Home » ఒక రాయి.. వంద ప్రశ్నలు!

ఒక రాయి.. వంద ప్రశ్నలు!

( మార్తి సుబ్రహ్మణ్యం)

సారీ.. ఇది ఒకనారీ- వందతుపాకుల కథ కాదు. ఒక రాయి- వంద ప్రశ్నల కథ! మా హైస్కూల్ రోజుల్లో మిన్నెకంటి వెంకటేశ్వర్లు అనే మాస్టారుండేవారు. ఆయన విలువిద్యలో సాటిలేని మనిషి. ఓ పది ఖాళీ సీసాలు తగిలించి, దూరం నుంచి ఏ సీసా చెబితే దానినే రిటైరయ్యే ఆ వయసులో కూడా గురి చూసి కొట్టేవారు. అప్పుడు మేమంతా ఆయనను బాణాల మాస్టారని పిలుచుకునేవాళ్లం.

ఇప్పుడు విలువిద్యకు పెద్దగా ఆదరణ లేదని బాధపడుతున్న తరుణంలో.. విజయవాడలో ఒక తుంటరి ఏకలవ్యుడు, అంత చీకట్లో కూడా కదులుతున్న వాహనంపై ఉన్న సీఎం జగనన్నకు, వెంటనే అదే రాయి పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసుకు మాత్రమే తగిలేలా.. ఒకటే రాయి ఇద్దరిని లక్ష్యం చేసుకుని కంటిపై రాయి విసిరిన వైనం, నాకు మా మిన్నెకంటి మాస్టారి విలువిద్యను గుర్తుచేసింది. అంటే ఇంకా ఏకలవ్య సమాజం సజీవంగానే ఉందన్నమాట.

ఏపీ సీఎం జగనన్నపై రాయి దాడి జరిగిందా లేక రాళ్ల దాడి జరిగిందా అన్నది పక్కనపెడితే, ఆయనపై జరిగినది మాత్రం అంతా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నది కామన్ డైలాగలయినప్పటికీ, హింసతో సాధించేదేమీలేదన్నది మాత్రం నిజం. జగనన్నపై తుంటరి ఏకలవ్యుడు, కటిక చీకటిలో కూడా గురి తప్పకుండా జగనన్న కంటిపై రాయి విసరడం దారుణమే కాదు ఆశ్చర్యం కూడా.
ఆ తర్వాత సీఎంకు ప్రాధమికచికిత్స చేయటం.. ఆయన ప్రచారంలో ముందుకువెళ్లి తర్వాత గవర్నమెంటు ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకున్నారని చెప్పడం.. సినిమాల్లో గుండె ఆపరేషన్ తరహాలో జగనన్నపైన బట్ట కప్పిన ఫొటోలు.. ఆ తర్వాత అన్నయ్య షిక్కటి షిరునవ్వులు చిందిస్తూ, అక్కడి వైద్య సిబ్బందితో ఫొటోలు దిగడం అన్నీ మీడియా- సోషల్‌మీడియాలో దర్శించినవే.

నిజానికి సీఎం పర్యటనలో భద్రతా కారణాల దృష్ట్యా కరెంటు తీసేయకూడదు. పైగా చుట్టూ చీకటి ఉండి, ఆయన బస్సు ఒక్కటే వెలుగులో ఉన్న నేపథ్యంలో బయటవారెవరూ కనిపించరు. పైన జగన్ పక్కన కూడా భద్రతాధికారి ఉండి తీరాలి. సరే.. ఆ భద్రతావైఫల్యాల ముచ్చట తర్వాత ప్రస్తావిద్దాం. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ కరెంటు లేదు.

అయితే విచిత్రంగా ఘటన జరిగిన కొద్దిసేపటికే.. వైసీపీ కార్యకర్తలు కంప్యూటర్ ద్వారా డిజైన్‌చేసి, అందులో చంద్రబాబు ఫొటోలు పెట్టి, ఆ ఫొటోలతో ధర్నాలు చేయడమే వింత, విచిత్రం! అసలు కరెంటే లేని ఆ ప్రాంతంలో అప్పటికప్పుడు డిజైన్ ఎలా చేశారు? పావుగంటలో అంతమంది అక్కడ వాలిపోయి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారు? అంటే అలాంటిదేదో జరుగుతుందని, కొంపతీసి ఒక బృందమేమైనా జగనన్న దగ్గర పనిచేస్తోందా? కర్ణపిశాచి లేదా టెలీపతి తెలిసిన నిష్ణాతులెవరైనా, పులివెందుల టీములో పనిచేస్తున్నారా? అన్న అనుమానం మెడపై తల ఉన్న ఎవరికయినా వచ్చి తీరాలి.

ఇక జగనన్నపై దాడి జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత, తెలుగుప్రజల గుండెలు పగిలి ముక్కలయిపోయాయట. అన్నకు ఏమైందోనని అక్కచెల్లెళ్లు, అవ్వాతాతలూ ఏకబిగిన ఏడుపులూ పెడ బొబ్బొలట. అందులో సొంత చెల్లెలు షర్మిల, చిన్నాయన బిడ్డ సునీత లేరనుకోండి. అది వేరే విషయం! అంత రాత్రి అయినందున కుదర్లేదు గానీ, కుదిరి ఉంటే, జగనాభిమానులు జట్కాబండ్లలో కూడా బెజవాడ వచ్చేసేవారట. అంబటి రాంబాబు అయితే, అది తెలుగుప్రజలకు అయిన గాయమని బరువైన హృదయంతో సెలివిచ్చారు. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదన్నది ఆయన ట్వీటిన సందేశం. అసలు సింగ్‌నగర్‌లో సీఎంపై రాయి దాడికి, చంద్రబాబుకు సంబంధమేమిటన్నది పక్కన పెడితే… అంతలావు మంత్రి అసలైన లాజిక్కు ఎలా మర్చిపోయారన్నదే వింత.

ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు కాదు. జగనన్నే. కాబట్టి అన్నయ్యపై దాడిని కనిపెట్టి, దానిని నిరోధించడంలో విఫలమైన డీజీపీ, విజయవాడ సీపీ, నిఘా అధికారులను సస్పెండ్ చేయాలని కదా అంబటి అడగాల్సింది? మీకు గుర్తుందా? 2018 అక్టోబర్ 25న జగనన్నయ్య విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు, ఆయనపై జరిగిన కోడికత్తి దాడి గుర్తులేదా? పోనీ… అప్పుడు అన్నయ్యపై శ్రీనివాస్ అనే అతను కోడికత్తితో దాడిచేయటం.. అన్నయ్య విశాఖలో ఆసుపత్రికి కాకుండా ఫ్లైటెక్కి హైదరాబాద్‌లో ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకోవడం.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని చెప్పి, వారిని పంపించేయడం.. కోడికత్తి సానుభూతితో ఎన్నికల్లో గె లవడం గుర్తుందా?

యస్. అప్పుడు జగన్‌పై దాడి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమని, అందుకు డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, విశాఖ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని కదా నాటి వైసీపేయులు డిమాండ్ చేసింది!? మరి ఇప్పుడు కూడా ఆ లెక్క ప్రకారమే, ఆ ముగ్గురినీ సస్పెండ్ చేయమని కోరడమే కదా అంబటి ధర్మం? అది వదిలేసి.. చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాలనడం ఏమిటన్నది ప్రశ్న.

ఇక వైసీపీ నేతలతోపాటు.. కొంతమంది ఉత్సాహ/పరమోత్సాహ/అమితోత్సాహ/అత్యుత్సాహ ‘జన ర లిస్టుల’యితే.. ఇది జగన్‌పై హత్యకు జరిగిన కుట్రేనన్న విశ్లేషణలూ, విమర్శలు కురిపిస్తున్నారు. అది కూడా నిజమే కావచ్చు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే, ఎన్నో కేసులను పరిశోధించిన వారికి.. ఇలా రాయితో కూడా హత్య చేయవచ్చన్న కొత్త కోణం ఒకటి అనుభవంలోకి వస్తుంది.

