Home » 78 స్థానాలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం

78 స్థానాలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం

సనత్‌నగర్ ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని ధీమా
పుట్టిన గడ్డపై తలసానికి స్థానికుల ఆశీర్వాదం
డిప్యూటీ స్పీకర్ పద్మారావును కలసి ఓటు అడిగిన బీఆర్‌ఎస్ అభ్యర్ధి తలసాని శ్రీనివాసయాదవ్

రాష్ట్రంలో 78 స్థానాలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని సనత్ నగర్ MLA అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా డివిజన్ లో గల సాంబమూర్తి నగర్, ఆదయ్య, గ్యాస్ మండి లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. టకారా బస్తీలోని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఇంటికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ తో కలిసి వెళ్ళి ఓటు వేయాలని అభ్యర్ధించారు.

మంత్రి పుట్టి పెరిగిన బస్తీ ఆదయ్య నగర్ లో ప్రతి ఇంటి వద్ద శాలువాలు కప్పి, నుదుటన తిలకం దిద్ది మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మంత్రిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ తమ ఓట్లు మొత్తం మీకే అంటూ ప్రతి ఇంటా వాగ్దానం చేశారు. మంత్రి మిత్రులు, సన్నిహితులు మంత్రిని శాలువాలతో సత్కరించి ఆలింగనం చేసుకొని తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. తమ కుంటుంబ సభ్యులు మంత్రితో కలిసి గ్రూప్ ఫోటోలు కూడా దిగారు.

సుమారు 3 గంటల పాటు ఏకధాటిగా మంత్రి అన్ని వీధులలో ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రచారం లో పలువురు పలు వ్యక్తిగత సమస్యలను మంత్రికి విన్నవించగా ఎన్నికల అనంతరం పరిష్కరించే బాధ్యత నాదేనంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ లోని అన్ని స్థానాలలో BRS పార్టీ గెలుస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని చెప్పారు.

BRS ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి తప్పక గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఉన్న సిలెండర్ ను 400 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఇవే కాకుండా ఇంకా పలు హామీలతో కూడిన మేనిఫెస్టో ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేసినట్లు తెలిపారు.

గత ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అనేకం అమలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటించారంటే అవి నూటికి నూరుశాతం అమలు అవుతాయని వివరించారు. తాను పుట్టి పెరిగిన ఆదయ్య నగర్, సాంబమూర్తి నగర్ లలో ప్రజల అవసరాలు, ఇబ్బందులు తెలుసునని, వాటిని అన్నింటిని పరిష్కరించానని చెప్పారు.

గ్యాస్ మండి లో వాలీ బాల్ గ్రౌండ్ అభివృద్ధి, ఆదయ్య నగర్ లో డిజిటల్ లైబ్రరీ నిర్మాణం, రోడ్ల అభివృద్ధి వంటి అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ BRS అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాయకులు నాగులు, రాములు, ఓదెల సత్యనారాయణ, హన్మంతరావు, జయరాజ్, మధు, ప్రమోద్, మహేష్ యాదవ్, మహేందర్, అశోక్ తదితరులు ఉన్నారు.

Leave a Reply