దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను మళ్లీ నిలబెడతాం

– జగన్ అరాచకపాలనతో దెబ్బతిన్న ఎపి బ్రాండ్
-అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులనూ వేధించారు
-మేం వచ్చాక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్

మంగళగిరి: జగన్ అరాచకపాలనతో ఎపి బ్రాండ్ దెబ్బతిందని, జె-ట్యాక్స్, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి అపర్ణ అపార్ట్ మెంట్ లో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా అక్కడ నివాసితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 2014లో రాష్ట్ర విభజన తర్వాత కనీసం నిలువ నీడకూడా లేని ఎపికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అహోరాత్రులు శ్రమించి గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ధీటుగా తీర్చిదిద్దారు.

ఒక్కఛాన్స్ మాయలో పడి జగన్ ను గెలిపించినందుకు నేడు 5కోట్లమంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జగన్ దెబ్బకు ఎపిలో తప్ప వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళతామనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు వచ్చారు.

దేశంలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న భారత్ బయోటెక్ ఒరిస్సాలో తమ యూనిట్ ను ఏర్పాటుచేసింది. రాష్ట్రఖజానాకు అత్యధికంగా పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చే అమర్ రాజాను వేధించడంతో తెలంగాణాకు వెళ్లి యూనిట్ స్థాపించారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయింది ఎపిలోని చదువుకున్న నిరుద్యోగ యువత. రాష్ట్రప్రజలు ఆలోచించి ఈ ఆరాచక విధానాలకు ఓటుద్వారా చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రతిజిల్లాకు ఒక్కో ఫోకస్ సెక్టార్ ను ఏర్పాటుచేసి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. అనంతపురంలో ఆటోమొబైల్, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, కర్నూలులో సోలార్ ఎనర్జీ, విశాఖలో ఐటి, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పామాయిల్.. ఇలా ప్రతిజిల్లాకు అక్కడ ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలను ప్రోత్సహించారు. ఫలితంగా చంద్రబాబు హయాంలో 40వేల పరిశ్రమలు, 6లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్ ప్రభుత్వమే చెప్పింది.

సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ ముందుకు నడిపించాలన్నది టిడిపి విధానం. అభివృద్ధి చేయకుండా ఎడాపెడా అప్పులు చేయడంవల్ల ఆ భారం రాష్ట్ర ప్రజలంతా మోయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎపిలో జరుగుతున్నది ఇదే. సంక్షోభాలను సవాల్ గా స్వీకరించి అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబు గారికి వెన్నతోపెట్టిన విద్య.

1995. 2014లో కూడా గడ్డు పరిస్థితుల్లోనే రాష్ట్రపగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు నిరంతర అవిశ్రాంతంగా శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించారు. జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ఎన్నికలయ్యాక చంద్రబాబునాయుడు ఖచ్చితంగా గాడిలో పెడతారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది, వారు పనిచేసే ఆఫీసుల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను కూడా దొంగలుగా చిత్రీకరించి వేధింపులకు గురిచేశారు. పదవీవిరమణ చేసినవారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి సౌకర్యాలతో సొంతభవనాలు నిర్మిస్తామని యువనేత లోకేష్ చెప్పారు.

Leave a Reply