Suryaa.co.in

Telangana

ప్రధాని మోడీని సీఎం రేవంత్ కలిస్తే తప్పేంటి

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి
-భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించాలి
-కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు
-బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ రాష్ట్ర సీఎం ప్రధానిని కలిస్తే తప్పేమిటని అన్నారు. అందులో మంచిని చూడాలి కానీ.. ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సీఎం రేవంత్ ఇదే పంథాను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గతంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే.. కేసీఆర్ ఓ దొంగల దాక్కున్నాడని విమర్శించారు. కనీసం రాష్ట్ర ప్రయోజనాలు, వచ్చే నిధుల గురించి కూడా ఆలోచన చేయలేదని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కరీంనగర్ పూర్తిగా ‘ఆర్థికంగా దోపిడీకి గురైందని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్లో సభ పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీకి దోస్తీ ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆప పార్టీతో తమకు పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బూటకపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా మభ్యపెడుతోందని ఆరోపించారు. నిరుపేదలకు ఇళ్లు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెన్షన్ రూ.4 వేలకు పెంపు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకు వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.

కళ్లు తాగిన బండి సంజయ్

తన ప్రజాహిత యాత్రలో ఓ గ్రామంలో ఓ గౌడన్న కల్లు పోస్తే బండి సంజయ్ తాగారు. ఆ గౌడన్నను ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘కల్లు పోసిన మీ ఆప్యాయత… కళ్ల నిండా పొంగిన ప్రేమ… జీవితమంతా మరువలేనిది… గౌడన్నల గుండెలో నాకున్న స్థానం కాపాడుకుంటా… కడదాకా కృతజ్ఞతతో ఉంటా…’ అని ట్వీట్ చేశారు.

LEAVE A RESPONSE