వైసీపీకి మహిళల సెంటి ‘మంట’

– షర్మిలపై మాటలదాడితో వైసీపీకి మహిళలు దూరం
– వైసీపీకి అన్ని వర్గాలు దూరమవుతున్న వైనం
– మద్దతుగా ఉన్న ఏకైక వర్గం మహిళలు మాత్రమే
– షర్మిలపై మాటలదాడిని ఖండిస్తున్న మహిళాలోకం
– సొంత చెల్లిని వేధిస్తున్నారన్న సెంటి మెంట్
– చె ల్లిని పార్టీ నేతలు తిడుతున్నా జగన్ మౌనంపై ఆగ్రహం
– సొంత పార్టీ నేతలను వారించని వైనంపై అసంతృప్తి
– ఇచ్చిన స్క్రిప్టు చదవాల్సి వస్తోందని వైసీపీ నేతల ఆవేదన
– జగన్ కోసమే షర్మిలమ్మను తిట్టాల్సి వస్తోందని ఒప్పుకోలు
– సొంత చెల్లికి అన్యాయం చేశారన్న బలమైన భావన
– పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన చెల్లికి అన్యాయమా?
– సొంత మీడియాలోనూ దుష్ప్రచారమా?
– ఒంటరి మహిళను వేధిస్తున్నారన్న సానుభూతి
– వైసీపీకి ఓటేసిన మహిళల మానసిక భావన
– మహిళలపై పెరుగుతున్న షర్మిల ప్రభావం
– పార్టీకి నష్టమంటున్న వైసీపీ సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకప్పుడు వారి బంధం అద్భుతం. అపూర్వం. అనిర్వచనీయం. రాఖీ పండుకొస్తే చాలు ఆ అన్నాచెల్లి ఆనందం చూడాలి. తండ్రిని స్మరించుకునేందుకు ఇడుపులపాయకు కలిసే వెళ్లేవారు. అలాంటి ‘జగన’ంత కుటుంబం.. ఇప్పుడు ముక్కలయింది. వారి దారులు వేరయ్యాయి. చెల్లిని అపురూపంగా చూసుకున్న అన్న ఇప్పుడు.. తనవారు ఆమెను తిడుతున్నా మౌనంగా ఉంటున్న వైచిత్రి. వారిని వారించకపోగా సొంత మీడియాలో , ఆమెను లక్ష్యంగా చేసుకుని తిట్ల పురాణానికి తెరలేపారు.

ఒంటరి మహిళపై అన్న సారథ్యంలో జరుగుతున్న ఈ వ్యక్తిత్వహననమే..అన్న పార్టీకి దన్నుగా ఉన్న మహిళాలోకాన్ని దూరం చేస్తోంది. చెల్లిపై అన్న పార్టీ దాడిని, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మహిళల మనసు.. అన్న నుంచి, చెల్లి వైపు మళ్లుతోంది. ఫలితంగా అన్న పార్టీకి ప్రమాదఘంటికలు వినిపిస్తున్నాయి. అంటే మహిళలై వైసీపీకి సెంటి ‘మంట’పెట్టారన్నమాట!

ఇదంతా అన్న జగన్-చెల్లి షర్మిల గురించేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏపీ కాంగ్రెస్ దళపతిగా తెరపైకొచ్చిన చెల్లి షర్మిలారెడ్డిని.. షర్మిలాశాస్త్రిగా సంబోధించిన మరుక్షణమే, అన్నాచెల్లెల మధ్య యుద్ధానికి తెరలేచినట్లయింది. బ్రాహ్మణుడైన భర్త బ్రదర్ అనిల్‌ను దృష్టిలో పెట్టుకుని… అనిల్ భుజంపై తుపాకి పెట్టి, షర్మిలను పేల్చిన వైసీపీ వ్యూహం మహిళాలోకం వద్ద వికటిస్తోంది. షర్మిలను జగన్ సన్నిహితులే విమర్శించడాన్ని, మహిళలు వ్యతిరేకించడమే అందుకు కారణం.

సొంత చెల్లిని లక్ష్యంగా చేసుకుని… వైసీపీ నేతలతో తిట్టిస్తున్న జగన్ వైఖరిని, మహిళలు తూర్పారపడుతున్నారు. నిన్నటి వరకూ షర్మిలారెడ్డి అని రాసిన జగన్ మీడియా, ఇప్పుడు ఆమెను షర్మిలాశాస్త్రిగా సంబోధించడాన్ని మహిళలు స్వాగతించలేకపోతున్నారు. షర్మిలను విజయవాడలో అడ్డుకోవడం నుంచి… రోజా, సజ్జల, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, కొడాలి నాని వంటి అనుచరులతో తిట్టించడం వరకూ.. జరుగుతున్న పరిణామాలను మహిళలు నిరసిస్తున్నారు.

దీనితో షర్మిలవైపు సానుభూతి పవనాలు బలంగా వీస్తున్నట్లు కనిపిస్తోంది. పక్క రాష్ట్రం.. పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లని కొందరు.. తెలంగాణ వాళ్లకు ఆంధ్రాలో ఏం పని అని మరికొందరు.. ప్యాక్ చేసి పంపిస్తామని మరికొందరు వైసీపీ నేతలు, షర్మిలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు.. కలసివెరసి మహిళాలోకాన్ని, వైసీపీకి దూరం చేస్తున్నాయన్న ఆందోళన వైసీపీ సీనియర్లలో వ్యక్తమవుతోంది.

ఇది చాలదన్నట్లు షర్మిలకు పోలీసు భద్రత తగ్గించడం కూడా ఆమెను సానుభూతి పెంచి, వైసీపీకి వ్యతిరేకంగా మారేందుకు కారణమవుతోంది. నిజానికి వైసీపీకి రాష్ట్రంలోని దాదాపు అన్ని వర్గాలూ దూరమయ్యాయి. కానీ నేరుగా పథకాలకు సంబంధించిన నిధులు అందుతుండటంతో, మహిళలే ఎక్కువ శాతం వైసీపీ వైపు ఉన్నట్లు ఇటీవలి కాలం వరకూ కనిపించింది. వైసీపీ సర్వేల్లోనూ అది స్పష్టమయింది.

దానితో ఎన్ని వర్గాలు దూరమైనప్పటికీ, పథకాలు పొందుతున్న మహిళలు తమతో ఉన్నారన్న ధీమా, మొన్నటి వరకూ వైసీపీ నాయకత్వంలో కనిపించేది. ఆ ధీమాతోనే జగన్ తన వద్దకు వచ్చే పార్టీ నేతలకు.. ఆ సర్వే వివరాలు వెల్లడించి, గెలుపుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోద్దని అభయమిచ్చేవారు.

అయితే షర్మిల పీసీసీ చీఫ్‌గా పగ్గాలందుకున్న తర్వాత.. ఆ సానుకూల వాతావరణం కాస్తా ప్రతికూలంగా మారడ ం, పార్టీ సీనియర్లను ఆందోళకు గురిచేస్తోంది. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నా… తెలంగాణలో పార్టీ అధినేతగా ఉన్నా, ఆమెను వైఎస్ బిడ్డ-జగన్ చెల్లిగానే మహిళలు చూశారు. వైఎస్‌కు షర్మిల అంటే ప్రాణమన్న సంగతి అందరికీ తెలుసు. ప్రధానంగా వైఎస్‌తో సన్నిహితంగా ఉండే, రాయలసీమ నేతలకు బాగా తెలుసు. ఆ అభిమానంతోనే ఆయన షర్మిల కొడుకుకు తన తండ్రి రాజారెడ్డి పేరు పెట్టారు.

అలాంటి షర్మిలను ఇప్పుడు.. స్వయంగా అన్న జగనే వేధిస్తున్నారన్న సంకేతాలు, రోజురోజుకూ వివిధ ఘటన ద్వారా కనిపిస్తున్నాయి. దానితో వైసీపీని అభిమానించే మహిళలు, ఇప్పుడు షర్మిలకు సానుభూతి చూపిస్తుండటం వైసీపీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ఫలితంగా వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న మహిళల ఓట్లు చీలి, కొంత షర్మిల సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌కు వెళితే, కొంప కొల్లేర వుతుందన్నది వైసీపీ నేతల ఆందోళనగా కనిపిస్తోంది.

తనకూ సాక్షి మీడియాలో వాటా ఉందని, అయినా తనపై ఆ మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తున్నాయని షర్మిల చేసిన వ్యాఖ్యలు… బెజవాడలో ఆమెను పోలీసులు అడ్డుకోవటం.. సెక్యూరిటీ తగ్గించడం.. జగన్ అనుచరులే ఆమెను షర్మిలా రెడ్డికి బదులు, షర్మిలాశాస్త్రి అని ప్రచారం చేయడం మహిళలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అవే వైసీపీని మహిళలకు దూరం చేస్తున్నాయి.

వాటికితోడు… అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం, షర్మిల చేసిన పాదయాత్ర త్యాగాన్ని తక్కువ చేసి చూపటం… భారతి చేయాల్సిన పాదయాత్రను, షర్మిల హైజాక్ చేసిందని చెప్పడం.. అందుకు స్పందించిన షర్మిల తన బిడ్డలపై ప్రమాణం చేసి, మీరు బిడ్డలపై ప్రమాణం చేస్తారా అని చేసిన చేసిన సవాల్‌కు, వైసీపీ ఇప్పటిదాకా స్పందించకపోవడం వంటి అంశాలు.. షర్మిలకు మహిళల సానుభూతి పోగు చేసేందుకు, ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

ఈ అంశాలన్నీ మహిళలను, వైసీపీకి దూరం చేసేవేనని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అన్ని వర్గాలూ దూరమైనప్పటికీ, మహిళలు మాతోనే నడుస్తున్నారని కొండంత ఆశతో ఉన్న వైసీపీ నాయకత్వానికి.. తాజా పరిణామాలు ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల లక్ష్యంగా ఎన్ని విమర్శలు చేస్తే, మహిళల ఓట్లు అంతే స్థాయిలో దూరం చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. అలాగని మౌనంగా ఉంటే, ఆమెకే ఎక్కువ ప్రచారం వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. దానిని వైసీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.

‘ఇప్పటి పరిస్థితిలో మేం షర్మిలమ్మను ఎంత తిడితే మాకు అంత నష్టం. కానీ మౌనంగా ఉంటే ఆమె మాటలే నిజమని జనం నమ్మే ప్రమాదం ఉంది. ఒకటి మాత్రం నిజం. షర్మిలమ్మ రాకముందు వరకూ మాకు కొంత ఆశలుండేవి. ఆమె వచ్చిన తర్వాత మాకున్న ఆ కొద్దిపాటి ఆశ కూడా పోయేలా ఉంది. ఏదేమైనా ఇందులో మేం చేసేదేమీ లేదు. వాళ్ల కుటుంబ వ్యవహారంపై మేం మాట్లాడలేం కదా’’ అని కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అసలు విషయం బయటపెట్టారు.

అయితే షర్మిలను విమర్శిస్తున్న వారంతా తమకు ఇష్టం లేకపోయినా, పైనుంచి వచ్చే స్క్రిప్టు ప్రకారమే మాట్లాడాల్సి వస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘మాకు వైఎస్ బిడ్డ షర్మిలమ్మను తిట్టాలని ఎందుకుంటుంది? మా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు, గత ఎన్నికల్లో మాకు ప్రచారం చేసిన ఆమెను తిట్టడం కరెక్టు కాదని మాకూ తెలుసు. కానీ మాకు వచ్చే స్క్రిప్టును, మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తోంది. ఆ రకంగా మమ్మల్ని మధ్యలో ఇరిస్తున్నార’ని కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వాపోయారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి, పోటీ చేయడం లేదని చెప్పడం విశేషం.

Leave a Reply