సరే.. జగనన్నపై జరిగిన దాడికి అంబటి చెప్పినట్లు.. యావత్ ఆంధ్రావని, ‘ఇది తెలుగు ప్రజలకయిన గాయమ’ని భోరున విలపిస్తూనే.. అదే ఆంధ్రావని కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తోంది.

ఆ ప్రకారంగా…అసలు సీఎం అంతటి ఉన్నతస్థాయి వ్యక్తి పర్యటనలో కరెంట్ కట్ చేయడం ఏమిటి? సాధారణంగా రాయి తగిలితే.. తగిలిన ఆ ప్రాంతం సహజంగా బాగా కందిపోతుంది. బాగా ఉబ్బుతుంది. అందులో క్యాట్‌బాల్‌తో వేసిన రాయి అంటున్నారు కాబట్టి.. నుదురు బాగా ఉబ్బితీరాలి. కానీ విచిత్రంగా ‘వై’ ఆకారంలో ఒక ఇనుప తీగ రాసుకున్నట్లు రక్తం వస్తూ కనిపించింది ఎందుకు చెప్మా? ఎందుకంటే.. జగన్‌కు వేసిన గజమాలకు చుట్టిన ఇనుక తీగ ఒకటి అన్నయ్యకు గుచ్చుకుందని, దానినే కోడికత్తి-2లా మార్చారన్నది సోషల్‌మీడియాలో జరుగుతున్న చర్చ. నిజం జగన్నాధుడికెరుక.

ఎవరికైనా దెబ్బ తగిలితే వెంటనే దగ్గరలో ఉన్న, ఏదో ఒక ప్రైవేటాసుపత్రికి వెళ్లి ప్రాధమిక చికిత్స చేయించుకుంటారు. కానీ జగన్ మాత్రం దెబ్బ తగిలిన తర్వాత ప్రచారం చేసి, ఆనక సర్కారీ ఆసుపత్రికి వెళ్లి తీరిగ్గా చికిత్స చేయించుకున్నారు ఎందుకు? సహజంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. గ్రామాల్లో ఘర్షణల నేపథ్యంలో రక్తం కారుతూ, తీవ్రంగా దెబ్బలు తగిలిన వారికి సైతం, సాధారణ మంచం లేదా కుర్చీలోనే కూర్చోబెట్టి కుట్లు వేస్తుంటారు. కానీ జగనన్నకు మాత్రం పెద్ద సర్జరీ చేస్తున్నట్లు, దెబ్బతగిలిన భాగం వరకూ మత్తు ఇచ్చి కుట్లు వేశార న్నది వార్తా కథనం.

అయితే జగనన్నకు ఎన్ని కుట్లువేశారో తెలియదు గానీ, ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలు మాత్రం.. ఆయనకు ఏదో తీవ్రమైన ఆపరేషన్ చేస్తున్న బిల్డప్ కనిపించింది. ఎంపి రఘురామకృష్ణంరాజు చెప్పినటు..్ల ఓపెన్ హార్టు సర్జరీలో ఓ 5-6 మంది డాక్టర్లుంటారు. కానీ ఒక చిన్న గాయానికి, డజన్ల మంది డాక్టర్లు ఎందుకొచ్చారన్నది మంచి సందేహమే. మళ్లీ తర్వాత జగనన్న ‘షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ’ అక్కడి వైద్యులతో ఫొటోలు దిగారు. అంటే జగనన్నపై జరిగిన దాడి చిన్నదేనా? మరి అలాగైతే అన్నయ్యపై హత్యాప్రయత్నమంటూ వైసీపీ- ప్రాయోజిత జనరిలిస్టుల ఏడుపులు-పెడబొబ్బలు- హాహాకారాలన్నీ ఉత్తిదేనా? అన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చే డౌటనుమానం.

రాయి దాడి త ర్వాత విడుదలైన ఫొటోలు పరిశీలిస్తే.. అవి ఒక్కోటి ఒక్కో రకంగా, ఒక్కో భంగిమలో ఉన్నాయి. ఒక ఫొటోలో కంటికింద భాగం శుభ్రంగా ఉండగా, మరొక ఫొటోలో నల్లగా కమిలినట్లు కనిపిస్తోంది. ఆ రెండింటిలో ఏది కరెక్టు? చివరాఖరకు సీఎం సర్కారీ ఆసుపత్రిలో కుట్లు వేయించుకుని బయటకు వస్తున్న ఫొటోల్లో కూడా, ఆయన కంటి కింద భాగం శుభ్రంగానే ఉంది. ఎక కమిలిన దాఖలాలు భూతద్దం వేసినా ఎక్కడా కనిపించలేదు. కాలికిమాత్రం ఏదో కట్టుకున్నట్లు ఉంది. విఠలాచార్య సినిమా లెక్క.. ఏకలవ్యుడి రాయి ముందు కంటికి తగిలి, తర్వాత కాలికి తగిలి.. వెంటనే పైకి లేచి పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలిందా? ఇదెలా సాధ్యం? ఏమో?!

ఇక సీఎం అంతటి ఉన్నత స్థాయి వ్యక్తి పర్యటనలో విద్యుత్ సరఫరా ఉండితీరాలి. మరి అప్పుడు కరెంటు లేదు. ఆ ప్రకారంగా కరెంటు కట్ చేయమని ఆదేశాలిచ్చింది ఎవరు? సీఎం వంటి పెద్ద నేత పర్యటనలలో రోప్ టీమ్ ఉంటుంది. తాళ్లతో జనాలను నియంత్రించడం వారి బాధ్యత. అన్నయ్య పర్యటనలకు 2 వేలమంది పోలీసులుంటారన్నది భోగట్టా.

పైగా ఇటీవల జగనన్నకు ప్రాణహాని ఉన్నందున(?) ఆయన సెక్యూరిటీ సంఖ్య పెంచారని, అందుకే రెండు హెలీకాప్టర్లు కిరాయికి తీసుకున్నారన్న వార్త వచ్చింది. మరి అదే నిజమైతే అక్కడున్న భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు? పోనీ రాయి వేసిన ఏక లవ్య ఆగంతకుడని గుర్తించేందుకు, డ్రోన్లు గట్రా ఏమైనా వాడారా? జగనన్న ప్రతి మీటింగుకు వాడే డ్రోన్లు ఈసారి ఎందుకు ఎగరలేదు? మరి రాయి వేశారంటున్న ఆ ఏకలవ్య శిష్యుడిని ఎలా గుర్తిస్తారు? ఎప్పుడు గుర్తిస్తారు? ఆ చీకట్లో విసిరిన రాయి ఎవరి చేయి అన్నది ఎలా గుర్తిస్తారు? ఇవన్నీ ప్రశ్నలు.

సరే. జరిగింది దారుణమే అనుకుందాం. వైసీపాయేయులు- వారికి ఆక్సిజను అందించే ‘జనరలిస్టు’ల విశ్లేషణల ప్రకారం, అన్నయ్యపై జరిగింది దారుణ హత్యాప్రయత్నమే అనుకుందాం. మరి సొంత పార్టీ ప్రభుత్వంలోనే, సొంత సీఎంపై హత్యాయత్నం జరిగితే దానికి ఎవరిది బాధ్యత? అది వైసీపీకే కదా నామర్దా? సొంత పార్టీ ప్రభుత్వంలో సీఎంకే రక్షణ లేదంటే జనం నవ్విపోరూ?! సీఎంకే రక్షణ కల్పించ లేని వైసీపీ, ఇక తమకేం రక్షణ కల్పిస్తుందని భయపడిచావరూ?! అసలు సీఎం ఆగమేఘాలమీద స్పందించి, పెద్ద బాసులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్డరేయవద్దూ?! అది జరగలేదు మరి!

