అంబేద్కర్ వాదుల పయనమెటు?

భారతదేశ బానిసత్వములో కులం ఇమిడి ఉందని, కుల అసమానతల ద్వారానే వర్గ అసమానతలు నిర్మితమైనాయని, అన్ని అసమానతలకు కారణమైన కులం నిర్మూలన జరగకుండా, కులం విధ్వంసం కాకుండా బానిసత్వం పోదని, అట్టడుగు వర్గాల ప్రజలు అభివృద్ధి చెందరని సూత్రీకరించిన కొద్ది మంది మహానుబావుల్లో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒకరు. ప్రపంచ జ్ఞానిగా ప్రసిద్ధి గాంచిన అంబేడ్కర్ ను నేడు కొన్ని వర్గాలకు పరిమతం చేస్తూ చూడడం అవగాహన రాహిత్యమే కాక బాధాకరమైన సందర్భంలో ఆ మాహానుభావుడి 132 వ జయంతిని దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మెజారిటీ దేశ ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడంవల్లనే నేడు అంబేడ్కర్ కొన్ని వర్గాల ప్రతినిధిగా చూడబడుతున్నాడు.

సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలనే లక్ష్యంతో అంబేడ్కర్ చేసిన కృషి మెజార్టీ ప్రజలకు తెలియదు. అంబేడ్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికై చైర్మన్ పదవి చేపట్టి రాజ్యాంగం వ్రాసినా, కుల నిర్మూలన ఉద్యమం చేసినా, బుద్జిజం స్వీకరించిడమే కాకుండా ఇంకా ఏ ఉద్యమం చేసిన తన లక్ష్యమైన అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందడం కోసమేనని తెలుస్తుంది. అంబేడ్కర్ అంటే అందరివాడు అనే విషయం ఆ మాహానుభావుడు దేశంలోని వివిధ వర్గాల విముక్తి కోసం చేసిన పోరాటం గురుంచి క్షుణ్ణంగా తెలుసుకుంటే మాత్రమే అర్ధమవుతుంది.

బ్రాహ్మణీయ అగ్రవర్ణాల వారు స్వాతంత్ర్య పోరాటంలో తల మునకలైన వేళ అంబేడ్కర్ మాత్రం దేశంలోని మెజారిటి ప్రజల విముక్తి కోసం పోరాటం కొనసాగించారు. స్వాతంత్ర పోరాటం కన్నా మా ప్రజల హక్కులే ముఖ్యమని బ్రిటిష్ వారితో వాదించి సైమన్ కమీషన్ ను రప్పించి ఎన్నో హక్కులు సాధించాడు. స్వాతంత్ర పోరాటంలో బహుజన ప్రజలు కలిసి రావాలంటే స్వాతంత్రం వస్తే బహుజన ప్రజలకు ఒరిగేదేంటి, ఒనగూరే హక్కులేంటని స్వాతంత్ర ఉద్యమంలో ముందున్న గాంధీ, నెహ్రు, వల్లబాయి పటేల్ ను నిలదీసి ఎన్నో హక్కులను సాధించిన అంబేడ్కర్ అన్ని వర్గాల వారని గమనించాలి.

ఓటు హక్కు ప్రదాత
మనుధర్మ శాస్త్రం ప్రకారం వేల ఏండ్ల నుండి విద్యకు దూరమైన బహుజన ప్రజలకు, స్త్రీలకు ఓటు హక్కు లేని ఆ కాలంలో దేశంలో ప్రతి మనిషికి ఒకటే విలువ ఉండాలని అందరికి ఓటు హక్కు కల్పించాలని(వన్ మాన్ వన్ వాల్యూ) బ్రిటిష్ వారితో పోరాడి అందరికి ఓటు హక్కు కల్పించి అంబేడ్కర్ అందరివాడయ్యాడు. యుద్ధాలలో నెత్తురు పారించి సాధించే విజయానికన్నా ఎలాంటి నష్టం లేకుండా ఓటుతో ఎక్కువ విజయాలను సాధించవచ్చని, తరతరాలుగా అణచివేయబడ్డ బహుజన వర్గాల విముక్తి ఓటు హక్కుతోనే సాధ్యమని తెలియజెప్పిన అంబేడ్కర్ ఆలోచన నేడు పలితాలనిస్తుంది.

ఒకనాడు అత్యంత అవమానకరంగా పశువులకన్నా హీనంగా చూసిన మనుషుల సమూహాల్లోకి నేడు ఆధిపత్య కులాల వాళ్ళు, పాలకవర్గ నాయకులు వెళుతున్నారంటే, అణగారిన వర్గాల్లో చదువుకున్న వారిని, కుల పెద్దలను సంప్రదిస్తున్నారంటే అది ఓటు హక్కు రావడం వల్లనే అనేది సత్యం. బతుకుదెరువు కోసం కాకులు దూరని కారడివిలో జీవనం సాగించిన ఆదివాసీ గుడాలను ఇటీవలి వరకు ఏ నాయకుడు పట్టించుకున్న దాఖలాలు లేకపోగా కనీసం వారు మన మద్య సంచరించే మనుషులుగా కూడా చూడని స్థితి నుండి ఆ గుడాల చుట్టూ నాయకులు తిరిగే స్థితికి వచ్చిందంటే ఆ గొప్పదనం అందరికి ఓటు హక్కు కల్పించి, ప్రతి మనిషికి సమాన విలువ కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు దక్కుతుంది.

రాజ్యాధికారం – మాస్టర్ కీ
విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టాల లాంటి ఎన్నో రక్షణ చట్టాలు రాజ్యాంగంలో పొందుపర్చడమే కాకుండా చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అణగారిన వర్గాలకు అధికారం చేరువై అభివృద్ధి జరుగుతుందని ఆర్టికల్ 3 ను కూడ పొందుపరిచారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమంటే వేల ఏండ్ల నుండి అణచివేయబడ్డ నా ప్రజలకు రాజ్యాంగంలో ఎన్ని హక్కులు కల్పించబడినా ఆ హక్కులను అమలు చేసే రాజ్యాధికారం దళిత బహుజన వర్గాలకు ఉండాలని అందుకోసం ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు ఆయుధంతో బహుజన ప్రజలు రాజ్యాధికారంలోకి రావాలని పిలువునిచ్చారు. రాజ్యాధికారమే మీ మాస్టర్ కీ అని అంబేడ్కర్ పిలుపునిస్తే ఆ మాస్టర్ కీ ని నేటి తరం బహుజన ప్రజలు ఆధిపత్య వర్గాల పాలకులకు అప్పచెప్పారు.

మారాలి నేటి సమాజం
పూలే ఉద్యమాన్ని అబహుజన ధ్యయనం చేసిన అంబేడ్కర్ ఆయన్నే తన గురువుగా ప్రకటించుకుని పెరియార్, సాహుమహారాజ్, గాడ్గే బాబా లాంటి వాళ్ళ ఉద్యమ సహచర్యంతో ఎంతో త్యాగపూరిత ఉద్యమాలు చేసి, ఎన్నో హక్కులు సాధించి పెడితే నేటి సమాజం ఏమి చేస్తున్నట్లు? ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోనే జరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలకన్నా ఎక్కువ విధ్వంసం జరిగిందంటే అది మత కలహాల వల్లనేనని అధ్యయనం చేసిన అంబేడ్కర్ కుల మతాలు లేని మానవీయ సమాజ నిర్మాణం కోసం బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. మనుధర్మమనే ఆశాస్త్రీయ, అసమానతల జీవన విధానం ద్వారానే దేశ ప్రజలు అణచివేయబడుతున్నారని అధ్యయనం చేసిన అంబేడ్కర్ 1927 డిసెంబర్ 25 న మనుధర్మ శాస్త్ర ప్రతులను బహిరంగంగా తగలబెట్టి శాస్త్రీయంగా జీవించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

హిందూ మతంలో ఉన్న అసమానతలను, అమానవీయ జీవన విధానాన్ని అధ్యయనం చేసిన అంబేడ్కర్ నేను హిందువుగా పుట్టినా నేను హిందువుగా మరణించనని బహిరంగ ప్రకటన చేసినారు. అన్ని మతాలు శ్రమజీవులను అణచివేయడంలో ముందుంటాయని ఎన్నో వ్యవస్థలను అధ్యయనం చేసి ప్రపంచ మేధావిగా పేరు సంపాదించిన అంబేడ్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు.

