– కూటమి పాలనపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు: చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల తరహాలోనే ఆయన నిర్వహించిన సూపర్ సిక్స్ సక్సెస్ సభ కూడా సూపర్ ప్లాప్ అయిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ కార్యాలయంలో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు.
రైతులకు కనీసం యూరియా కూడా సరఫరాచేయలని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని ఎరువులు కొరత లేదని చెబుతున్న వ్యవసాయశాఖ మంత్రికి దమ్ముంటే మీడియా సాక్షిగా క్షేత్రస్దాయి పరిశీలకు సిద్దమా అని సవాల్ విసిరారు. రైతు సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు అండ్ టీం జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అత్యంత హేయంగా వ్యక్తిగత దాడికి దిగడం పై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం ఎంత నిర్భంధం విధించినా అన్నదాతల సమస్యల పరిష్కారానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఇవాళ నెల్లూరు వైయస్సార్సీపీ కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో కలిసి ఎస్సీ విభాగం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రైతు సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా ఎండగట్టారు. జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు, మంత్రులు ఆయనపై అత్యంత హేయమైన భాషతో దాడికి దిగారు.