– ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు
– కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు
– విద్యార్థులకు పుస్తకాలు, ఇతర సామాగ్రి అందించేందుకు చర్యలు
– కామారెడ్డిలోని జీఆర్ కాలనీ సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కామారెడ్డి: భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల నేపథ్యంలో వెంటనే తాత్కాలికంగా సమస్య పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అప్రమత్తంగా ఉండటం వల్లే ఆస్తినష్టం జరిగినా ప్రాణనష్టం తగ్గించగలిగాం.
వరదలు రాగానే క్షేత్రస్థాయికి వెళ్ళాల్సిందిగా ఇంచార్జ్ మంత్రి సీతక్కను, షబ్బీర్ అలీ, ఎంపీ షెట్కర్ తో పాటు ఎమ్మెల్యేలను ఆదేశించా. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశా. అయినా ప్రత్యక్షంగా చూసి మీ సమస్యలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చా.
పూర్తి స్థాయి వరద నష్టంతో పాటు మళ్లీ ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. మీ సమస్యల పరిష్కారానికి వంద శాతం ప్రభుత్వం కృషి చేస్తుంది.
విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామాగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం. విద్యార్థినీ విద్యార్థులకు సీఎస్ఆర్ ఫండ్స్ తో సహాయం చేసేందుకు పరిశ్రమలతో మాట్లాడాలని అధికారులకు సూచిస్తున్నా.
నేను ఆనాడు చెప్పా.. ఈనాడు చెబుతున్నా. కొడంగల్ కు నేను ఎంత సాయం చేస్తానో, కామారెడ్డికి కూడా అంత సాయం చేస్తా. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, పశు సంపదను కోల్పోయిన వారికి సాయం అందించండి. ధైర్యంగా ఉండండి… ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.
బుడిగిడ గ్రామంలో…
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది. ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుంది. మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు. మీకు అండగా ఉండి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా.
వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం.
పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి.