-
వసతి-దర్శనాల్లో ‘న్యాయవ్యవస్థ’కు మినహాయింపు ఎందుకు?
-
అపరిమిత దర్శనాలు ‘న్యాయమా’?
-
టికెట్లు లేకుండానే ఉచిత దర్శన వసతి సౌకర్యాలా?
-
పరివారానికి అపరిమిత అనుమతి ‘న్యాయమా’?
-
ఎమ్మెల్యే, ఎంపీలకు లేని సౌకర్యాలు వారికెందుకు?
-
కోట్లాది రూపాయల ‘రెవిన్యూ’ బకాయిలు
-
2008 వరకూ 6 కోట్ల బకాయిలు
-
ఎన్ని లేఖలు రాసినా సర్కారు నుంచి స్పందన శూన్యం
-
వీపీఐల తిండి-వసతి ఖర్చు టీటీడీ ఖాతాలో ఎందుకు?
-
గతంలో న్యాయవ్యవస్థతో అంటకాగిన జేఈఓలు
-
వైసీపీ జమానాలో కోట్ల రూపాయల ఖరీదైన వాచీ బహుమతిగా ఇవ్వజూపిన వైనంపై ఓ జడ్జి ఆగ్రహం
-
‘న్యాయవ్యవస్థ’కు ప్రత్యేకం ఎందుకు?
-
న్యాయ, ఇన్‌కమ్‌టాక్స్‌కు ప్రత్యేకంగా ప్రొటోకాల్ అధికారులెందుకు?
-
మీడియా ప్రతినిధులకూ లేఖల సౌకర్యం ఎందుకు?
-
వారికి మిన హాయింపులు ఉన్నాయని టీటీడీ చట్టంలో చెప్పిందా?
-
వెంకన్నకు అందరూ సమానం కాదా?
-
వెంకన్న భక్తుల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)
అపదమొక్కుల వాడికి భక్తులందరూ సమానమే. ఆగర్భ శ్రీమంతుడి నుంచి కటిక దరిద్రుడి వరకూ వెంకన్నస్వామికి సమానమే. భక్తుల్లో పేద-ధనిక-పలుకుబడి అనే వర్గాలను విభించించి.. దర్శనం చేయిస్తున్నది పాలకులే తప్ప వెంకన్నకాదు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి దైవ దర్శనం చేసుకుంటే.. అదే వీఐపీలు-సెలబ్రిటీలు స్పెషల్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలతో నిమిషాలు-గంటల్లోనే దర్శనం చేసుకుని వస్తున్నారు. అసలు దైవదర్శనంలో, వీఐపీ-సామాన్య భక్తుల మధ్య పక్షపాతం ఎందుకు?
భక్తుల్లో ప్రోటోకాల్ భక్తులేమిటి? స్వామికి అందరూ సమానమైనప్పుడు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు న్యాయమూర్తుల ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా న్యాయవ్యవస్థకు ఉన్న ప్రత్యేక వెసులుబాటు, సౌకర్యాలు ఎందుకు? సహజంగా ఆరుగురికే పరిమితమైన దర్శనం.. న్యాయవ్యవస్థకు మాత్రం ఎందుకు మినహాయింపు? ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులే టికెట్లు తీసుకుని దర్శనం చేసుకుంటే.. న్యాయవ్యవస్థకు మాత్రం మినహాయింపు ఎందుకు? వీఐపీలను మేపుతున్న టీటీడీకి సర్కారు పెండింగ్ బకాయిలు ఎందుకు ఇవ్వదు? టీటీడీ వారిని ఉచితంగా ఎందుకు మేపాలి? ఇవీ ఇప్పుడు భక్తులు సంధిస్తున్న ప్రశ్నలు.
తిరుమల కొండపై కొలువుదీరిన స్వామివారికి భక్తులంతా సమానమే. కొండంత నమ్మకంతో ముడుపులు చెల్లించుకునేందుకు.. వేల కిలోమీటర్ల దూరం నుంచి వ్యయప్రయాసలోర్చి, చద్ది మూటకట్టుకుని వచ్చే సామాన్య భక్తులూ స్వామివారికి ప్రీతిపాత్రమే. ప్రత్యేక విమానాలు వేసుకుని వచ్చి, నిమిషాలు- గంటల్లో దర్శనం చేసుకునే వీఐపీలు, సెలబ్రిటీలూ స్వామికి ఇష్టమే.
మరి అలాంటప్పుడు దర్శనాల్లో పక్షపాతం ఎందుకు? సామాన్య భక్తుల దర్శనాలకు బ్రేక్ ఇచ్చి, డబ్బు-పలుకుబడి ఉన్న భక్తులకు దర్శనం చేయించే అధికారం బోర్డుకు ఎవరిచ్చారు? రోజూ 80 వేల మంది భక్తులు వచ్చే సందర్భంలో.. సుమారు నాలుగువేల మంది వీఐపీ భక్తులే వస్తుంటే, ఇక సామాన్య భక్తులకు సులభ దర్శనం ఎప్పుడవుతుంది? ఈ విధానాలకు పాతర వేసే ధైర్యం పాలకులకు లేదా? అసలు ఈ వీఐపి దర్శనాలను రద్దు చేయాలని అడిగే దమ్ము, ఒక్క పాలకమండలి సభ్యుడికయినా ఉందా? అన్నది భక్తుల ప్రశ్న.
ప్రధానంగా ప్రజాప్రతినిధుల కంటే న్యాయ వ్యవస్థకు అపరిమత దర్శనాలు కల్పించటంపై, భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా బోర్డు సభ్యుల సహా ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర వీఐపీల దర్శనాలు, వసతికి డబ్బులు వసూలు చేస్తుంటారు. బోర్డు సభ్యులకు సమావేశం ఉన్న రోజుల్లో మాత్రం, దర్శన-వసతి సౌకర్యాలు ఉచితం. మిగిలిన రోజుల్లో వారు సైతం టికెట్లు కొనాల్సిందే. వారు కూడా తమతో కేవలం ఐదుగురుని మాత్రమే వెంట తీసుకునివెళ్లవచ్చు. అది కూడా ఒక్కోసారి జేఈఓలు వెంటనే అనుమతించరు. ఇటీవల బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తికే, ఇలాంటి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే.
కానీ న్యాయవ్యవస్థకు సంబంధించిన వ్యక్తులకు మాత్రం.. ఈ విషయంలో పూర్తి మినహాయింపు ఇవ్వడంపై అటు బోర్డు సభ్యులు, ఇటు సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొటోకాల్‌లో ఉన్న వారు కాకుండా, మిగిలిన వారికీ ఇలాంటి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. న్యాయవ్యవస్థలో ప్రొటోకాల్ ఉన్న వారికి మాత్రమే, టీటీడీ దర్శన-వసతి సౌకర్యాలు సమకూరుస్తుంది. తర్వాత ఆ బిల్లులను రెవిన్యూ శాఖకు పంపిస్తుంటుంది. దానిని ఆ శాఖ చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ పద్ధతి.
కానీ న్యాయవ్యవస్థలోని అందరికీ ఈ ఉచిత సౌకర్యం కల్పించటంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పైగా వారి వెంట వచ్చే పరివారం మొత్తానికి, ఉచిత సేవలు కల్పించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు న్యాయవ్యవస్థ ప్రముఖలకు దర్శనాలు కల్పించేందుకు, ఒక ప్రొటోకాల్ అధికారినే కొండ కింద నియమించడమే ఆశ్చర్యం. మరి ఇది అధికారికమా? అనధికారికమో తెలియదు. ఆదాయపన్ను శాఖ సైతం ఒక ప్రొటోకాల్ అధికారిని నియమించడం మరో ఆశ్చర్యం.
వీరంతా తమ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు తిరుమల దర్శనానికి వచ్చిన సందర్భంలో.. తమ విభాగం నుంచి ఇంతమంది అధికారులు, ఫలానారోజు దర్శనానికి వస్తున్నందున వారికి దర్శన-వసతి సౌకర్యాలు కల్పించాలంటూ, టీటీడీ జేఈఓకు లేఖ రాస్తుంటారు. వీరికి అక్కడ అదే డ్యూటీ. ఇంకో విచిత్రమేమిటంటే.. అసలు ఎలాంటి అధికారాలు లేని మీడియా సంస్థల ప్రతినిధులు సైతం.. తమ యాజమాన్యానికి చెందిన వారు ఫలానా రోజు దర్శనానికి వస్తున్నందున, వారికి వసతి-దర్శన సౌకర్యాలు ఇవ్వాలంటూ లేఖ ఇవ్వడం! ఈవిధంగా లేఖలు రాస్తే దానిని ఆమోదించాలన్న చట్టం టీటీడీలో ఎక్కడుందో అధికారులకే తెలియాలంటున్నారు.
