Suryaa.co.in

Editorial

విజయవాడ వైసీపీ అభ్యర్ధి రాంగోపాల్‌వర్మ?

– కేశినేని అభ్యర్ధిత్వంపై కుదరని ఏకాభిప్రాయం
– నానికి కమ్మ వర్గం ఓటేయరంటున్న వైసీపీ వర్గాలు
– రాయచోటి అభ్యర్ధిగా సీఎంఓ అధికారి?
– నంద్యాలకు టీటీడీ ప్రముఖుడు?
– జగన్ కోసం లాబీయింగ్ చేస్తున్న ఆ అధికారికే అవకాశం?
– షిర్డిసాయి ఎలక్ట్రికల్ విశ్వేశ్వరరెడ్డికి రాజ్యసభ
– రాజకీయ రక్షణకే ఆయనకు రాజ్యసభ సీటు?
– సుబ్బారెడ్డికి రాజ్యసభ అనుమానమేనట
– సుబ్బారెడ్డికి విశాఖ ఎంపీ సీటు?
– సిపార్సు చేసిన విజయసాయిరెడ్డి?
– ఒంగోలు వైసీపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి ఖరారు
– చెవిరెడ్డికి బాలినేని వర్గ సహకారం అనుమానమే?
– ఒంగోలు అసెంబ్లీకే పరిమితమవుతానన్న బాలినేని
– గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా రావెల సతీమణి?
– ఆమె కాదంటే తెరపైకి డొక్కా?
-బాపట్ల అసెంబ్లీకి గాదె తనయుడు?
– మాట మార్చక తప్పని పరిస్థితి
– మారుతున్న వైసీపీ సమీకరణలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అధికారంలో ఉన్న వైసీపీకి లోక్‌సభ అభ్యర్ధులు దొరకని వైచిత్రి. ఎవరికి ఆఫర్ చేసినా మాకొద్దని తప్పించుకు పోతున్న వైనం. దానితో పార్టీలో ఉన్న వారినే జిల్లాలు మార్చి, ఎంపిక చేయాల్సిన దుస్థితి. దానితో ఇప్పటివరకూ చేసిన ప్రకటనను మార్చుకోవల్సిన ఆశ్చర్యకర పరిస్ధితి వైసీపీలో నెలకొంది. ఈ క్రమంలో కొన్ని ఆశ్చర్యకర ప్రకటనలు కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజయవాడ వైసీపీ అభ్యర్ధిగా, ఇప్పటివరకూ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పేరు వినిపించేది. కానీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో, సొంత కమ్మ వర్గం కూడా సహకరించే వాతావరణ లేదన్న నివేదిక, పార్టీ నాయకత్వానికి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఆయన వెంట టీడీపీ నేతలెవరూ వెళ్లకపోవడం, పార్లమెంటు పరిథిలో కాపులు ఎక్కువగా ఉన్నందున.. జనసేన-టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆయన ఎంపిక సరైనది కాదని ఆ నివేదిక తేల్చినట్లు సమాచారం.

దానితో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న యోచన తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. వర్మది విజయవాడ కావడం, ఆయనకు సినీ గ్లామర్ ఉండటంతో వర్మను ఎంపీగా నిలబెడితే, ఆయన గట్టి పోటీ ఇస్తారన్న అంచనా నాయకత్వంలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయన వైసీపీ కోసం ‘వ్యూహం’తో పాటు, మరో సినిమా కూడా తీసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు జనసేనలో ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎంపి బాలశౌరికి వ్యూహం నిర్మాత అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గత కొద్దిరోజుల క్రితం ఆయన జగన్‌తో సమావేశమయి, సినిమాలపై చర్చించిన విషయం తెలిసిందే.

