– నేతన్నల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గళం
అమరావతి: కోవూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలైన పాటూరు, గుమళ్లదిబ్బ వంటి ప్రాంతాల్లో చేనేతలు అధికంగా ఉన్నారని, నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అధిక ఉపాధి కల్పించే చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆమె శాసన సభలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. హ్యూమన్ రిసోర్సస్ అండ్ ఐటి మినిష్టర్ లోకేష్ బాబు ప్రాతినిధ్యం వహించే మంగళగిరిలో “వీవర్స్ శాల” లాంటి నాలెడ్జ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ ను రాష్టవ్యాప్తంగా విస్తరించే ప్రతిపాదన ఉందా, ఉంటే అలాంటి వెసులుబాటు కోవూరు నియోజకవర్గానికి కల్పించాలని విన్నవించారు. చేనేత కార్మికులకు హెల్త్ ఇన్య్షూరెన్స్ కల్పించేదానిపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని, అనర్హులకు పథకాలు అమలు చేసి అర్హులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకు మేలు జరిగేలా వివిధ కార్యక్రమలు అమలు చేస్తున్నామన్నారు. ఆప్కో షోరూం లను కూడా ప్రారంభిస్తున్నామన్నారు. బిర్లా కంపెనీతో కూడా చర్చించామని, నాలుగు, ఐదు జిల్లాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు వారు ముందుకు వచ్చారన్నారు. వీవర్స్ శాలలకు సంబంధించి ఇద్దరు ఎంపీలు ఆయా జిల్లాల్లో ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.