Suryaa.co.in

Editorial

సచివులు సాధించేదేమిటి?

– రోజారెడ్డి మధ్యలో.. ఆ ముగ్గురు చివరన
– స్వయంసిద్ధులవుతారా? సీఎంఓ అధీనులవుతారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

మూడేళ్ల తర్వాత జగనన్నకు మూడొచ్చి మంత్రివర్గ విస్తరణ చేశారు. జగన్ అనే నేను.. అంటూ బెజవాడ స్టేడియంలో అభిమానుల ఆనందోత్సాహాల నడుమ ప్రమాణం చేసిన జగనన్న, రెండున్నరేళ్ల తర్వాత అందరికీ పీకేస్తానని ప్రకటించారు. అంటే పెళ్లికొడుకు అప్పుడే శుభం పలికేశారన్నమాట. కానీ వారిని పీకేసేందుకు అన్న ఆరునెలలు సమయం ఎందుకు తీసుకున్నారో తెలియదు. జగనన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడరు. పెద్ద పెద్ద నాయకులే ఆయన దర్శనం కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తుంటారు. ఇక మీడియాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటారు కాబట్టి, ఆయన మనసులోమాట తెలుసుకోవడం బహు కష్టం. అందువల్ల ఎవరికి వారు తమ స్థాయిలో ఊహించుకోవడమే తప్ప, అంత:పుర రహస్యాలెవరికీ తెలియవు.

సరే.. మంత్రుల మూడేళ్ల ముచ్చటకు నవమితో నూరేళ్లూ నిండి, రెండేళ్ల పరిమితితో కూడిన కొత్త సంసారం వచ్చింది. సంతోషం. జీవితంలో ఒకసారి మంత్రి కావాలని ఒకరు, అసలు తమకు మంత్రులయ్యే యోగ్యత ఉందా లేదానని అనుమానించేవారికి మంత్రి పదవులొచ్చాయి. మంత్రులంటే ఏమిటి? ల్యాంపు కారు, ముందు వెనుక ఎస్కార్ట్, పైలెట్ కార్ల గోల, ఆఫీసర్లు-అటెండర్ల హడావిడి, నియోజవకర్గంలో ఫ్లెక్సీల స్వాగతాలు. అధికారులకు ఆర్డరు వేస్తే అది పంచకల్యాణి గుర్రం మాదిరిగా పరుగులు తీయాలి. తన శాఖలో తన మాట చెల్లుబాటు కావాలి. జిల్లా కలెక్టరు, ఎస్పీ తన మాట వినాలి. బదిలీల పర్వంలో తానే బాహుబలి కావాలి. మంత్రులు కోరుకునేవి ఇవే కదా?

jagan-kcrమరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సచివులకు ఆ సౌభాగ్యం దక్కుతోందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పేరుకే మంత్రులు గానీ పెత్తనమంతా సీఎంఓదే అన్నది మనం మనుషులం అన్నంత నిజం. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఇద్దరూ మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వరన్నది బహిరంగ రహస్యం. వారు తలచుకుంటేనో, తెల్లారి సీఎంల కలలో సదరు మంత్రులు/ఎమ్మెల్యేలు కనబడితేనే తప్ప, తెల్లారి ముఖ్యమంత్రుల దర్శనభాగ్యం దుర్లభం. ప్రజాస్వామ్యంలో ఉన్నా రాజరికపు సంప్రదాయమంటేనే వారికి ఇష్టం. వారికి అదో తుత్తి.

