-చంద్రబాబు ఏపీలో పుట్టడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం
-వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు: కుప్పంతో సహా 175 నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, కోటి కుటుంబాలకు పైగా వైయస్ జగన్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, గృహ సారథులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో పర్యటిస్తూ సంక్షేమ పాలనను వివరిస్తూ మెగా పీపుల్స్ సర్వే చేపడుతున్నారన్నారు. ప్రజల అనుమతితో ఇంటింటికీ మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఫేక్ సర్వేలు ప్రచారం చేస్తూ కొన్ని ఛానల్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరన్నారు. కుప్పంతో 175 నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇటీవల నేషనల్ ఛానల్స్ ఇచ్చిన సర్వే ఫలితాల్లో వైయస్‌ఆర్ సీపీకి 24–25 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారంటే.. సీఎం వైయస్ జగన్ పెట్టిన 175 టార్గెట్ చేరుకోవడం అంత కఠినం కాదని రుజువవుతుందన్నారు. కచ్చితంగా కుప్పంతో సహా 175 స్థానాలే లక్ష్యంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, విజయం సాధిస్తుందని మంత్రి కాకాణి ధీమా వ్యక్తం చేశారు.