Suryaa.co.in

Editorial

ఇదేం బోర్డు వెంకటేశా?

  • కీలక నిర్ణయాలు చర్చించరా?

  • పింక్ డైమండ్‌పై విజయసాయి ఆరోపణ నిజం చేస్తున్నారా?

  • పరువునష్టం కేసును కొండెక్కించేస్తారా?

  • ఆ 2 కోట్ల భక్తుల సొమ్ము ఎవరి నుంచి రికవరీ చేస్తారు?

  • నెయ్యిలో పందికొవ్వు ఉందన్న ఈఓ ఆరోపణపై చర్చించరా?

  • సిట్ విచారణపై పురోగతిని ఈఓ సభ్యులకు చెప్పారా?

  • ధర్మారెడ్డి దారిలోనే కొత్త బోర్డు నడుస్తోందా?

  • జగన్ జమానా తీర్మానాలు రద్దు చేసేందుకు భయమెందుకు?

  • బడాబాబుల పెంట్‌హౌస్‌లపై చర్యలకు భయపడుతున్నారా?

  • వాటిని స్వాధీనం చేసుకునేందుకు మొహమాటం ఎందుకు?

  • అందులో మీడియా అధిపతి గెస్టుహౌస్ ఉందన్న మొహమాటమా?

  • మాజీమంత్రి శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలపై కేసు పెట్టారా? లేదా?

  • మళ్లీ పాత నాయుడు గారికే అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఇచ్చేశారా?

  • జీడిపప్పు..టీ.. బిస్కట్ల కోసమేనా బోర్డు భేటీలు?

  • బాధ్యతలు, విధులేమిటో తెలియని సభ్యులు

  • వాటి వివరాలు కూడా సభ్యులకు ఇవ్వరా?

  • భక్తజనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం

( మార్తి సుబ్రహ్మణ్యం)

టీటీడీ బోర్డులో స్థానం దక్కడమంటే ఆషామాషీ విషయం కాదు. అది దేవుడిచ్చిన అద్భుత అవకాశమన్నది భక్తకోటి భావన. భక్తుల సౌకర్యాలతోపాటు, భక్తులు చెల్లించే కానుకలు సద్వినియోగం అవుతున్నాయా? దుర్వినియోగం అవుతున్నాయా అని.. దగ్గర నుంచి పరిశీలించే ఒక సదవకాశం. పాత బోర్డులు తీసుకున్న మతిలేని నిర్ణయాలను రద్దు చేసి, భక్తులకు అనుకూలంగా వాటిని మార్చుకునే అవకాశం ఉన్న ఏకైక బోర్డు అది.

మరి ఇప్పుడు అందులో కొలువుదీరిన మెంబర్లు, తమకు వచ్చిన అవకాశం వినియోగించుకుంటున్నారా? పాత పాలకమండలి తీసుకున్న అనేక అవకతవకల విధానాలపై చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారా? అసలు మా బాధ్యతలు, విధులు, అధికారాలేమిటని నోరు తెరిచి నిలదీస్తున్నారా? లేక.. టీటీడీ పెట్టే జీడిపప్పు, పకోడి, తిరుమల లడ్డు, టీ, బిస్కెట్లు తిని..తమకు కోటా పెంచాలని అడిగి, మూతి తుడుచుకుని వచ్చేస్తున్నారా? అదీ ఇప్పుడు భక్తులు సంధిస్తున్న ప్రశ్నలు. వారిలో గూడుకట్టుకున్న సందేహాలు!

టీటీడీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండో సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడంపై భక్తులు, టీడీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.ప్రపంచంలోని వెంకన్న భక్తులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న లడ్లలో పందికొవ్వు కలిపారన్న ఈఓ శ్యామలరావు ఆరోపణలపై.. సిట్ విచారణ పురోగతిని ఆయన బోర్డు సభ్యులకు వివరిస్తారని భావించారు. ఇటీవల సిట్ బృందం ఈఓతో భేటీ అయి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.

