2047 నాటికి అభివృద్ధి భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్

-మౌళిక రంగానికి, స్కిల్ ఇండియాకు కేంద్ర తోడ్పాటును స్వాగతిస్తున్నాం
-విభజనచట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ మరోమారు విఫలం
-వైకాపాకు 31 మంది ఎంపీలు ఉన్నా ఉపయోగం శూన్యం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు

అమరావతి- స్వాంతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. బడ్జెట్‌ నిర్ణయాలు ఆ లక్ష్యసాధన దిశగా ఉన్నాయని ఆయన కొనియాడారు. మౌళిక రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం మంచి పరిణామని అచ్చెన్న అన్నారు.

దేశ గతిని మార్చే మౌళిక రంగానికి 11 లక్షల కోట్లు కేటాయించడంతో పాటు 1.40 కోట్ల మంది యువతకు స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకోవడం హర్షణీయం. 2014 – 2019 మధ్య కాలంలో నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2024లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి 10 ఏళ్ల కాలపరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫమయ్యింది. గత 5 ఏళ్లలో వైసీపీ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. 25 మంది ఎంపిలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రెడ్డి 31 మంది ఎంపీలను పెట్టుకుని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలి.

విభజన చట్టంలో కేటాయించిన 11 జాతీయ విద్యా సంస్థలను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తే వాటికి నిధులు కూడా తేలేకపోవడం జగన్ రెడ్డి వైఫల్యం కాదా?. కేంద్ర ప్రాయోజిక పథకాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా ఇవ్వలేక వేల కోట్ల కేంద్ర నిధులను నిరుపయోగం చేయడం తప్ప జగన్ రెడ్డి చేసింది శూన్యం.

Leave a Reply