తను ఒక్కడే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించకుండా, ఐదు లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీయకరించారు. ఎన్నో యుద్ధాలు చేసి, రక్తపాతానికి కారణమైన అశోక చక్రవర్తి బౌద్ధం ద్వారా అహింసా మార్గంలో నడవాలని జ్ఞానోదయం చెంది బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజైన అక్టోబర్ 14 న (విజయదశమి రోజున) నాగపూర్ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14 న బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఈ చరిత్ర అంతా చాలామందికి తెలిసిందే అయినా ఇక్కడ బహుజన ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అంబేడ్కర్ ఏమి కోరుకున్నాడు, మన సమాజం ఎటువైపు నడవాలనుకున్నాడు, బహుజన వర్గాలు ఎలాంటి జీవనాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారో నేటి తరం ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరముంది.

పశువులు నీళ్లు తాగి, పందులు బొర్లే చెరువు నీళ్లు ఈ దేశ మూలవాసులు తాకరాధని నిబంధనలు పెట్టి, పశువులకన్నా హీనంగా చూసే నీచమైన సంస్కృతి నుండి బయటపడాలని, గుడి ముందునుండి కుక్కలు, పందులు, పశువులు నడవచ్చని శూద్రులు నడవరాదని చెప్పబడే మతంలో కొనసాగడం సరికాదని, స్వాభిమాన జీవనం కోసం, శాస్త్రీయ జీవనం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతుత్వ జీవనం బౌద్ధ ధర్మం లోనే ఉంటుందని చెప్పి ఆచరణాత్మకంగా ఉద్యమించిన అంబేడ్కర్ జీవన మార్గాన్ని నేడు ఎంతమంది బహుజన ప్రజలు ఆచరిస్తున్నారో స్వీయ పరిశీలన చేసుకోవాలి.

అంబేద్కర్ వాదులమని, అంబేడ్కర్, పూలే పేరున సంఘాలు పెట్టుకున్న వారు కూడా ఎంతమంది వారు చూపిన జీవన మార్గంలో కొనసాగుతున్నారో పరిశీలించుకోవాలి. నాగజాతి (దేశ మూలవాసులు) ప్రజలు ఎక్కువగా జీవించే నాగపూర్ లో అంబేడ్కర్ ఐదు లక్షల మందితో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించినారు. అలాంటి నాగపూర్ నేడు బౌద్ధ ధర్మానికి బద్ధ విరుద్ధమైన ఆర్.ఎస్.ఎస్ కు కేంద్రమైంది. అంటే అంబేడ్కర్ పిలువును, సిద్ధాంతాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లినట్లు ఆలోచన చేసుకోవాలి. విద్య, ఉద్యోగాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన అంబేడ్కర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 14 న దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అదే అంబేడ్కర్ చూపిన జీవన మార్గమైన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన అక్టోబర్ 14 ను ఎందుకు ఉత్సవంగా జరుపుకోవడం లేదో ఆలోచించుకోవాలి.

కుల సంకెళ్ళ నుండి, మనువాద సంకెళ్ళ నుండి, బ్రాహ్మణీయ బావాజలం నుండి బయటపడి శాస్త్రీయ జీవన విధానం కొనసాగించనంత కాలం దళిత బహుజన ప్రజలకు విముక్తి సాధ్యం కాదు. రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు నిజమైన అంబేడ్కర్ వాదులుగా మారి “పే బాక్ టు సొసైటీ” కి అంకితమవుతే ఆ ప్రయోజనాలు, అబివృద్ధి అందనంత ఎత్తుకు ఎదిగే అవకాశముంది. అట్టడుగు వర్గాల ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందాలని, దేశ సంపదను ప్రతి ఒక్కరు సమానంగా పొందే రాజ్య నిర్మాణం జరగాలని కృషి చేసిన అంబేడ్కర్ ఆశయాలను అంబేడ్కర్ వాదులు ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యతను మరువరాదు.

