మద్యపాన నిషేదం హామీ ఏమైంది జగన్ రెడ్డి ?

-అక్రమ సంపాదన కోసం విషపు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తారా?
-వైసీపీ నేతల బినామీల డిస్టలరీల్లోనే విషపు మద్యం తయారీ
-అదాన్ డిస్టలరీపై జగన్ రెడ్డికి ఎందుకంత ప్రేమ ?
-మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.58 వేల కోట్ల అప్పులు సిగ్గుచేటు
-మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి లేకుంటే కేంద్రాన్ని, రాజ్యాంగ సంస్ధల్ని ఆశ్రయిస్తాం
– ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమ సంపాదన కోసం తన బినామీల డిస్టరీల్లో కల్తీ మద్యం తయారు చేయిస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని టీడీపీ నేతలు ద్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాజంనేయస్వామి, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ…..

ప్లీనరీ పేరుతో వైసీపీ చేసుకున్న భజన సభలో భజన బృందమంతా కలిసి సామాజిక న్యాయం, జగన్ మాట తప్పడు, మడమ తిప్పడు అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చిన వారందరినీ ఒకటే అడుగుతున్నాను. మద్యపాన నిషేధమని చెప్పిన జగన్ రెడ్డి భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ. 58 వేల కోట్లు అప్పులు ఏవిధంగా తెస్తారు? వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం మహిళల మాంగల్యాలు తాకట్టు పెట్టడం సిగ్గుచేటు. ఇదేనా మీరు చెబుతున్న సామాజిక న్యాయం? మహిళల భావోద్వేగాలతో ఆడుకుంటూ వీధిన పడేస్తుండటం సామాజిక న్యాయమా? మద్యపాన నిషేదం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు. తండ్రి ఫోటోను పక్కకు నెట్టి మద్యం మీదే మేము ఆధారపడతాము, మద్యం మీదే మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పడానికి సిగ్గనిపించటం లేదా? ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి తాగే తాగుబోతులనే తాకట్టు పెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లింది.

మద్యంపై ఈ మూడేళ్లలో రూ. 58,500 కోట్లు అప్పు రూపంలో తెచ్చిన జగన్మోహన్ రెడ్డి…ఇసుక నుంచి కూడా తైలం పిండగలరు. టీడీపీ హయాంలో చీప్ క్వార్టర్ రూ. 5.20 కి ప్రభుత్వం కొనేది. కానీ నేడు అదే చీప్ క్వార్టర్ రూ. 25 కు కొంటున్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వాని మద్యంపై ఏడాదికి రూ. 6,400 కోట్లు వస్తే నేడు వైసీపీ పాలనలో అది రూ. 21 వేల కోట్లకు పెరిగింది. వైసీపీ ప్రభుత్వం నడుస్తోందే మద్యం ద్వారానే. మద్యం సరఫరా చేసేందుకు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లో 100కు పైగా కంపెనీలు నమోదు చేసుకుంటే జగన్ రెడ్డి మాత్రం కేవలం తన వారికి చెందిన 16 డిస్టలరీల నుంచే అధికంగా మద్యం కొంటున్నారు. చీప్ లిక్కర్ వల్ల ప్రాణాలు పోతున్నాయని మేమంటే అబ్బే అదేం లేదు చంద్రబాబు గారి హయాంలో డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని సకలశాఖ మంత్రి అంటున్నారు. అదానీ డిస్టలరీ ఎవరిది? విజయసాయిరెడ్డి అల్లుడి పెనక రోహిత్ రెడ్డికి చెందింది కాదా? 2019కి ముందు జగన్ దగ్గర క్రియాశీలకంగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇప్పుడు ఐటి అడ్వైజర్ పదవి ఇచ్చారు, ఈయనే తోడల్లుడు అనిరుధ్ రెడ్డికి అదాన్ డిస్టలరీలో భాగస్వామ్యం ఉంది.

