Suryaa.co.in

Andhra Pradesh

గ్రానైట్ పరిశ్రమలపై దాడులు,అరెస్టులు ఉద్దేశపూర్వకం

•పారిశ్రామిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
•గ్రానైట్ యజమానుల అరెస్టులో కుట్ర
•ఫిర్యాదుదారులను అరెస్టు చేయడం కక్షపూరిత
•పోలీసుల తీరు హేయమైన చర్య
•రాజకీయ కక్షతోనే అధికారులతో వైసిపి గుండాలు
•కక్ష సాధింపులో భాగమే అరెస్టులు
•భయానక వాతావరణ సృష్టించడం కోసం అలజడి
•తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి

రాజకీయ కక్షసాదింపులో భాగంగానే ప్రతిపక్ష పార్టీకి చెందిన పారిశ్రామిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ కార్మికుల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీశారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరు గ్రానైట్ పరిశ్రమలపై మైనింగ్ అధికారులు వైసీపీ రౌడీలతో వచ్చి దాడులు నిర్వహించిన సంఘటనలో వారిని పోలీసులకు అప్పగించిన పారిశ్రామిక యజమానులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఎమ్మెల్యే ఏలూరి తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఫ్యాక్టరీలపై దాడులు నిర్వహించారని మండిపడ్డారు. మారణాయుధాలు, కారం పొట్లాలు కర్రలతో వచ్చిన వారిని వదిలి వారిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పరిశ్రమల యజమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల పై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. వేలాదిమంది కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాల కార్మికులకు జీవనాన్ని అందిస్తున్న పరిశ్రమలపై ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు.

ప్రభుత్వ చర్యలతో గ్రానైట్ పరిశ్రమ మూతపడే దిశగా తీసుకెళ్లిన ఘనత ఈ ప్రభుత్వ పెద్దలకే దక్కుతుందన్నారు. తక్షణమే మైనింగ్ అధికారులు కక్ష సాధింపు దాడులను నిలిపివేసి పారిశ్రామిక రంగం ఉన్నతికి తోడ్పాటు అందించాలన్నారు.ప్రశాంతంగా ఉన్న పర్చూరు నియోజకవర్గంలో ఒక భయానక వాతావరణ సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి అలజడి రేపేందుకు కుట్ర జరుగుతుందన్నారు.

ఫిర్యాదు చేసిన వారిపై కేసులా…?
మార్టూరు గ్రానైట్ పరిశ్రమలలో మైనింగ్ అధికారులతో వచ్చిన వైసీపీ రౌడీ మూకలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రానైట్ యజమానులపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మారణాయుధాలతో వచ్చిన వారిని వదిలి గ్రానైట్ యజమానులను దొంగలుగా ముద్ర వేసి వారి ఫిర్యాదు తీసుకోకుండా వారిపైన కేసులు నమోదు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నానని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం, వారు చెప్పిన విధంగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు గురి చేయడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అన్నారు.

ఉద్దేశపూర్వకంగా అరెస్టులు.. కాలయాపన
రాజకీయ ఒత్తిడిలకు తొలోగ్గి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల పరిశ్రమలపై దాడులు చేసి అరెస్టు చేశారని కేసును కోర్టులో ప్రవేశపెట్టడంలోనూ జాప్యం చేశారని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రానైట్ పరిశ్రమ యజమానులు,పార్టీ నాయకులను స్టేషన్ లో బలవంతంగా ఉంచి రాత్రంతా స్టేషన్లోకూర్చోబెట్టారన్నారు.

మరుసటి రోజు 31వ తేదీన ఉదయం 7 గంటలకు అద్దంకి కోర్టుకు తీసుకువెళ్లి మధ్యాహ్నం 2.30 గంటల వరకు రిమాండ్ నిమిత్తం హాజరు పరచకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారన్నారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు రాజకీయ పక్షపాతం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని హితవు పలికారు.

LEAVE A RESPONSE