అంబేడ్కర్ దళిత బహుజనులు రాజ్యమేళాలని కోరుకుంటే మనువాద, బ్రాహ్మణీయ పాలక పార్టీలు మనువాదాన్ని ఒంటినిండా నింపుకున్న బి.సి ని ప్రధానిగా, ఎస్సి ని రాష్ట్రపతిగా చేసి దళిత బహుజన రాజ్యమంటుంటే అంబేడ్కర్ వాదులు నిమ్మకు నీరెత్తినట్ల వారి వారి స్వంత జీవితంలో తీరిక లేకుండా జీవిస్తున్నారు. మనువాద పార్టీలు బి.సి లను ముందుపెట్టి బి.సి ముఖ్యమంత్రి అని, బి.సి లకే నాయకత్వమని మభ్యపెడుతుంటే ఆలోచన చేయాల్సిన అవసరముంది.

అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాలు కొంతమేరకు ఫలితాలనిస్తున్నప్పటికి ఆయన కోరుకున్న బుద్ధిజం వైపు మాత్రం మెజార్టీ ప్రజలకు చేరుకోలేదు. ఇక కుల నిర్మూలన అంతత మాత్రమేనని చెప్పవచ్చును. రాజ్యాంగపరంగా అందించిన ఫలాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు పొందిన ఎస్సి, ఎస్టీలు వారి వ్యక్తిగత జీవనంలో కొనసాగుతూ మనువాద పార్టీలకు బానిసలుగా బతుకుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో రాణించిన వారు కొంతమేరకు అంబేడ్కర్ బావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నారు.

పూలే, అంబేడ్కర్, సాహుమహారాజ్, పెరియార్, నారాయణగురు, రామ్ మనోహర్ లోహియా, బి.పి. మండల్, కాన్షీరామ్ లాంటి మాహానుబావులు చేసిన కృషి వల్ల బి.సి లకు కూడా 27 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఎస్సి, ఎస్టీ, ఒబిసి లకు రాజ్యాంగ ద్వారా కల్పించబడిన హక్కులను కాలరాయడం కోసం 1990 నుండే ప్రైవేటీకరణను ప్రోత్సహించడం మొదలుపెట్టిన అగ్రవర్ణ పాలకులు నేడు ఏకంగా దేశంలోని రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్ లాంటి పెద్ద సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేయడమంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను తొలిగించడమే అవుతుంది. ఇంకో మాటలో చెపితే పరోక్షంగా రాజ్యాంగాన్ని మార్చినట్లు అవుతుంది.

కుల నిర్మూలన జరగాలని, కులం ధ్వంసం కావాలని అంబేడ్కర్ కోరుకుంటే అందుకు వ్యతిరేకంగా కుల సంఘాలు పెరిగి బహుజన కులాల మధ్య ఘర్షణలు పెరిగాయి. జై భీం (జ్ఞానం వర్ధిల్లాలి) అని నినదించాల్సిన దళిత బహుజనులు జై శ్రీరామ్ అని నినదిస్తున్నారు. అంటే బహుజనుల్లో బానిసత్వం, మతతత్వం ఎక్కువైందని తెలుస్తుంది. అంబేడ్కర్ విద్య, ఉద్యోగాలు అందిస్తే లబ్ధిపొందిన వారు జై శ్రీరామ్ అంటూ మనువాద భావజాలాన్ని పెంచడడం ఎంతవరకు సమంజసం?

ఇప్పటికైనా ఈ దేశ మూలవాసులు అంబేడ్కరిజాన్ని మరింత అధ్యయనం చేసి బహుజన వర్గాల మధ్య ఘర్షణను వీడి ఐక్యతతో విలువలతో కూడిన రాజ్య నిర్మాణం చేయాలి. లేదంటే మూలవాసి ప్రజలు మళ్ళీ మూడు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లి మూతికి ముంత, ముడ్డికి తాటాకు చీపురు లాంటి బానిస స్థితికి నెత్తివేయవాడుతారు.

