Suryaa.co.in

Editorial

తెలంగాణలో తెలుగుదేశం దారెటు?

– ఎన్నికల్లో పోరాటమా? అస్త్రసన్యాసమా?
– ముందు అన్ని సీట్లకూ ఒంటరి పోటీ అని ప్రకటన
– ఆ తర్వాత 86 చోట పోటీకి సిద్ధమన్న టీడీపీ అధ్యక్షుడు కాసాని
– బాబుతో భేటీకి రాజమండ్రికి కాసాని
– పోటీ చేస్తే కాంగ్రెస్‌కే లాభమని విశ్లేషణ
– పోటీ చేద్దామన్న పార్లమెంటు అధ్యక్షులు
– లేకపోతే క్యాడర్ డీలా పడుతుందని ఆందోళన
– పోటీ చేసే పరిస్థితులు లేవ ని పార్టీ భావన
– సమయం కూడా తక్కువేనంటున్న సీనియర్లు
– ప్రచారం చేసేదెవరని ప్రశ్నలు
– బాబు జైల్లో ఉంటే పోటీ మంచిదికాదని హితవు
– డిపాజిట్లు రాకపోతే పరువు పోతుందన్న ఆందోళన
– ఆస్తులు అమ్ముకుని పోటీ ఎందుకన్న ప్రశ్నలు
– సెటిలర్లు కూడా పార్టీకి వేయరన్న వాదన
– సెటిలర్లు కాంగ్రెస్-బీఆర్‌ఎస్ వైపు ఉన్నారని విశ్లేషణ
– కాసాని పార్టీ మారుతున్నారంటూ సోషల్‌మీడియాలో రచ్చ
– ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో అంతర్గత పోస్టుల యుద్ధం
– టీడీపీ ఎన్నికల బరిలో ఉండదని సీనియర్ల సంకేతాలు
– బాబు కోర్టులో తెలంగాణ టీడీపీ ఎన్నికల బంతి
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? పోటీ చేయకుండా అస్త్ర సన్యాసం చేస్తుందా? ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీ వర్గాలతో సహా రాజకీయవర్గాల్లో కనిపిస్తున్న ఉత్కంఠ. పోటీ చేయడం ఖాయమని, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ విస్పష్టంగా ప్రకటించారు. ముందు అన్ని స్థానాలకూ ఒంటరిగా పోటీ చేస్తామన్న ఆయన, తర్వాత 86 చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్ధులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. దానిపై రాజమండ్రి జైల్లో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయి, తుది నిర్ణయం ప్రకటిస్తామని కాసాని మీడియాకు వెల్లడించారు.

అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం అనుమానమేనని తెలుస్తోంది. సమయం తక్కువగా ఉండటం, మేనిఫెస్టో, ప్రచార సామాగ్రి సిద్ధం చేసుకోకపోవడం, ఆర్ధిక వనరులు లేకపోవడం, చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో యువనేత లోకేష్ న్యాయవాదులతో చర్చల్లో బిజీగా ఉన్నారు.

దానికిమించి ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చే బలమైన అభ్యర్ధులు లేకపోవడం వంటి అంశాలే టీడీపీ నిష్క్రమణకు ప్రధాన కారణమని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దానికితోడు ఇంత తక్కువ సమయంలో ప్రచారం చేయడం కూడా కష్టమేనంటున్నారు.అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకు బదులు, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

బాబు జైలుకు వెళ్లకముందు…. కాసాని కొంతమంది పార్టీ అభ్యర్ధులను బాబు వద్దకు తీసుకువెళ్లారు. ఆ సందర్భంగా అభ్యర్ధులకు ఆర్ధికసాయం చేసే పరిస్థితి లేనందున, వారే సొంతగా ఖర్చులు భరించాలని స్పష్టం చేశారు. పైగా తాను ఏపీలో బిజీగా ఉన్నందున, తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రావడం కష్టమన్నారు. అందువల్ల ఏదైనా మూడు ప్రాంతాల్లో బహిరంగసభలు పెట్టుకోవాలని సూచించారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు కావడం, లోకేష్ ఆయనను బయటకు తీసుకువచ్చేందుకు, న్యాయప్రక్రియపై దృష్టి సారించడంతో తెలంగాణలో పార్టీ అంశానికి, పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.

అయితే ఇటీవల కాసాని నిర్వహించిన పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశంలో, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని తీర్మానించారు. లేకపోతే క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గెలుపు-ఓటములను పక్కనపెట్టి, బలం ఉన్న చోట పోటీ చేస్తేనే పార్టీ బతికి బట్టకడుతుందని స్పష్టం చేశారు. దానితో తాను రాజమండ్రికి వెళ్లి, బాబును కలసి ఏ విషయం చెబుతానని కాసాని వారికి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా దానిపై అధ్యక్షుడయిన కాసాని, స్పష్టత ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం.

పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి, తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమేనని సీనియర్లు చెబుతున్నారు. ప్రత్యర్ధుల ఆర్ధికబలం ముందు నిలబడటం చాలా కష్టమంటున్నారు. ‘పోటీ చేసి డిపాజిట్లు కూడా రాకపోతే పరువు పోతుంది. అదే పోటీ చేయకుండా దూరంగా ఉంటే, టీడీపీ పోటీ చేసి ఉంటే ఏ పార్టీ గెలిచేది? ఏ పార్టీ ఓడిపోయేదన్న చర్చ జరుగుతుంది. ఒకరకంగా పోటీ చేసి పరువు పోగొట్టుకునే కంటే, పోటీ చేయకపోవడమే మేలు కదా? పైగా మా పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్‌కే లాభం. ఈ క్లిష్ట పరిస్థితిలో అనవసరంగా ఇతరులకు శత్రువు కావడం ఎందుకు’ అని పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

కాగా పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిలో, పోటీ చేయడం భావ్యం కాదని మరికొందరు తెలంగాణ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘ఇంటికి పెద్దదిక్కయిన యజమాని జైల్లో ఉంటే ఎవరైనా పోటీ చేస్తారా? ముందు ఆయన బయటకు వచ్చే ఆలోచన మీద దృష్టి పెట్టాలి. అక్రమంగా అరెస్టు చేసిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే దృష్టి సారించాలి కదా’ అని ఓ పొలిట్‌బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు.