2019, డిసెంబర్ 2న స్థాపించిన అదాన్ డిస్టలరీ మూడేళ్లలోనే రూ. 2 వేల కోట్లు టర్నోవర్ ఎలా సాధించింది? చిన్న ఉద్యోగానికే అనుభవం అడుగుతారు. ఈ కంపెనీకి కేవలం రెండేళ్ళలో రూ.1164.86 కోట్ల విలువైన 68.02 లక్షల కేసుల మద్యం సరఫరాకు జగన్ రెడ్డి అనుమతి ఇచ్చారు. ఎందుకు ఈ కంపెనీ అంటే అంత ప్రేమంటే ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాశీచాయనుల శ్రీనివాసులు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మాట్లాడితే డిస్టలరీలు అన్నీ చంద్రబాబు గారి హయాంలోవని చెబుతున్న వైసీపీ నాయకులు అదాన్ డిస్టలరీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. విషపు మందుతో మహిళల మాంగల్యాలతో ఆడుకుంటున్నారు. మద్యం నుంచి వచ్చే డబ్బుతో సంక్షేమం చేయడం చంద్రబాబుకి ఇష్టంలేదని జగన్ అసెంబ్లీలో చెప్పారంటే ఏమనాలి? మద్యపాన నిషేదమని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక మహిళలకు పంగనామాలు పెట్టాడు. మద్యంపై అక్రమంగా జగన్ రెడ్డి ఆర్జిస్తున్న ఆదాయం నెలకు రూ. 500కోట్ల పైమాటే. జనం రక్తపు పీల్చి లాక్కున్న సొమ్ము జగన్ ఖజానాకు వెళ్తోంది. అదాన్ డిస్టలరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…
జే ట్యాక్స్, జే బ్రాండ్ ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. తడి గుడ్డతో గొంతు కోసినట్టు తండ్రి జయంతి నాడే తల్లిని పార్టీ నుంచి సాగనంపిన జగన్ రెడ్డి మద్యపాన నిషేదం ఎలా చేస్తాడని ప్రజలు ఆలోచించాలి. జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం ఘటనపై జ్యుడీషియరీ విచారణ మేము కోరితే సహజ మరణాలు అని ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న ఆంద్రా గోల్డ్, సిల్వర్ స్ట్రైప్స్, నైన్ సీ హార్స్ మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలున్నాయని చైన్నైలోని ఎస్.జి.ఎస్ ల్యాబ్ నివేదిక మేం బయపెట్టాం. కానీ అది తప్పంటూ వైసీపీ నేతల మాట్లాడటం సిగ్గుచేట. సూట్ కేసు కంపెనీలు పెట్టడం, సకిలీ పత్రాలు సృష్టించడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. అమరావతి ముంపుకు గురవుతుందని చెన్నై ఐఐటీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించింది ఎవరో ప్రజలు తెలియదా? తప్పుడు పత్రాలు, సూట్ కంపెనీలు సృష్టించటంలో ఏ1, ఏ2, ఏ3, ఏ4 సిద్ధహస్తులు. మీకు దమ్ముంటే మేం చెప్పిన మూడు బ్రాండ్లు మీరు చెప్పిన ల్యాబ్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేయిద్దాం దీనికి వైసీపీ నేతలు సిద్దమేనా?

జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం తాగి చనిపోయిన ఘటనలో అల్కాహాల్ బేస్ డ్ లిక్కర్ తాగడం వల్లే చనిపోయారని డాక్టర్లు రిపోర్టు ఇవ్వటం వాస్తవం కాదా? ఘటనపై వచ్చిన రిపోర్టులు ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదు? దీనిపై మేం అసెంబ్లీలో నిరసన తెలియజేస్తే ముఖ్యమంత్రి మాత్రం సహజమరణాలంటూ సభ నుంచి పారియారు. డిస్టలరీలకు చంద్రబాబు అనుతిచ్చారంటున్నారు కానీ అందులో అమ్ముతున్న నాసిరకం బ్రాండ్లకు అనుమతులచ్చింది ఎవరు? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్తగా 106 బ్రాండ్లకు అనుతమిచ్చారని ఆర్టీఐ సమాచారం ద్వారా ప్రభుత్వమే చెప్పింది. జగన్ రెడ్డి తన అక్రమ ఆదాయం కోసం విషపు మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ నకిలీ మద్యంపై రాష్ట్రపతి, కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డోలా బాలవీరాజంనేయస్వామి అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ…
నయవంచనకు, నమ్మించి మోసం చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. నాడు మద్య పాన నిషేదమనిచెప్పి నేడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారు. 800 బార్లకు 2020 వరకు లైసెన్స్ పొడిగించారు. మరో వైపు భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయం చూపి రూ. 58 వేల కోట్లు అప్పులు తెచ్చారు. అంటే మద్యపాన నిషేదం చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్టే కదా. జగన్ రెడ్డి అక్రమ సంపాదన కోసం మద్యాన్ని వ్యాపారంగా మార్చుకుని ప్రభుత్వ ఖజానాతో పాటు తన తాడేపల్లి ఖజానాను నింపుకుంటున్నారు. దేశంలో ఎక్కడైనా ఏదైనా వస్తువు కొనేటప్పుడు కస్టమర్ చాయిస్ ఉంటుంది, కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం దుకాణాల్లో కేవలం తమకు ముడుపులు ఇచ్చిన డిస్టలరీల మద్యం బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. జగన్ రెడ్డి డిస్టలరీ దగ్గర ముక్కుపిండి కమీషన్లు వసూలు చేయటం వల్లే క్వాలిటీ లేని మద్యం తయారు చేస్తున్నారు. అదాన్ డిస్టలరీ, ఎప్సీవై డిస్టలరీ జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు చెందిన బినామీలవే. మద్యం దుకాణాల్లో నెలకు 25 లక్షల మద్యం కేసులు అమ్మితే వాటిలో సుమారు 15 లక్షల మద్యం జగన్ రెడ్డి బినామీ డిస్టలరీల మద్యం బ్రాండ్లే అమ్ముతున్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మద్యం మాఫియాతో పాటు గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. దేశానికి మొత్తం ఏపీ నుంచే గంజాయి సప్లై అవుతోంది. మద్యపాన నిషేదమ చెప్పిన జగన్ రెడ్డి ఊరూరా బెల్టుషాపులు పెట్టి మద్యం తాగిస్తున్నారు, జగన్ రెడ్డి అమ్ముతున్న మద్యం తాగినవాళ్లు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు. ప్రభుత్వ మద్య దుకాణాల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముతున్నారు. అందుకే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోవటం లేదు. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం సమాధానం చెప్పటం లేదు? మద్యంలో విష రసాయనాలున్నాయని ల్యాబ్ రిపోర్టులు మేం బయటపెడితే వైసీపీ నేతలు దానిపై ప్రజలకున్న సందేహాలు తీర్చకపోగా టీడీపీపై అసత్య ప్రచారం చేయటం సిగ్గుచేటు. మద్యం తయారు చేసేది, ధర నిర్ణయించేది, అమ్మేది మొత్తం వైసీపీ వాళ్లే. మద్యంలో జరుగుతున్న అక్రమాలు, మద్యం తాగి చనిపోయిన ఘటనలపై సీబీఐ విచారణ వేయాలి. లేకుంటే రాజ్యాంగ సంస్ధల్ని ఆశ్రయిస్తామని ఏలూరి సాంబశివరావు అన్నారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాయకులు సమాధానం ఇస్తూ…
భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఏపీలో దొరకవు, ఏపీలో దొరికే బ్రాండ్లు ఇతర రాష్ట్రాల్లో దొరకవు. జగన్ రెడ్డి అనుచరుల కనుసన్నల్లో మద్యం తయారవుతోంది. డిస్టిలరీల యాజమాన్యం జగన్ రెడ్డికి సంబంధించినవారే..జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడబెట్టుకోవడానికి మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.ప్రజల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ల్యాబొరేటరీలో జగన్ మద్యాన్ని పరీక్షలు చేయించాం.సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించి, ఏపీలో అమ్ముతున్న మద్యాన్ని ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేయిస్తే తేలిపోతుంది.ప్రభుత్వం ముందుకు రావాలి.చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చిన బ్రాండ్లను ఆపేసి, విషపూరిత మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారు.

ఈ మూడేళ్లలో చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చిన డిస్టిలరీల యాజమాన్యం మారిపోయి, జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ యాజమాన్యం స్థానాల్లో కూర్చుని విషపూరిత మద్యాన్ని తయారు చేసి అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారు…ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. డిస్టిలరీలన్నీ వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి…మా వద్ద ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సినిమా ఫక్కీలో మద్యం దందా నడుస్తోంది…వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతున్నాయి. తనకు ముడుపులు, కమీషన్లు ఇచ్చేవారికే డిస్టిలరీ అనుమతులు జగన్ రెడ్డి అనుమతిలిస్తున్నారు. వైసీపీ పాలనలో వస్తున్న మద్యం సేవించే వారికికీళ్లనొప్పులు, గుండెనొప్పులు, రకరకాల వ్యాధులతో చనిపోతున్నారు.ఈ మరణాలపై జ్యుడిషియరీ ఎంక్వయిరీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలు తీసి సంపాదిస్తున్న డబ్బును రానున్న ఎన్నికల్లో ఖర్చుచేయాలని వైసీపీ అధినాయకుడు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. మద్యంలో విషం ఉందని చెబుతుంటే, వైసీపీ నాయకులు ఏ మద్యంలో అయినా విషం ఉంటుంది, దాని వల్ల ఇబ్బందులేమీ ఉండవు అని తేలిగ్గా తీసుకుంటున్నారు. మహిళల తాళిబొట్లు తెంచుతూ డబ్బు కూడబెట్టుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం కల్తీసారా ఘటనలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులు ఇంత వరకు రాలేదు. ఎందుకంటే చనిపోయినవారంతా కల్తీ సారాతోనే చనిపోయారు.వాళ్లు తాగిన సారాలో మిథైల్ ఆల్కహాల్ ఉందని అక్కడ చాలామంది చెబుతున్నా…ప్రభుత్వం తనకు మచ్చ వస్తుందనే భయంతో పోస్టుమార్టం రిపోర్టులను దాచిపెట్టుకుంది. వైసీపీ నాయకులు వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ నేతలన్నారు.

Leave a Reply