Suryaa.co.in

Andhra Pradesh

మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* వీరజవాను తల్లిదండ్రులకు పరామర్శ
* ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్ అందజేత
* 5 ఎకరాలు, 6 సెంట్ల స్థలం పట్టాలు కూడా…
* గోరంట్ల, సత్యసాయి జిల్లా కేంద్రంలో మురళీ కాంస్యం విగ్రహాల ఏర్పాటు
* వీర సైనికుడి ఇంటి నుంచి ఘాట్ వరకూ రూ.16 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం : మంత్రి సవిత

గోరంట్ల/శ్రీ సత్యసాయి : దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వీర మరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ తల్లీతండ్రులను మంత్రి సవిత మంగళవారం పరామర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల చెక్కును, అయిదెకరాల స్థలాన్ని, ఆరు సెంట్ల ఇళ్ల స్థలం పట్టాలను మురళీ నాయక్ తల్లిదండ్రులకు మంత్రి సవిత అందజేశారు. భరతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ అని కొనియాడారు. దేశ ప్రజలందరి గుండెల్లో మురళీ నాయక్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. దేశ ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని వీర జవాను తల్లిదండ్రులను ఓదార్చారు.

ఏ కష్టం వచ్చినా తనను సంప్రదిస్తే వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతకుముందు కల్లితండాలోని మురళీ నాయక్ ఘాటు వద్దకెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. త్వరలోనే మురళీ నాయక్ నివాసం నుంచి ఘాటు వరకూ రూ. 16 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
గోరంట్లతో పాటు జిల్లా కేంద్రంలో కూడా మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE