– మీకు జవాబుదారీతనంగా ఉండటం మా కర్తవ్యం
– మీ సమస్య-మా బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీరామ్
– ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం: ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే వరకు విశ్రమించమని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా పరిటాల శ్రీరామ్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించగా, కార్యక్రమాన్ని అందరికంటే ముందుగా పూర్తి చేసిన శ్రీరామ్.. ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు మరో కొత్త ఆలోచన చేశారు.
మీ సమస్య-మా బాధ్యత అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలోని శివానగర్, కేశవ నగర్లలో ఈ కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించారు. ముందుగా పరిటాల శ్రీరామ్ శివానగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కేశవ నగర్ లో కూడా గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించాలని పరిటాల శ్రీరామ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయని… వాటి పరిష్కారానికి కచ్చితంగా తాము కృషి చేయాల్సిన బాధ్యత ఉందని భావించామన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన వాటి గురించి ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తామని వివరించారు. ఇప్పటి వరకు పింఛన్ల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. పింఛన్లు అర్హత లేని వారికి ఎక్కువగా వస్తున్నాయని.. అలాగే అర్హత ఉండి కూడా ఇవ్వడం లేదన్నవి వచ్చాయన్నారు. హౌస్ మ్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగి ఒకే రేషన్ కార్డులో ఉన్నారన్న కారణంతో.. చాలా మందికి పథకాలు అందడం లేదన్నారు. హౌస్ మ్యాపింగ్ అంశాన్ని రాష్ట్రస్థాయిలో అధికారులతో చర్చిస్తామన్నారు.