మరి సీఎంలకు మంత్రులను కలవకపోతే ఎలా? ప్రజలను కూడా కలవకపోతే ఎలా? అన్న డౌటనుమానం బుద్ధిజీవులకు రావచ్చు. సీఎం అంటే అందరినీ కలవాల్సిన పనిలేదని కేటీఆర్ ఎప్పుడో సెలవిచ్చారు. సీఎంఓ ఉన్నదే దానికోసం కదా? సీఎంఓలో సెక్రటరీలను కలిస్తే సీఎంను కలిసినట్టే లెక్క. మంత్రులు, ఎమ్మెల్యేలు వారిలోనే సీఎంలను చూసుకుని తమ అదృష్టానికి మురిసిపోతుంటారు. అలాగని కార్యదర్శులేమీ ఖాళీగా ఉండరండోయ్. వారికి ప్రభుత్వ పనులతోపాటు, పార్టీ పనులు కూడా జమిలిగా అప్పచెబుతారు. అంటే ఎవరెవరితో మాట్లాడి వ్యవహారాలు చక్కదిద్దాలన్న ఆదేశాలన్నమాట. ప్రభువులు నచ్చిన వారికే బిల్లుల సిఫార్సు చేస్తారు. పనుల కాంట్రాక్టులు వస్తాయి. పాలకుల మనసు తెలుసుకుని మసలేవారే సీఎంఓలో ఉంటారు. అంత స్వామి భక్తి ఉంటేనే అక్కడ స్థానం. ఇది ఏ ముఖ్యమంత్రుల హయాంలోనయినా కనిపించేదే. కాకపోతే ఇప్పుడు ఏపీలో అది మరీ పరాకాష్టకు చేరింది.

చంద్రబాబు విభజత రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఆయనకంటే ఎక్కువ అధికారాలు అనుభవించింది ఆయన పేషీలోని అధికారులే. సీనియర్ మంత్రి కెఇ కృష్ణమూర్తి వంటి మరికొందరు పెద్దలను కూడా గంటలపాటు వెయిట్ చేయించే దృశ్యాలు చూసినవే. సీఎం చంద్రబాబు చెప్పినా, పుల్లలు వేసి వాటిని కానిచ్చేవారు కాదు. సతీష్‌చంద్ర, సాయిప్రసాద్ వంటి అధికారుల వైభోగం చూడనలవి కాదు. టీటీడీలో ద్వారాలు తెరిచే యాదవులు మిరాశీదారులుగా ఉంటారు. వారికోసం ఉత్తర్వులివ్వాలని టీడీపీలోని యాదవ నేతలంతా బాబుపై ఒత్తిడి చేస్తే, ఆయన అందుకు అంగీకరించారు. కానీ పేషీలోని కార్యదర్శులు అడ్డుపుల్లలేసి దానిని అటకెక్కించారు. అదే జగన్ సీఎం అయిన తర్వాత ఆ పనిచేశారు. ఇప్పుడు ఆ యాదవులు జగన్‌ను ఆరాధిస్తున్నారు. ఇలాంటివి కోకొల్లలు.

ప్రత్యేకించి ఎంబీసీ కులాల కోసం పార్టీ నేతలంతా కష్టపడి తయారుచేసిన ప్రతిపాదనలను.. బాబు అంగీకరించినా కార్యదర్శులు వాటికి కొర్రీలు వేసి, విజయవంతంగా సమాధి చేసేవారు. డీఎస్సీ అభ్యర్ధుల పోస్టింగులూ అంతే. చివరకు దానిని జగన్ మంజూరు చేశారు. దానితో ఇప్పుడు ఉద్యోగాలొచ్చిన టీచర్లకు జగనన్న దేవుడయ్యారు. అయితే విచిత్రంగా ఆ అధికారులే జగన్ సీఎం అయిన తర్వాత.. ఆయన ఆదేశించినవన్నీ మారుమాట్లాడకుండా అమలుచేస్తుండటం విశేషం. రౌతు మెత్తనయితే గుర్రం రెండుకాళ్లమీద నడుస్తుందంటే ఇదే.

బాబు కూడా కార్యదర్శులకు సర్వహక్కులూ ఇవ్వడంతో వారంతా మంత్రులను ఖాతరుచేసేవారు కాదు. రెవిన్యూ శాఖ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తికి బదిలీల అధికారం లేకుండా చేసి, మొత్తం సీఎంఓ నుంచే కథ నడిపించారు. దానితో తనకు బదిలీలు చేసే అధికారం అవసరం లేదని కెఇ వాటిని సీఎంఓకే ధారాదత్తం చేశారు.