విశాఖ ఎయిర్‌పోర్టులో అన్నయ్యపై కోడికత్తి దాడి జరిగినప్పుడు అప్పటి డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, సీఎస్, విశాఖ పోలీసు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. మరిప్పుడు సొంత ప్రభుత్వంలోనే, అలాంటి హత్యాయత్నం జరిగిందంటున్నారు కాబట్టి.. ఆ సూత్రం ప్రకారమే ఇప్పుడు అదే హోదాలో ఉన్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

సరే. ఇప్పుడు జగన్‌పై రాయి విసిరిన ఆగంతకుడిపై, ఎమ్మెల్యే వెల్లంపల్లి ఫిర్యాదు మేరకు సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంచిదే. రాయితో హత్య చేయాలనుకున్న ఆ కిరాతకుడిని వెదికి పట్టుకోవాల్సిందే. అయితే ఇక్కడ సేమ్ టు సేమ్ ఫ్లాష్‌బ్యాక్ కథ. విపక్షనేత చంద్రబాబునాయుడు బస్సు యాత్రలో ఉన్న సమయంలో కొందరు ఆయనపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఆ తర్వాత టీడీపీ ఆఫీసు పై రాళ్లు, ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఆ ఘటన జరిగినప్పుడు గౌతంసవాంగ్ డీజీపీ.

అందుకాయన ఏమన్నారంటే..‘‘ బాబుపై రాళ్లు వేశారని, అద్దాలు పగులకొట్టారంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. అసంతృప్తి చెందిన వారు ఏదో చేసిఉంటారు ’’ అని తేలిగ్గా సెలవిచ్చారు. ఇక సర్కారు సలహాదారు సజ్జలయితే, చంద్రబాబు వల్ల నష్టపోయిన వారు ఆపనిచేసి ఉండవచ్చని సూత్రీకరించారు.

అంబటి రాంబాబు కూడా చంద్రబాబు అందరిపై ఆక్రమకేసులు పెట్టి వేధించారు కాబట్టి, వాళ్లు మీరు వస్తున్నప్పుడు తుంటరిగాళ్లెవరో రాళ్లు, చెప్పులు వేసి ఉండవచ్చు అని సెలవిచ్చారు. మరి ఆ ప్రకారమే జగనన్న మీద ఎవరో తుంటరి.. లేదా ఆయన పాలనలో అక్రమకేసులకు గురైన వాళ్లు.. సవాంగ్ సారు చెప్పినట్లు.. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుతో నిరసన తెలిపి ఉండవచ్చు కదా? ఆమాత్రానికే హత్యానేరం నమోదు చేస్తే, ఆ రూలు ప్రకారమే అప్పుడు బాబుపై రాళ్లేసిన వారిపైనా అదే కేసు పెట్టాలి కదా? వైసీపీ నేతల సూత్రీకరణలు ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఎలా చెప్మాఅన్నది బుద్ధిజీవుల హాశ్చర్యం!

అసలు ఈ ఎపిసోడ్‌లో రాయి తగిలింది ఒకరికా? ఇద్దరికా? పోలీసులు మాత్రం ఒకటే రాయి చూపిస్తున్నారు. వైసీపీ ప్రాయోజిత మీడియా మాత్రం రాళ్ల దాడి అని చెబుతోంది. రాయిదాడికి, రాళ్లదాడికి.. ఏకవచనానికి, బహువచనానికీ తేడా తెలియకపోతే ఎలా ? పోనీ విఠలాచార్య సినిమాలో మాదిరిగా.. ఒకే రాయి ముందు అన్నయ్యకు తగిలి, మళ్లీ అది కింద నుంచి ఎగిరి పైకి వచ్చి వెల్లంపల్లి శ్రీనుకు తగిలిందా? డైరక్టర్ స్క్రిప్టులో ఎక్కడో తప్పులో కాలేశారన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య.

