పోరంబోకు అనే పదాన్ని నిందావాక్యంలో అంటే మృదువైన తిట్టుగా మనం ఉపయోగిస్తున్నాము. నిజానికి పోరంబోకు అనే నిందా వాక్యాన్ని ప్రయోగించేవారిలో చాలామందికి ఆ పదానికున్న అర్థమేమిటో తెలియదు.
పోరంబోకు అనేపదం రెవెన్యూపారిభాషిక (Revenue terminology ) పదంలోనిది. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి భూమిశిస్తే ప్రధానఆదాయవనరుగా వుండేది. అందుకే వారు భూములను సమగ్రంగా సర్వేచేసి తరగతులుగా (Clasification of Lands) విభజించి, అందులో శిస్తు వసూలుకు యోగ్యమైన భూములను, శిస్తువసూలు చేయటానికి వీలులేని భూములుగా విభజించారు.
సర్వే అనంతరం భూమిశిస్తు వసూలు చేయటానికి వీలుకాని కొన్ని భూములను పోరంబోకులన్నారు.ఉదా॥ గ్రామరహదారులు ప్రజసంక్షేమానికి కేటాయించిన తోపులు, కాలువలు, కాల్చటానికి పూడ్చడానికి వున్న శ్మశానాలు, మేతబయల్లు, వాగులు వంకలు నదులు వ్యవసాయకల్లాలు, కొండలుగుట్టలు మొదలైనవి.
ఇలాగా తరంకట్టని అనగా శిస్తునిర్ణయం కాని భూములు పోరంబోకు జాబితాలోనికి వస్తాయి.కొండలుగుట్టలనే గయాళు భూములంటారు.
పోరంబోకు భూములనే UAW భూములని అంటారు.అంటే Unassesed waste అనగా శిస్తు నిర్ణయించిని, శిస్తువిధించని భూములంటారు. ఇందులోని భూమి కొంత వ్యవసాయయోగ్యంగా వుంటే అలాంటి భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ గా ఇవ్వాలనుకొన్నప్పుడు తహశీల్దారు అలాంటి భూములకు శిస్తు నిర్ణయించడం జరుగుతుంది. దీనినే Assesed Waste అనంటారు. Assesed Waste Land అనగా భూమిశిస్తు నిర్ణయించబడిన బంజరు భూమి. కొన్ని సందర్భాలలో ప్రజోపయోగం కొరకు కూడా UAW భూములను AW భూములుగా మార్చి వాటిని ఇవ్వడం జరుగుతుంది.
ఇలా శిస్తునిర్ణయించిన భూమిని ధరఖాస్తు పట్టాగా ( D – Patta) గా భూమిలేని నిరుపేదలు ఇస్తే 3 సంవత్సరాల కాలంపాటు అలాంటి భూములపై ఎలాంటి శిస్తులు విధించి వసూలు చేసేవారు కాదు. పోరంబోకు అంటే పన్ను విధించటానికి వీల్లేనిది, ప్రభుత్వం దృష్టిలో ఆదాయం లేనిది. కాబట్టే ఎవరైనా ఆదాయం లేకుండా తిరుగుతుంటే వాడొట్టి పోరంబోకు అనంటారు.
ఇప్పుడైతే భూములకు శిస్తులు లేవు కాని, ఒకప్పుడు ప్రతిపట్టాదారుడు తనకున్న భూమిని బట్టి, భూమి తరగతులను బట్టి తప్పనిసరిగా భూమిశిస్తు చెల్లించాల్సివచ్చేది. తరగతులుగా విభజించడమంటే తరి, మెట్ట, తోట, వ్యవసాయం చేస్తూ వదిలేసినబంజరు, గనులు మొదలైనవి.
ప్రభుత్వం గ్రామాధికారుల వ్యవస్థ ద్వారా శిస్తులను కరువుకాటకాలలో కూడా బలవంతంగా వసూలు చేసేది. భూమిని వేలంవేయడం, పశువులను ఎద్దుల బండ్లను ఇంట్లోని బంగారు వంటి విలువైన వస్తువులను జప్తు చేసేవారు. రైతులు ఇలా అవమానాలు పడలేక భూమిపై పన్నులు చెల్లించలేక సేద్యం చేస్తున్న భూములను ప్రభుత్వానికే వదిలేసేవారు. దీనినే “ఇస్తిఫా” అంటారు.రైతు తన భూమికి రాజీనామా చేసి తనకు గల సర్వహక్కులను ప్రభుత్వానికి దాఖలు పరిచేవాడు.
(సేకరణ)
జి.బి.విశ్వనాథ. అనంతపురం.