అందుకే కార్యదర్శులు కూడా సీఎంలతో సమానం. మరయితే కోట్లు ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రులయిన వారికేం లాభం? అని అమాయకంగా ప్రశ్నించవచ్చు. లాభం లేకేం? ముందు- వెనుక పోలీసు వాహనాలు, నౌకర్లు, చాకర్లు, రోడ్డుపై వెళుతుంటే ట్రాఫిక్ క్లియరెన్సులు, ఎప్పుడంటే అప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా తిరుమల దర్శనాలు, సమీక్షా సమావేశాలప్పుడు చాయ్ బిస్కెట్లు వంటి ప్రొటోకాల్ ఉంటాయి కదా? అవి చాలవా ఏంటి?

మరి అంతమంది బీసీలకు, అంతమంది మహిళలకు పదవులిచ్చారు కదా ప్రశ్నించిన వారు అమాయకుల కిందే లెక్క. సామాజిక సమీకరణలనేవి యుద్ధానికి వెళ్లే సైనికుడికి బుల్లెట్‌ప్రూఫ్ లాంటివి. అన్నేసి పదవులిచ్చిన వారు అసలు ఆ ముఖ్యమంత్రి పదవే ఎందుకివ్వరన్న ప్రశ్నకు ఏ రాజకీయ పార్టీ అధినేతల వద్ద సమాధానం ఉండదు. తాజా మంత్రివర్గ విస్తరణలో గవర్నర్‌తో దిగిన గ్రూప్ ఫొటో చూస్తే, ఈ
ap-cabinet-newసామాజికసమీకరణ పదవుల ప్రాధాన్యం ఏమిటో అర్ధమవుతుంది. రోజారెడ్డి మధ్యలో కూర్చుని ఉంటే, బీసీ-దళిత వర్గాలకు చెందిన మహిళా-పురుష మంత్రులు ముగ్గురికి మాత్రం రెండు వరసల్లో చివరి కుర్చీలు కేటాయించారు. అందులో హోంమంత్రి కూడా ఉండటం మరో విశేషమంటూ సోషల్‌మీడియాలో వస్తున్న ఫొటో కామెంట్లను కొట్టిపారేయలేం.

జగన్ తొలి క్యాబినెట్‌లో ఎవరికీ అధికారులు లేవు. పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, దివంగత మేకపాటి గౌతం వంటి కొందరి మాటలు తప్ప, మిగిలిన ఏ మంత్రి మాటలూ అధికారులు వినరు. టీడీపీ హయాంలో కూడా యనమల, నారాయణ, గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ వంటి నలుగురైదుగురు మంత్రుల మాటలే చెల్లేవి. అప్పటి హోం మంత్రి చినరాజప్ప పరిస్థితే నిన్నటి సుచరితది కూడా. జగన్ ప్రభుత్వంలో ఆయా శాఖలకు సంబంధించి వచ్చే ఆరోపణలన్నింటికీ సలహాదారు సజ్జల ఒక్కరే సమాధానం ఇచ్చేవారు. మా శాఖలతో మీకేం పని అని అడిగే దమ్ము, ధైర్యం ఏ మంత్రికీ లేదు, రాదు.

హోం మంత్రిగా సుచరిత పేరుకే తప్ప, ఆ శాఖ వ్యవహారాలన్నీ సజ్జలనే చూశారన్న అపవాదు లేకపోలేదు. హోంమంత్రికి సొంతంగా ఒక డీఎస్పీని బదిలీ చేసే స్వతంత్రం కూడా ఉండదు. మంత్రులకు సజ్జలే ముఖ్యమంత్రి. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వరు కాబట్టి. మంత్రులు మీడియా సమావేశాల్లో ఏం మాట్లాడాలన్నా మరో సలహాదారు ఆఫీసు నుంచో, పార్టీ ఆఫీసు నుంచో స్క్రిప్టు రావలసిందే. సొంత బుర్ర ఉపయోగించే అవకాశమే లేదు. ఇవ్వరు కూడా.