గమ్మతుగా ఇద్దరికీ కంటిమీదనే రాయి తగలడం అంటే, ఆ తుంటరెవరో గత జన్మలో ఏకలవ్యుడే అయి తీరాలి. ప్రెస్‌కాన్ఫరెన్సులో మాట్లాడినప్పుడు మామూలుగానే కనిపించిన వెల్లంపల్లి,  తర్వాత కంటిమీద కట్టుతో కనిపించారు. అంతకుముందు ఆయన కన్ను నిక్షేపంగా ఉన్న ఫొటో కూడా బయటకు వచ్చింది. ఈ చిత్రమేమిటో విచారిస్తేగానీ తెలియదు.

దాని దుంపతెగ. అదేం విచిత్రమో తెలియదుగానీ.. జగనన్నకూ-ఎన్నికల ముందు దాడులకూ బాదరాయణ బంధమేమిటో అర్ధమయి చావడం లేదు. చాలామంది నేతలు ఫలానా గుళ్లోకి వెళ్లిన తర్వాత నామినేషన్ వేస్తే గెలుస్తారని నమ్ముతారు. ఇంకొంతమంది నామినేషన్ వేసే ముందు ఫలానా వారు ఎదురొస్తే ఖాయంగా గెలుస్తారని నమ్ముతుంటారు. చాలామంది ఫలానా వాళ్లు నామినేషన్ ఫీజు కడితే గ్యారంటీగా గెలుస్తారని నమ్ముతుంటారు. అదేవిధంగా ఫలానా ఆలయానికి వెళితే ఆ నేత మళ్లీ గెలవరన్న ప్రచారం కూడా లేకపోలేదు.

అలాగే జగనన్నకు కూడా.. ఈ ‘ఎన్నికల ముందు దాడుల సెంటిమెంటు’ బాగా కలసివస్తుందన్నది, వైకాపేయుల నమ్మకం కామోసు. గత ఎన్నికల్లో కోడికత్తి సీను బాగా రక్తికట్టి, అన్నయ్య గెలిచేశారు. ఇప్పుడు రాయి లేదా రాళ్ల దాడి అన్నయ్యకు కలసివస్తుందన్నది వారి విశ్వాసం. అదేదో సినిమాలో శ్రీకాంత్, తనకు కావలసిన చోట కత్తితో పొడిపించుకుని, ఆ సానుభూతితో గెలిచిన సీను ఇప్పుడు గుర్తుకువస్తోంది.

సరే ఈ రసవత్తర సురభి కంపెనీ రంగుల యవ్వారం.. ఐప్యాక్ దార్శనికత.. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు, డీజీపీ, ఏజీడీ, సీఎస్, బెజవాడ కమిషనర్‌కు చుట్టుకునే గత్తర వస్తున్నట్లుంది. రాజు-వైద్యుడు సామెత చందంగా.. వారిని తొలగించాలని కూటమి ఎలాగూ డి మాండ్ చేస్తోంది. అదే సమయంలో సీఎంపై రాయితో హత్యాయత్నం జరిగిందన్న కేసు కూడా, కూటమి వాదనలనే బలపరుస్తోంది. ఇవి చాలదన్నట్లు చంద్రబాబుపై గాజువాకలో, తెనాలిలో పవన్‌పై ఇలాంటి రాయితోనే ఒకేరోజు ‘హత్యాయత్నం’ చేయబోయిన ఘటన వెలుగులోకి రావడం చూస్తే.. పెద్దతలలంతా ఒకేసారి టోకుగా ఎగిరే ప్రమాదం కనిపిస్తోంది.

ఏదేమైనా గులక రాయితో హత్యాయత్నం చేశారన్న జగన్ కేసును, ఇకపై జాతీయ స్థాయిలో కేంద్రహోంశాఖ ఒక మోడల్‌గా తీసుకుని, కాబోయే ఐపిఎస్‌ల సిలబస్‌లో చేరిస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఉండే పోలీసు ట్రైనింగ్ సెంటర్లలో కూడా, రాయితో ఏవిధంగా హత్య చేస్తార న్నది ఒక పాఠ్యాంశంగా చేరిస్తే.. పోలీసుల పరిశోధనలో అక్కరకొస్తుందన్నది మేధావుల ఉవాచ.

Leave a Reply