స్వాతంత్ర పోరాటం కన్నా మా శూద్ర ప్రజల హక్కులే మిన్న అంటూ బహుజన ప్రజలను ఒక్క తాటిపై తెచ్చిన అంబేడ్కర్ కు ఎదురుతిరిగిన వల్లబాయి పటేల్ నీవు దళితుడవు నీవు దళితుల గురుంచి మాత్రమే మాట్లాడాలి బి.సి ప్రజల గురుంచి నీవు మాట్లాడకూడదని బి.సి ప్రజలను అంబేడ్కర్ నుండి ఆనాడే దూరం చేశారు. బి.సి లు అంబేడ్కర్ కు దూరం కావడం వల్లనే బ్రిటిష్ కాలంలో సాధించిన చట్ట సభల్లో రిజర్వేషన్లు బి.సి లకు దక్కకుండా పోయినాయి.

బి.సి లకు చట్ట సభల్లో, ఉన్నత విద్య, ఉద్యోగాల్లో హక్కులు లేకుండా చేసింది వల్లబాయి పటేల్ అనే విషయం బి.సి లకు తెలియనంత కాలం మూడు వేల కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి పటేల్ విగ్రహం పెట్టి ఉక్కు మనిషి అంటే బి.సి లు రోజు మొక్కే బానిసత్వములో ఉంటారు. ఇప్పడు బి సి లకు నిజమైన శత్రువులెవరో బి.సి లు తెలుసుకోవాలి. సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా కావాలని, ఓట్లు మావి సీట్లు మీవా? ప్రతి ఉత్పత్తిలో మేము, స్వాతంత్ర పోరాటం నుండి మొదలుకొని ప్రతి ఉద్యమంలో మేము అయినా మేమంటే లెక్క లేదా అంటూ కదం తొక్కుతున్న బి.సి లు అంబేడ్కర్ వాదాన్ని మరింత స్వంతం చేసుకోవాలి.

అంబేద్కర్ ను మించిన త్యాగశీలి లేరు
త్యాగం మరింత త్యాగం
పోరాటం మరింత పోరాటం
అదొక్కటే మనల్ని విముక్తి చేస్తుందని అంబేడ్కర్ ఆచరణాత్మక ఉద్యమం చేసాడు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా దేశ పీడిత వర్గాల విముక్తి కోసం, అనగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడమే కాకుండా తన నలుగురు పిల్లలకు, భార్య కు సరైన ఆహారం లేక పౌష్టికాహార లోపంతో చనిపోయారు. తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిసి కూడా మూలవాసి ప్రజల విముక్తి కోసమే తన ప్రయాణం కొనసాగించి త్యాగధనుడయ్యాడు.

మహిళా పక్షపాతి
దేశంలో సగబాగమైన మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ చట్టసభల్లో స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని హిందు కోడ్ బిల్లు పెడితే అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అందుకు నిరసనగా తన మంత్రి పదవికే రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడు. అటవీ ప్రాంతాలకు పరిమితమైన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడడం కోసం అమాయకులైన వారి ప్రాంతాల్లో ఆదివాసేతరులు చొరబడకూడదని రాజ్యాంగములోని షెడ్యూల్ 5 ద్వారా ఎంతో రక్షణ కల్పించాడు. అంబేడ్కర్ చూపిన బౌద్ద ధర్మంతో పాటు బీమా కోరేగామ్ వద్ద పీష్వా బ్రాహ్మణ రాజ్యాన్ని మూలవాసులు ఓడించిన జనవరి 1 న శౌర్య దివాస్ ను, డిసెంబర్ 25 న మనుధర్మ శాస్త్ర దహన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత అంబేడ్కర్ వాదులపై, బహుజన సంఘాలు, ఉద్యోగ సంఘాలపై ఉంది.

దళితుల కోసం, బి.సి ల కోసం,మహిళా హక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం, అందరికి ఓటు హక్కు కోసం, చిన్న రాష్ట్రాల కోసం ఇలా అన్ని వర్గాల కోసం పోరాడి ఎన్నో హక్కులు సాధించిన అంబేడ్కర్ అంటే అందరివాడని ఇప్పటికైనా అర్ధం చేసుకోని ఐక్యతగా ముందుకెళ్లి బహుజన ప్రజల విముక్తి కోసం పోరాడాలి.
(ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా)

– సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091

Leave a Reply