నిజానికి తెలంగాణలో ఎక్కువ సీట్లలో పోటీ ఇచ్చే అవకాశం, ఒక్క ఖమ్మం జిల్లాలోనే కనిపిస్తోంది. అక్కడ కొంతమేరకు ఖర్చు భరించే అభ్యర్ధులు కూడా లేకపోలేదు. ఆ జిల్లాలో పార్టీకి ఆదరణ కూడా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు తుమ్మల వంటి నేతలు కాంగ్రెస్‌లో చేరినందున, జిల్లాలోని కమ్మవర్గం టీడీపీకి ఓటు వేయడం అనుమానమేనంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం బలమైన అభ్యర్ధులు లేరు. పార్టీని నమ్ముకుని కొనసాగుతున్న్పటికీ, వారిలో కార్పొరేటర్ స్థాయి నేతలే ఎక్కువన్నది నాయకత్వ అభిప్రాయం.

పోనీ అలాగని పార్టీ అధ్యక్షుడు కాసాని, అభ్యర్ధులందరి ఆర్థిక అవసరాలు తీరుస్తారా అంటే అదీ లేదు. ఒక్కో అభ్యర్థికి హీనపక్షం 50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది? ఆ నిధులు కాసాని ఇస్తారా? అన్న ప్రశ్నలు వినిపినన్నాయి. కాగా ఆయన పార్టీలో చేరేముందు తాను ఎన్నికల వరకూ వందకోట్ల రూపాయలు ఖర్చు పెడతానని హామీ ఇచ్చినట్లు, ఇప్పటికీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమేరకు టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక టీవీ ఛానెల్ అధిపతి, మరో పత్రిక సీనియర్ జర్నలిస్టు, పార్టీ సీనియర్ నేత ఒకరు ఆ ప్రతిపాదనతోనే చంద్రబాబుకు చెప్పి, కాసానిని పార్టీలో చేర్పించారన్న చర్చ చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది.

అయితే అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత, పరిస్థితి అందుకు భిన్నంగా మారడంతో, బాబు కూడా తెలంగాణ పార్టీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది నాయకులు, బాబుకు ఆయన పనితీరుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కాగా సూపర్ హిట్టయిన చంద్రబాబు ఖమ్మం సభ ఖర్చు కూడా, అక్కడి జిల్లా అధ్యక్షుడే ఎక్కువ భరించారంటున్నారు. అయితే తాను పార్టీ ఆఫీసు నిర్వహణ, పార్లమెంటు జిల్లా ఆఫీసులకు నెలకు కొంత ఖర్చులు మాత్రమే ఇస్తానని స్పష్టం చేశానని.. కాసాని పార్టీ నేతల వద్ద స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో పోటీ చేసి ఆర్ధికంగా నష్టపోయే కంటే, పోటీకి దూరంగా ఉండి ఆస్తులు కాపాడుకోవడమే మంచిదన్న భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పైకి పోటీ చేస్తామని చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం అన్ని డబ్బులు ఎవరిస్తారన్న ఆందోళన లేకపోలేదు. కాగా కాసాని రెండు నెలల క్రితం చంద్రబాబు నివాసంలో పార్టీ అభ్యర్ధులను పరిచయం చేశారు. ఆ సందర్భంలో టికెట్లు ఆశిస్తున్న నలుగురు అభ్యర్ధులు, బాబు ఇంటికి ఆటోలో వెళ్లారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఆ స్థాయి నేతలతో ఎన్నికలకు ఎలా వెళ్లాలని ఓ సీనియర్ నేత ప్రశ్నించారు. రోజూ మీడియాలో కనిపించేవారే తప్ప, జనక్షేత్రంలో ఉన్న నాయకుల సంఖ్య అత్యల్పమన్న అభిప్రాయం, పార్టీ నాయకత్వం దృష్టిలో లేకపోలేదని ఓ సీనియర్ నేత విశ్లేషించారు.

కాగా పార్టీ అధ్యక్షుడు కాసానిపై సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఆయన పనితీరుకు వ్యతిరేకంగా, రెండు రోజుల క్రితం ఒక ప్రకటన వెలువడింది. తాజాగా ఆయన బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల్లో పోటీకి బాబు నిరాకరిస్తే, కాసాని బీఆర్‌ఎస్‌లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్నది ఆ పోస్టుల సారాంశం. అయితే ఇదంతా పార్టీలో కొందరు చేస్తున్న కుట్రలని, కాసాని వర్గీయులు ఖండిస్తున్నారు. ఆయన పార్టీ మారే సమస్య లేదని స్పష్టం చేస్తున్నారు. పరిమిత సంఖ్యలోనయినా పోటీ చేయడం ఖాయమంటున్నారు.

ఏదేమైనా కాసాని పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాతనే తెలంగాణలో పోటీపై స్పష్టత వస్తుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేయడంపై, స్వయంగా కాసాని ప్రకటించనున్నారన్నమాట.

LEAVE A RESPONSE