కానీ దానిపై అటు ఈఓ సభ్యులకు వివరించలేదు. ఇటు సభ్యులు కూడా ఈఓను ప్రశ్నించలేదు. ఆ రకంగా కీలకమైన లడ్లలో కల్తీ అంశం చర్చను విజయవంతంగా విస్మరించారు. ‘‘ఇది చాలా కీలక అంశం. మేం బోర్డుమెంబర్లం కాబట్టి మీడియా వాళ్లు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. సిట్ విచారణ ఎంతవరకూ వచ్చిందని అడిగితే మేం ఏం చెప్పాలి? మాకు అధికారులు బ్రీప్ చేస్తేనే కదా మీడియాకు చెప్పగలిగేది. మాకే ఏమీ తెలియకపోతే మీడియాకు ఏం చెబుతాం’’ అని ఓ సభ్యుడు వ్యాఖ్యానించారు.

గతంలో ఎన్నికల ముందు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడుపై.. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన పింక్‌డైమండ్ ఆరోపణను, అధికారులు నిజం చేసేలా ఉన్నారని బోర్డు సభ్యులొకరు వ్యాఖ్యానించారు. కోర్టుకు కట్టిన రెండు కోట్ల రూపాయలు ఎవరి నుంచి రికవరీ చేయాలి? మళ్లీ దానిపై కోర్టును ఆశ్రయించి విజయసాయరెడ్డిపై పరువునష్టం దావాను కొనసాగించాలా? వద్దా? అన్న అంశాన్ని అధికారులు అజెండాలో పెట్టకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి.. సీఎం చంద్రబాబుపై చేసిన పింక్‌డైమండ్ ఆరోపణలను, ప్రస్తుత అధికారులు కూడా ధృవీకరిస్తున్నట్లే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాగా తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌పై కేసు నమోదు విషయం, తాజా సమావేశంలో స్వయంగా చైర్మన్ ప్రస్తావించినట్లు సమాచారం. ‘‘నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు కేసు నమోదు చేయలేదు? బోర్డులో తీసుకున్న నిర్ణయం అమలుచేయాల్సిన బాధ్యత ఉంది కదా? ’’ అని నిలదీయగా, అందులో కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులున్నాయని, దానిపై ఏం చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని వచ్చే సమావేశంలో వెల్లడిస్తామని అధికారులు బదులిచ్చినట్లు సమాచారం.

ఆ అధికారిపై జంగా ఆగ్రహం

టీటీడీలో ఒక కీలక అధికారి వ్యవహారశైలి అటు అధికారులు, ఇటు బోర్డు సభ్యులకూ ఆగ్రహంగా మారింది. సిఫార్సు లేఖలకు సంబంధించిన ప్రతిసారి మారుస్తున్న నిబంధనలపై ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారానికి రెండు లెటర్లు ఆమోదించగా, ఈ అధికారి వచ్చిన తర్వాత వాటిని వారానికి ఒకటి ఆమోదిస్తున్న వైనం వారికి రుచించడం లేదు. అది కూడా ఎన్ని ఆమోదిస్తారన్న దానిపై స్పష్టత ఉండటం లేదట.

ఈ అస్తవ్యస్థ విధానంపై ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఒక ముఖ్య అధికారి, మరికొందరు అధికారులు కూడా ఆయనతో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరిగింది. గతంలో ధర్మారెడ్డి కూడా ఇలా వ్యవహరించలేదని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కుమార్తె పెళ్లి సందర్భంగా.. టీటీడీ బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేల లేఖలు తీసుకుని ఇచ్చినప్పటికీ, సదరు టీటీడీ అధికారి వాటిని తిరస్కరించారట. దానితో విధి లేక ఆ మాజీ సీఎస్.. అప్పటికప్పుడు 50 శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసి, దర్శనం చేసుకున్నారట.

తాజాగా గురువారం టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి తన మిత్రులైన ఢిల్లీ ఐఏఎస్ అధికారి, మరికొందరితో దర్శనం చేసుకుంటానని ఆ అధికారికి లేఖ ఇచ్చారట. అయితే బోర్డు సభ్యులకు 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇస్తామని చెప్పి, ఆయన లేఖను తిరస్కరించారట. దానితో జంగా సదరు అధికారిపై విరుచుకుపడ్డారట. వాగ్వావాదానికి దిగారట. చివరకు రాత్రి 9 గంటలకు దర్శనం కల్పిస్తున్నట్లు ఎస్‌ఎంఎస్ వచ్చిందట. సదరు అధికారి వ్యవహారశైలి ఏమాత్రం గౌరవప్రదంగా లేదన్న వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ వినిపిస్తుండటమే విశేషం.

సీఎం పేరు చెబుతారేం?

కాగా బోర్డు సభ్యులను సీఎం పేరు చెప్పి బెదిరించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై, బోర్డు మెంబర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మెంబర్ల కోటా, మాజీ మంత్రి శ్రీనివాగౌడ్‌పై కేసు అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో అధికారులు.. ముఖ్యమంత్రితో చర్చించాల్సి ఉందని చెప్పినట్లు తెలిసింది. దానితో ఆగ్రహించిన సీనియర్ ఎమ్మెల్యే, బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రు.. ప్రతిదానికి సీఎం ఎందుకు ఇన్వాల్స్ అవుతారు? మన బోర్డు ఉన్నది ఎందుకు.. చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికే కదా? మీరు సీఎం గారి చెప్పి భయపెట్టాలని చూస్తే ఎలా’ అని కన్నెర్ర చేసినట్లు సమాచారం.

విధులు, అధికారాలేమిటో తెలియని సభ్యులు

టీటీడీ బోర్డులో మెంబర్లయితే అయ్యారు గానీ.. అసలు తమ విధులు, అధికారాలేమిటో ఒక్క సభ్యుడికీ తెలియకపోవడమే వింత. ఆ మేరకు అధికారులు కూడా, వారిని అలాంటి అయోమయంలోనే ఉంచుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి టీటీడీ మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. వారికి టీటీడీ యాక్టు బుక్, ఎవరి పరిథి ఏమిటన్న ప్రచురణను అందచేస్తారు. ఆ ప్రకారంగా సభ్యులు దానిని అనుసరించి, బోర్డులో మాట్లాడుతుంటారు. కానీ కొత్త బోర్డులో సభ్యులకు అధికారులకు ఇప్పటిదాకా టీటీడీ యాక్టు బుక్ ఇవ్వకపోవడం బట్టి.. సభ్యులను అధికారులు పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదని అర్ధమవుతుంది.

‘‘అసలు మా అధికారాలేంటో, ఆఫీసర్ల పరిథి ఏంటో తెలియదు. మాకు ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. దానికి సంబంధించిన నోట్స్ ఏమైనా ఉన్నాయో లేవో కూడా తెలియదు. అందువల్ల మా పరిస్థితి కత్తిలేకుండా యుద్ధానికి వెళ్లినట్లుంది. దానితో ఆఫీసర్లు చెప్పినదానినే వినాల్సి వస్తుంది. రెండు మీటింగులైన తర్వాత మాకు డైరీలయితే ఇచ్చారు కానీ టీటీడీ యాక్టు బుక్ ఇవ్వలేదు. మా పరిస్థితి చూస్తే పకోడి, జీడిపప్పు, టీ తాగడానికి అంత దూరం నుంచి వచ్చిన ట్లుంద’’ని బోర్డు సభ్యుడొకరు వాపోయారు.

అసలు బోర్డు సమావేశం అజెండాను తమకు, రెండు మూడు రోజుల ముందే ఇవ్వడంపై సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా అది కూడా ఇంగ్లీషులో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా బోర్డు అజెండా కాపీలు తెలుగు, ఇంగ్లీషులో సభ్యులకు పంపిణీ చేస్తుంటారు. ఉత్తరాదివారితోపాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నందున వారికి ఇంగ్లీషు కాపీలిచ్చి, తెలుగువారికి తెలుగు కాపీలు ఇస్తుండటం సంప్రదాయంగా వస్తుంది. అయితే కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత జరిగిన రెండు సమావేశాలకూ, ఇంగ్లీషు ప్రతులే ఇవ్వడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బోర్డు ఉన్నప్పుడు ర్యాటిఫికేషన్లు ఎందుకు?

సహజంగా బోర్డు లేనప్పుడు టీటీడీలో జరిగిన వివిధ పనులకు సంబంధించిన బిల్లుల ఆమోదం వ్యవహారం, అధికారుల పరిథిలోనే ఉంటుంది. కానీ బోర్డు ఏర్పడి రెండు నెలలయినప్పటికీ, ఇంకా బిల్లుల ర్యాటిఫికేషన్ కోసం బోర్డుకు పంపించడంపై చైర్మన్ సహా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తొలి సమావేశంలో కూడా అంతకుముందు జరిగిన బిల్లుల ర్యాటిఫికేషన్‌ను బోర్డు ఆమోదించగా, తాజాగా దాదాపు 60 బిల్లుల ర్యాటిఫికేషన్ బోర్డులో పెట్టినట్లు సమాచారం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్.. బోర్డు ఉన్నప్పుడు ర్యాటిఫికేషన్ ఏంటి? ఇకపై ఇలాంటి విధానాలు అంగీకరించేది లేదని హెచ్చరించారట. నిజానికి బోర్డు లేనప్పుడు జరిగిన పనుల ర్యాటిఫికేషన్‌ను కొత్త బోర్డులో పెట్టకూడదని, అది అధికారులు అప్పట్లో తీసుకున్న నిర్ణయం కాబట్టి.. వారే దానికి బాధ్యత వహించాలని బోర్డు మాజీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

బడా బాబులకు భయపడ్డారా?

తిరుమలపై ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన గెస్ట్‌హౌస్‌లపై నిర్మించిన పెంట్‌హౌస్‌లను.. టీటీడీ స్వాధీనం చేసుకునే అంశంపై బోర్డు భయపడినట్లు, తాజా సమావేశం స్పష్టం చేసింది. 15 మంది బడాబాబులకు.. గత పాలకవర్గం అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేసే అధికారాన్ని, కొత్త బోర్డు ఎందుకు వినియోగించుకోలేదన్నది ప్రశ్న. నిజానికి గత పాలకమండలి, గెస్టుహౌస్‌లు నిర్మించేవారికి పైన ఒక పెంట్‌హౌస్ నిర్మించుకుని, వాటికి ఏడాది పొడవునా వారికే వదిలేసేలా నిబంధన రూపొందించింది. అదేమీ రాజ్యాంగం కాదు. వాటిని మార్చుకునే అవకాశం బోర్డుకు ఎప్పటికీ ఉంటుంది.

కానీ వాటిని టీటీడీ స్వాధీనం చేసుకునే అధికారం ఉన్నప్పటికీ, వారి జోలికి వెళ్లేందుకు బోర్డు భయపడటమే వింత. బహుశా ఇందులో ఇద్దరు టీవీ చానెళ్ల యజమానులతోపాటు, చెన్నె, బెంగళూరుకు చెందిన బిగ్‌షాట్స్ ఉన్నందున.. బోర్డు వారికి జోలికి వెళ్లేందుకు, భయపడినట్లు స్పష్టమవుతోంది. పైగా చైర్మన్ కూడా స్వయంగా ఒక టీవీ చానెల్ అధిపతి కావడం ప్రస్తావనార్హం.

ఈ విషయంలో టీడీపీకి చెందిన సభ్యులతోపాటు.. నిరంతరం టీటీడీ అంశాలపై ఎలుగెత్తే బీజేపీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి కూడా, ఇప్పటిదాకా పెదవి విప్పకపోవడమే ఆశ్చర్యం. అలాగే కొండపై విశాఖ స్వామి నిర్మించిన మఠం నిర్మాణంపై, నానా యాగీ చేసిన జనసేన నేత కిరణ్ రాయల్ కూడా.. ఈ బాబులు కట్టుకున్న పెంట్‌హౌస్‌లను టీటీడీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేయకపోవడమే ఆశ్చర్యం.

మళ్లీ ఆ నాయుడుగారికే కాంట్రాక్టు ఇచ్చారా?

కాగా తిరుమలపై వివిధ సేవలందించేందుకు ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు పనులు అప్పగిస్తుంటారు. దాదాపు 15 ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు వివిధ విభాగాల్లో పనిచేస్తుంటాయని చెబుతున్నారు. వీటిలో కొండపై వ్యవహారాలకు సంబంధించి తరచూ మాట్లాడే ఓ బీజేపీకి నేతకు సైతం, కంపెనీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు ఒక నాయుడుగారికి చెందిన అవుట్‌సోర్సింగ్ కంపెనీకి.. ఎలాంటి టెండర్లు లేకుండా టీటీడీతోపాటు విజయవాడ కనకదుర్గ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం దేవాలయాల్లో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు.

ఆయన సీఎం అయిన తర్వాత సదరు నాయుడు గారికి టీడీపీ సర్కారు ఇచ్చిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులను రద్దు చేశారు. అయితే విచిత్రంగా కొద్దినెలల తర్వాత, టీటీడీలో మళ్లీ ఆయనకే కాంట్రాక్టు పునరద్ధరించడంపై ఆశ్చర్యం వ్యక్తమయింది. దానికి తిరుపతికి చెందిన ఓ బీజేపీ నేత చేసిన లాబీయింగ్ కారణమన్న ప్రచారం జరిగిన విషయం తె లిసిందే. అయితే ఇప్పుడు కూడా మళ్లీ సదరు నాయుడు గారి కంపెనీకే.. అవుట్‌సోర్సింగ్ కంపెనీ పనులు కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు నాయుడు గారి కంపెనీ పనుల నాణ్యత బాగుంటుందని, అయితే రేటు మాత్రం మిగిలిన కంపెనెలకంటే అధికంగా ఉంటుందన్న ప్రచారం మార్కెట్‌లో లేకపోలేదు.

ఈఓ, జెఈఓ విచక్షణాధికార కోటా ఎంత?

దర్శనాలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపి, ఐపిఎస్, ఐఏఎస్ అధికారులకు కోటా నిర్దేశించిన క్రమంలో.. అసలు ఈఓ-జేఈఓలకు ఉన్న విచక్షణాధికార కోటా ఎంత? వారు ప్రతిరోజూ ఎన్ని టికెట్లు ఇవ్వవచ్చు? అన్న చర్చకు తెరలేచింది. ‘‘టీటీడీ యాక్టు ప్రకారం ఈఓ అనే అధికారి ప్రభుత్వాధికారి అయినప్పటికీ, బోర్డు చెప్పినట్లే నడుచుకోవాలి. బోర్డుకే జవాబుదారి. అంటే వాళ్లకేమీ ప్రత్యేకాధికారాలు ఉండవు. మరి సభ్యులకు లేని విచక్షణాధికార కోటా వారికెందుకు? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఎమ్మెల్యేలు, బోర్డు సభ్యులు ఎంతమందికి సిఫార్సు లేఖలు ఇస్తున్నారన్న వివరాలు వెల్లడిస్తున్న అధికారులు.. ఈఓ, జేఈఓ విచక్షణాధికారాల కింద ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారో ఎందుకు వెల్లడించరు? వాళ్లేమీ బోర్డు కంటే ఎక్కువ కాదు కదా? అని బోర్డు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక్క సీఎంఓకు మాత్రమే ఏడాది పొడవునా ఎన్ని లెటర్లయినా ఇచ్చే విచక్షణాధికారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.

కమిటీలు ఏవీ?

టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత వివిధ విభాగాలకు కమిటీలు నియమిస్తుంటారు. కానీ బోర్డు ఏర్పడి ఇన్నిరోజులయినప్పటికీ.. ఇప్పటివరకూ అధికారులు కమిటీలపై కసరత్తు ప్రారంభించకపోవడంపై, సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో చైర్మన్ చొరవ తీసుకుని, ఈ వారంలో తానే కమిటీలు వేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. సభ్యులను డమ్మీ చేసేందుకే అధికారులు ఇవన్నీ చేస్తున్నట్లు కనిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE