. ఆ కేసుకు సంబంధించి 6 మంది సాక్ష్యులు చనిపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2019లో వివేకా హత్య జరిగింది. మొదట వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎన్నికల హడావుడిలో నేనూ అదే నిజమనుకున్నాను. నేరస్థులు ఏ విధంగా ట్రాప్ లో వేస్తారో ఇదో ఉదాహరణ.
మధ్యాహ్నానికి బాడీ పోస్టుమార్టమ్ చేయాలని ఆయన కూతురు సునీత అడిగారు. ఆవిడ పోస్టుమార్టమ్ అడగకపోతే నిజం సమాధయ్యేది. అప్పటివరకూ గుండెపోటు అని ప్రచారం చేసిన టీవీ చానల్ పోస్టుమార్టమ్ తర్వాత మాట మార్చింది. నారాసుర రక్త చరిత్ర అని నాపై విష ప్రచారం చేశారు. ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేశారు.
నా 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎక్కడా హత్యా రాజకీయాల మరక అంటకుండా ఉన్నాను. హత్యారాజకీయాలు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడేలా చేశాను. రాజకీయ ముసుగులో నేరాలు చేసి తప్పించుకుంటానంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వను. ప్రజలకు భద్రత కల్పించడం మన బాధ్యత. నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ ఎమ్మెల్యేల బాధ్యత. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే పేట్రేగుతారు. ప్రభుత్వం కఠినంగా ఉంటే అందరూ లైన్ లోకి వస్తారు.
మహిళా భద్రతకు శక్తి యాప్
ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసేవారి తాట తీస్తాం. గత టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం జరిగింది. 18 టాస్క్ ఫోర్స్ లు నియమించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ మోహరించాను. ప్రభుత్వం శిక్షిస్తుందనే భయంతో నిందితుడు ఉరేసుకుని చనిపోయాడు. ఆడబిడ్డల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆనాడు విజయవాడలో ర్యాలీ నిర్వహించాం. మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తెచ్చాం. ఆడబిడ్డలపై అత్యాచారాలకు ఒడిగడితే అదే వారికి చివరిరోజు.
అత్యవసర పరిస్థితులు లేక ఆపదలో చిక్కుకున్నప్పుడు మహిళలు శక్తి యాప్ లో ఫిర్యాదు చేస్తే చాలు…నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షిస్తారు. గత ప్రభుత్వంలో దిశా యాప్ అని ప్రచారం చేశారు. ఏమైంది..దిక్కుమాలిన యాప్ గా మిగిలింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులదే. మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా లేకపోతే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.