ఎలాగూ వివాదాస్పదుడైన వర్మ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఆయనకు మునుపటి ఇమేజ్ లేదు. అయినప్పటికీ జగన్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా.. వర్మను విజయవాడ ఎంపీగా నిలబెడితే, టీడీపీ అభ్యర్ధికి గట్టి పోటీ ఇస్తారన్నది నాయకత్వ అంచనా. గెలిచినా ఓడినా టీడీపీకి వర్మ గట్టి పోటీ ఇవ్వగలరని, ప్రచారం కూడా సులభంగా వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ వైసీపీకి అనుకూల సినిమాలు తీస్తున్నందున.. ఇక ఆ ముసుగు తొలగించి, నేరుగా ఆయనను తెరపైకి తీసుకురావాలన్నది వైసీపీ నాయకత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇక కడపకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అధినేత విశ్వేశ్వరరెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వాలని, జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో బాహాటంగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్-ఎంపి అవినాష్‌రెడ్డికి, అత్యంత సన్నిహితుడైన విశ్వేశ్వరరెడ్డిపై ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు వంటి అంశాలపై ఆయన లక్ష్యంగా, టీడీపీ-బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దానితో ఆయనకు రాజకీయ రక్షణ కవచం కల్పించాలని జగన్ నిర్ణయించారని, అందులో భాగంగానే రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సూత్రపాయంగా అంగీరించినట్లు ప్రచారం జరుగుతోంది.

దానితో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి, రాజ్యసభ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. నిజానికి ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించిన ప్రకటన మీడియాలో వెల్లడయింది. అయితే ఆయనకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వడం మంచిదని, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్‌కు, చాలాకాలం క్రితమే సిఫార్సు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రకారంగా సుబ్బారెడ్డికి విశాఖ ఎంపీ ఇచ్చి, అవినాష్‌రెడ్డి సిఫార్సును అమలు చేయాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఇక గుంటూరు ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనితో తాజాగా పార్టీలో చేరిన మాజీ మంతి రావెల కిశోర్‌బాబు సతీమణిని బరిలోకి దించాలని భావిస్తోందట. ఒకవేళ మాల-మాదిగ సమీకరణ, రావెలపై సానుకూల-వ్యతిరేక పరిస్థితి ఆశించినంత లేకపోతే.. వివాదరహితుడైన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను, తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు.

ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా చిత్తూరు జిల్లాకు చెందిన, సీఎం జగన్ సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ మేరకు జగన్ నిర్ణయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పడం.. ఆయన తాను ఒంగోలు అసెంబ్లీకి మాత్రమే పరిమితమవుతానని స్పష్టం చేశారు. అయితే ఒంగోలు జిల్లాలో బాలినేనిని కాదని, ఎవరూ పనిచేసే పరిస్థితి లేదన్నది బహిరంగమే. పైగా చెవిరెడ్డికి స్థానినికేత రుడన్న పేరు ఉండటం కూడా పార్టీకి నష్టమని బాలినేని పార్టీ దూతలకు స్పష్టం చేశారు. అయినా తప్పదని పార్టీ చెబితే, తాను కేవలం తన ఒంగోలు అసెంబ్లీకే పరిమితమవుతానని బాలినేని నిర్మొహమాటంగా చెప్పారట.

ఇక నంద్యాల వైసీపీ ఎంపీగా టీటీడికి చెందిన ఒక కీలక అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలో విపరీతమైన పరిచయాలు, లాబీయింగ్ చేసే సత్తా ఉన్న సదరు అధికారిని జగన్ ఏరికోరి టీటీడీకి తెచ్చుకున్నారు. ఆయన కంటే సీనియర్లు చాలామంది ఉన్నప్పటికీ, జగన్ ఆయనకు కీలకమైన పదవి ఇచ్చారు. హైకోర్టు-సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వద్ద ప్రసాదాలు-దర్శనాలతో.. లాబీయింగ్ చేసే శక్తి సామర్థ్యాలున్న ఆయనపై, ఇటీవలి కాలంలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

ఎంపి రఘురామకృష్ణంరాజును గుంటూరు టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లే ముందు నుంచి.. ఆయన ఆసుపత్రి వెళ్లేంతవరకూ, సదరు టీటీడీ అధికారే స్వయంగా పర్యవేక్షించారన్న ఆరోపణలు తెలిసిందే. అక్కడి ఆసుపత్రి ప్రముఖులతో సదరు అధికారి మాట్లాడి నివేదిక తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి చేశారని స్వయంగా రఘురామకృష్ణంరాజు ఆరోపించిన విషయం తెలిసిందే. త్వరలో రిటైర్డు కాబోతున్న ఆ అధికారికి, తన సొంత జిల్లా అయిన నంద్యాల వైసీపీ టికెట్ ఇవ్వాలని నాయకత్వం ఆలోచిస్తోందట.

జగన్‌కు అనుకూలంగా ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఈ ప్రముఖుడి వల్లే.. బీజేపీ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. న్యాయస్థానాల్లో పార్టీకి సానుకూల వాతావరణానికి సదరు అధికారి చేస్తున్న శ్రమదానమే కారణమన్న ప్రచారం బహిరంగంగానే వినిపిస్తోంది.

ఢిల్లీలో తనకున్న పరిచయాలను సదరు అధికారి, జగన్ కోసం వినియోగిస్తున్నారన్న ప్రచారం లేకపోలేదు. ముఖ్యంగా లడ్లు భారీ సంఖ్యలో తీసుకునివెళ్లి కేంద్రమంత్రులు, ఐఏఎస్‌లకు ఇవ్వడం ద్వారా, వారికి దగ్గరవతుంటారని ఓ అధికారి అసలు విషయం వెల్లడించారు. ఆ హోదాలో పనిచేసిన చాలామంది అధికారులు సహజంగా చేసేవి ఇలాంటి లాబీయింగేనని, ఆ హోదా వల్ల రాష్ట్రపతి-ప్రధాని-పీఎంఓ- నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకూ పరిచయాలు, చనువు ఏర్పడుతుందని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నంద్యాల ఎంపీ సీటు కోసం… ప్రభుత్వ సర్వీసు ముగియకముందే, దానికి రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు.

ప్రధానంగా కడప జిల్లా రాయచోటి సీటును, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు. ఇటీవల ఆయనను సీఎం పిలవడం, దానిపై ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. దానితో శ్రీకాంత్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా, జగన్‌ను అత్యంత సన్నిహితుడైన ఓ సీఎంఓ అధికారికి సీటు ఇవ్వవచ్చచన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగంలోకి రాకముందు ఆయన.. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పనిచేసినట్లు, పార్టీ వర్గాలు చెబుతున్నారు. పైగా ఆయనకు తొలి నుంచీ వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో, ఆయన కుటుంబానికి చెందిన పవర్ ప్రాజెక్టు నిర్వహణను, సదరు అధికారితో సెలవు పెట్టించి మరీ పనిచేయించినట్లు, పార్టీకి చెంది ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం జగన్ తర్వాత పార్టీ-ప్రభుత్వంలో, సదరు అధికారే నెంబర్‌టూగా వ్యవహరిస్తున్నారు. జగన్ కంటే ఆయనే ఎమ్మెల్యే-ఎంపీలు, అభ్యర్ధులతో మాట్లాడుతున్నారు. పైగా రాయచోటి ఆయన సొంత నియోజకవర్గం కావడంతో, సదరు అధికారికి పరిస్థితులు కలసిరావచ్చంటున్నారు. పైగా ఆయన సర్వీసు చివరిదశకు చేరిందని గుర్తు చేస్తున్నారు.

ఇక బాపట్ల అసెంబ్లీ సీటు ఈసారి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి కష్టమేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయనకు బదులు.. మాజీ మంత్రి గాదెవెంకటరెడ్డి తనయుడు మధుసూదన్‌రెడ్డికి సీటు ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట. బాపట్లలో అత్యధికంగా ఉన్న రెడ్లు, ఎమ్మెల్యే కోన రఘుపతిని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు.
ఇటీవల కోనను వ్యతిరేకిస్తూ చాలామంది సీనియర్లు, వైసీకికి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే.

కాగా కోన కార్యకర్తలతో మమేకం కాలేకపోతున్నారని, నియోజకవర్గంలో కొందరికే పెత్తనం ఇవ్వడంతో, వారంతా వసూళ్లకు తెరలేపారని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆయనకు సీటు ఇవ్వకపోయినా వైసీపీకి వచ్చిన, లాభనష్టాలేమీ ఉండవని మరో వైసీపీ నేత వ్యాఖ్యానించారు,

LEAVE A RESPONSE