దీనితో గత మూడేళ్లలో మంత్రులు సచివాలయానికి వచ్చిన సందర్భాలు బహు తక్కువ. శాఖ ముఖ్య కార్యదర్శులు వారిని లెక్కే చేయరు. సమీక్ష సమావేశాలప్పుడు కూడా పిలిస్తేనే వెళతారు. లేకపోతే వాటినీ సీఎంఓలోనే లాగించేస్తారు. వారంతా జిల్లా-నియోజకవర్గాలకే మంత్రులు. పాపం అక్కడా కలెక్టర్లు, ఎస్పీలు మాట వినరు. అప్పుడు కూడా సీఎంఓ కార్యదర్శులకు తమ దుస్థితి వివరిస్తూ ఫోన్ చేస్తే, సదరు కార్యదర్శులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలిస్తారు. ఇదీ మంత్రుల దయనీయం.

ఇక మూడేళ్ల పాటు మంత్రులుగా ఉన్న వారే ఏమీ చేయలేక అశక్తులయితే, రెండేళ్లపాటు ‘ఉంటారనుకుంటున్న’ సచివులు సాధించేదేమిటన్నది ప్రశ్న. అందునా 11 మంది మినహా మిగిలిన వారంతా కొత్తవారే. అందులో కొందరు తొలిసారి ఎమ్మెల్యేలయిన వారు. వీరంతా తమ శాఖలపై పట్టు సాధించి, అన్నీ తెలుసుకునే సరికి పుణ్యకాలం కాస్తా తీరిపోతుంది. పైగా ఢక్కాముక్కీలు తిన్న సీనియర్ ఐఏఎస్‌లను ముఖ్య కార్యదర్శులుగా పెట్టారు కాబట్టి, పాపం ఇక కొత్త మంత్రులకు చేసేందుకు పనేమీ ఉండదు. వారు చెప్పినచోట సంతగించడమే. కాబట్టి… తమ అధికార నివాసాల చుట్టూ కనిపించే ఫ్లెక్సీలు, పోలీసుల శాల్యూట్లు, టీటీడీ లెటర్లు ( అది కూడా రోజుకు ఒకటో, రెండో), షాపుల ప్రారంభోత్సవాలతో మురిసిపోవలసిందే. పాలన అంతా కేసీఆర్ చెప్పులో జగన్ కాలు పెట్టి నడుస్తున్నట్లు కనిపిస్తుంటుందన్నది రాజకీయ పరిశీలకుల ఉవాచ.

తెలంగాణలో కూడా మంత్రుల పరిస్థితి ఇంతకు భిన్నంగా ఏమీ లేదు. కేసీఆర్ అనుకుంటే తప్ప మంత్రులెవరూ ఆయనను కలవడం దుర్లభం. పెత్తనమంతా సీఎంఓనే. మంత్రులయినా తమ అవసరాలేమిటో కార్యదర్శులకు చెప్పుకోవలసిందే. పాత బిల్లుల మంజూరు, కొత్త కాంట్రాక్టు వ్యవహారాలన్నీ సీఎంఓనే చూస్తుంది. ప్రగతిభవన్ నుంచి వచ్చే ఆదేశాలు మాత్రమే అధికారుల పాటిస్తారు. మంత్రులు సమీక్షల్లో పాల్గొంటారు గానీ నిర్ణయాలు మాత్రం సీఎంఓవే.

మంత్రులు తమ రాజకీయ ప్రత్యర్ధులపై చేసే విమర్శల మెటీరియల్ కూడా పైనుంచి రావలసిందే. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంత్రులు ఇచ్చే లెటర్లకు వెంటనే నిధులు మంజూరవుతున్నాయి. పేరుకు మంత్రులయినా మరొక నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే కుదరదు. ఎవరి పరిధి వారిదే. కాకపోతే ఆంధ్రాతో పోలిస్తే, తెలంగాణ మంత్రులకు స్వేచ్ఛ కొద్దిగా ‘ఎక్కువగా ఉన్నట్లు’ కనిపిస్తుందంతే! మిగిలినదంతా సేమ్ టు సేమ్!! మరి మంత్రులకు పదవులుండి ఏం ఫలితం అని ప్రశ్నించిన వారు అమాయకుల కింద లెక్క.రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం- శాఖలూ ఉండాలి కాబట్టి ఆ వ్యవస్థ కొనసాగిస్తున్నారు. లేకపోతే వాటిని కూడా ముఖ్యమంత్రులే నిర్వహించాల్సి న పని కదూ?! మీకు అర్ధమవుతోందా…

LEAVE A RESPONSE