కాగా దర్శనానికి వచ్చే న్యాయ్వ్యవస్థకు చెందిన ప్రముఖులకు.. టికెట్లు లేకుండానే ఉచిత దర్శనం కల్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వారికి ఖరీదైన కాటేజీలు కేటాయిస్తుంటారు. అక్కడే టీటీడీ ఖర్చుతో వారికి భోజనాలు కూడా ఏర్పాటుచేస్తుంటారు. వాస్తవానికి ప్రొటోకాల్ ఉన్న వీఐపీలకు పద్మావతి ప్రాంతంలో ఉంటేనే, వారికి ఉచిత భోజన-వసతి సౌకర్యం కల్పించాలన్న నిబంధన ఉంది. గతంలో ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, మంత్రులు, హైకోర్టు-సుప్రీంకోర్డు జడ్జిలు అక్కడే ఉండేవారు.
ఇప్పుడు వారంతా పద్మావతికి బదులు.. కొండపై పారిశ్రామికవేత్తలు పెంట్‌హౌస్‌లపై నిర్మించిన గెస్టుహౌస్‌లలో ఉంటున్నారు. ఇటీవల తిరుమల వచ్చిన ప్రధాని సైతం ఒక ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో బస చేయడం, ఓ నిదర్శనమని భక్తులు గుర్తు చేస్తున్నారు. వాటిని టీటీడీ స్వాధీనం చేసుకోకపోవడానికి ప్రధాన కారణం, ఈ మొహమాటమేనంటున్నారు.
నిజానికి కొండపై ఎవరికీ సొంత ఆస్తులు ఉండవు. కానీ పారిశ్రామికవేత్తలు, పలుకుబడి ఉన్న వారికి మాత్రం పెంట్‌హౌస్‌లపై.. సొంత గెస్టు హౌసులు నిర్మించుకునే సౌకర్యాన్ని, గత ధర్మారెడ్డి జమానా కల్పించింది. వారు ఆ గెస్టుహౌసులను తమ పలుకుబడి పెంచుకునేందుకు.. అన్ని వ్యవస్థలకు చెందిన ప్రముఖులకు, తిరుమల వచ్చినప్పుడు కేటాయిస్తుంటారు. ఒకరకంగా ఇది బడా పారిశ్రామికవేత్తల పలుకుబడి విస్తరించుకునేందుకు, నాటి జేఈఓ ధర్మారెడ్డి ఇచ్చిన వెసులుబాటన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి.
అయితే ధర్మారెడ్డి హయాంలో రూపొందించి ఆ నిబంధన మార్చి, వాటిని టీటీడీ స్వాధీనం చేసుకునే అధికారాన్ని.. బీఆర్ నాయుడు సారధ్యంలోని పాలకమండలి, ఎందుకు వినియోగించుకోవడం లేదన్నది భక్తుల ప్రశ్న. ముఖ్యంగా కొండపై కాటేజీలో 13 గదులు తన సొంత ఖర్చుతో నిర్మిస్తానని లేఖ రాసి, సగంలో ఆగిన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఓ చానెల్ యజమాని.. ఆ తర్వాత తాను కూడా మిగిలిన వారి మాదిరిగానే.. 12 గదులు తన సొంత ఖర్చుతో నిర్మించినందున, మిగిలిన ఒక ఫ్లోర్‌లో పెంట్‌హౌస్ నిర్మించుకుని, దానిని తానే నిర్వహించుకునే సౌకర్యం కల్పించాలని లేఖ రాశారు. దానికి బోర్డు అంగీకారం తెలిపింది. ఆ రకంగా ఆయన టీటీడీకి ఇప్పటివరకూ 5 కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. దీనిపై ప్రస్తుత బోర్డు సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న.
అయితే న్యాయవ్యవస్థ సహా వీవీఐపిల భోజన-వసతి సౌకర్యాన్ని తొలుత టీటీడీనే భరిస్తుంది. అంటే వారి వెంట వచ్చే వారికి భోజన సౌకర్యానికయ్యే ఖర్చంతా టీటీడీ భరిస్తుందన్న మాట. ఆ బిల్లులలను అధికారులు ఈఓకు పంపితే, ఆయన వాటిని ఆమోదిస్తారు. ఈఓ సంతకం చేసిన ఆ బిల్లులను రెవిన్యూ శాఖకు పంపిస్తారు. రెవిన్యూ శాఖ వాటిని టీటీడీకి చెల్లించాలి. ఇదీ వీఐపీల విషయంలో టీటీడీ అనుసరించే విధానం.
కానీ రెవిన్యూ శాఖ మాత్రం.. ఆ బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడంతో, ఆ భారమంతా టీటీడీనే భరించాల్సి వస్తోందని టీటీడీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ‘బోర్డు సభ్యులమైతే మేమే డబ్బులు చెల్లించి కాటేజీలు తీసుకుని, భోజనం చేస్తుంటే.. న్యాయవ్యవస్థ సహా ఇతరులకు ఆ వెసులుబాటు ఎందుకు? వారు కూడా తమ లాంటి భక్తులే అయినప్పుడు వారి నుంచి కూడా తమ మాదిరిగానే వెంటనే డబ్బులు ఎందుకు వసూలు చేయర’ని ఆయన ప్రశ్నించారు.
కేవలం 2008 వరకూ ఇలాంటి పెండి ంగ్ బిల్లులు, ఆరుకోట్ల రూపాయల వరకూ ఉన్నట్లు ఓ మాజీ సభ్యుడు వెల్లడించారు. తమ హయాంలో రెవిన్యూ శాఖ 6 కోట్ల రూపాయల పెండింగ్ ఉండేదని, వాటిని చెల్లించాలని టీటీడీ బోర్డు లేఖ రాసినా రెవిన్యూ శాఖ నుంచి చలనం ఉండేది కాదన్నారు. రెవిన్యూ అధికారిని పిలిచి అడిగితే.. మాకు బడ్జెట్ ఎక్కడ ఉంటుంది సార్? మేం కూడా ప్రభుత్వానికి పంపించాం. రాగానే చెల్లిస్తామని చెప్పేవారని వివరించారు. అప్పుడే ఆరు కోట్ల రూపాయల పెండింగ్ ఉంటే, ఇప్పుడు ఇంకెంత ఉందో ఊహించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. బోర్డులో ఉండేది అధికార పార్టీ వారే కాబట్టి, ఈ విషయంలో వారు కూడా ప్రభుత్వంలో ఉన్నవారిని ఇబ్బందిపెట్టరని విశ్లేషించారు.
అంటే దీన్ని బట్టి టీటీడీ.. న్యాయవ్యవస్థ సహా వీఐపీలందరికీ ఉచిత సేవలు అందిస్తుందని స్పష్టమవుతోంది. భక్తుల సొమ్ముతో నడిచే టీటీడీ.. ఈ విధంగా మరొకరి సోకుకు ఉపయోగించడమంటే, తమ డబ్బు దుర్వినియోగం చేసినట్లేనని భక్తులు స్పష్టం చేస్తున్నారు.
ఎలాగూ రెవిన్యూ శాఖ టీటీడీకి రీఇంబర్స్‌మెంట్ చేయడం లేదు కాబట్టి.. ఆ విధానం ఎత్తేసి, తమ మాదిరిగానే డబ్బులు పెట్టి టికెట్లు కొని, గెస్టుహౌసులకు సైతం అప్పుడే డబ్బులు చెల్లించే విధానం ఎందుకు తీసుకురారు? వారికి ఈ మినహాయింపు ఎందుకు? దేవుడికి అంతా సమానమైనప్పుడు.. వీఐపీలకు మినహాయింపు-వెసులుబాటు ఎందుకన్నది భక్తుల ప్రశ్న.
అయితే.. న్యాయవ్యవస్థ సహా వీఐపీలకు ఇచ్చే గౌరవం, ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల బట్టి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. స్టేట్‌గెస్ట్‌లుగా గుర్తించిన వారికి ప్రభుత్వమే భోజన-వసతి-దర్శన సౌకర్యాలు కల్పిస్తుందని, న్యాయవ్యవస్థకు చెందిన చాలామంది డబ్బు చెల్లిస్తారని వివరించారు.
ఎవరి నుంచి డబ్బులు తీసుకోవాలి అనే అంశంపై, ప్రొటోకాల్ అధికారి స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. అయితే వారి వెంట వచ్చే పరివారం అనుమతి విషయంలో మాత్రం, సహజంగా చూసీచూడనట్లు వెళతారంటున్నారు. న్యాయవ్యవస్థ కాబట్టి.. ఆ గౌరవం-భయంతో గట్టిగా అడి గే సాహ సం చేయరని అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం.. స్టేట్‌గెస్ట్, ప్రొటోకాల్ ఉన్న వీఐపీల కుటుంబసభ్యులకు మాత్రమే పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఉచిత దర్శనం కల్పిసార్తు. వారి వెంట వచ్చే పీఏలు, ఇతర వ్యక్తిగత సిబ్బంది, గన్‌మెన్లు, బంధుమిత్రులకు మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. సహజంగా మంత్రులు తమ బంధుమిత్రులు, పరివారంతో తిరుమల వెళ్లినప్పుడు, ఆ ఏర్పాట్లన్నీ ఆ జిల్లాకు చెందిన ఆయా శాఖల అధికారులే చూసుకుంటారు కాబట్టి, మంత్రుల జేబుల నుంచి ఖర్చుండదు.
అయితే న్యాయవ్యవస్ధకు చెందిన వారితో వచ్చే పరివారానికి సైతం, ఉచిత సేవలు అందిస్తున్నారన్న విమర్శలపై దిద్దుబాటుకు దిగాల్సి ఉంది. అసలు న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులే ముందుకొచ్చి.. తమకు ఉచిత దర్శన-వసతి సౌకర్యాలు అవసరం లేదని, తాము డబ్బు చెల్లించే దర్శనం చేసుకుంటామని నిర్ణయం తీసుకుంటే, భ క్తులు హర్షిస్తారన్న సూచన వ్యక్తమవుతోంది.
గతంలో జేఈఓలు నాటి సీఎం జగన్ అవసరాల కోసం టీటీడీని, న్యాయవ్యవస్థ కోసం వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. న్యాయవ్యవస్థలోని ప్రముఖులకు దగ్గరుండి మరీ దర్శనాలు చేయించడం, వారికి ఖరీదైన కాటేజీలు కేటాయించడ ం, వారు సిఫార్సు చేసిన వారికి దర్శనాలు చేయించటం ద్వారా.. న్యాయవ్యవస్థలోని ప్రముఖులకు బాగా దగ్గరయ్యారన్న విమర్శ ఉండేది. ఆ కారణంతోనే న్యాయవ్యవస్థ సహా పీఎంఓ, కేంద్రమంత్రులు, వివిధ హోదాల్లోని ప్రముఖులకు వ్యక్తిగతంగా దగ్గరయ్యారన్న విమర్శలు తెలిసిందే.
జగన్ హయాంలో.. ఎంపి విజయసాయిరెడ్డి స్వయంగా కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖుల వద్దకు వెళ్లి టీటీడీ బోర్డు సభ్యులను సిఫార్సు చేయాలని కోరిన వైనం అప్పట్లో మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, వైసీపీ హయాంలో చైర్మన్లుగా పనిచేసిన కొందరు.. లడ్డూ ప్రసాదాలు, క్యాలెండర్లను భారీస్ధాయిలో ఢిల్లీకి తీసుకునివెళ్లేవారు. వాటిని ఢిల్లీలోని పీఎంఓ, కేంద్రమంత్రులు, న్యాయవ్యవస్థ, ఆదాయపన్నుశాఖ, ఈడీ, సీబీఐ, ఇతర పారిశ్రామికవేత్తలకు స్వయంగా వెళ్లి అందించి.. తిరుమల లడ్డును, తమ మార్కెటింగ్ కోసం వాడుకుంటున్నారంటూ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
చివరకు వీఐపీల ఇళ్ళలో జరిగే పెళ్లిళ్లకు టీడీపీ వేదపండితులను, విమానాల్లో పంపించేవారు. ఆ పరిచయాలు అడ్డుపెట్టుకుని, తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేవారు. అంటే వెంకన్నను అడ్డుపెట్టుకుని, తమను తాము మార్కెటింగ్ చేసుకుంటున్నారన్నమాట.
ఒకరకంగా ఒక సీఎం కంటే జేఈఓ పవర్‌ఫుల్ అన్న ప్రచారం చాలాకాలం నుంచి ఉన్నదే. ధర్మారెడ్డి ఏఈఓగా ఉన్నప్పుడు ఆయన చెప్పిందే శాసనంగా ఉండేది. సీనియర్ మంత్రులు సైతం ధర్మారెడ్డికి భయపడేవారు. జగన్ సైతం ఎవరినీ లెక్కచేయాల్సిన అవసరం లేదన్న స్పష్టమైన ఆదేశాలివ్వడమే దానికి కారణం. నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును గుంటూరు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తీసుకువెళుతున్న సందర్భంలో.. ఒక జేఈఓ సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి వర్గాలపై ఆయన బ్యాచ్‌మేట్ ద్వారా ప్రభావం చూపే ప్రయత్నం చేశారని, స్వయంగా రాజునే ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా జగన్ హయాంలో ఒక జడ్జి ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరైన టీటీడీ ప్రముఖులు, వైసీపీ ఎంపి ఆయనకు 2 కోట్ల రూపాయల ఖరీదైన డైమండ్ వాచీ బహుమతిగా ఇచ్చేందుకు ప్రయత్నించగా.. అందుకాయన నిరాకరించి.. వారిని మందలించారన్న వార్తలు అప్పట్లో మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.
అంటే దీన్నిబట్టి న్యాయవ్యవస్థలోని ప్రముఖులను ప్రసన్నం చేసుకునేందుకే.. అధికారులు తిరుమల వచ్చినప్పుడు, వారిపట్ల వినయవిధేయతలు ప్రదర్శిస్తారని స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేకపోతే టీటీడీ ప్రముఖులను న్యాయవ్యవస్థ ప్రముఖులు, తమ ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు ఎందుకు పిలుస్తారు? అన్న ప్రశ్నలు భక్తకోటి నుంచి వినిపిస్తున్నాయి.
దటీజ్.. కలిదిండి!
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు శాఖ మంత్రితోపాటు, టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన కలిదిండి రామచంద్రరాజు గొప్పతనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిందే. రాజకీయాల్లో అజాతశత్రువు, వివాదరహితుడు, అత్యంత నిజాయితీపరుడిగా పేరున్న కలిదిండి మంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు.. టికెట్లు, వసతి, భోజనానికి తన సొంత డబ్బు చెల్లించేవారు. నిజానికి మంత్రిగా ఆయనకు, కుటుంబానికి ప్రొటోకాల్ ఉన్నప్పటికీ రాజుగారు ఏనాడూ వాటిని వాడుకున్న దాఖలాలు లేవు.
పర్యటనలలో చివరకు ఆయన వెంట వచ్చే పీఎస్, గన్‌మెన్లు, కాన్వాయ్ సిబ్బందికి సైతం, ఆయనే తన సొంత డబ్బు చెల్లించేవారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, తొలిసారి మంత్రి హోదాలో తిరుమల వెళ్లినప్పుడు టీటీడీ అధికారులు శాలువా, పూలదండ, ప్రసాదంతో సత్కరించారు. వెంటనే ఆయన అప్పట్లో తన పీఎస్‌గా పనిచేసిన సుబ్బరాజును పిలిచి, జేబు నుంచి నోట్ల కట్ట ఇచ్చి వాటిని హుండీలో వేసిరమ్మని ఆదేశించారు.
‘ఇదంతా భక్తులు స్వామివారిపై భక్తితో-నమ్మకంతో ఇచ్చిన డబ్బులతో చేస్తున్న ఖర్చులు. కాబట్టి స్వామివారి నుంచి మనం ఐదుపైసలు కూడా ఉచితంగా తీసుకోవద్దు.ఇదంతా ఆయన డబ్బే. మనం ఆయన డబ్బును ఆయనకే ఇస్తున్నాం’ అని అధికారులతో వ్యాఖ్యానించారు. ఆ విధంగా తనకు ప్రొటోకాల్ ఉన్నప్పటికీ, దానిని వినియోగించుకోకుండా, దర్శనం టికెట్లు-వసతికి సొంత డబ్బు చెల్లించే కలిదిండి రాజుగారి లాంటి నిజమైన భక్తులు ఈరోజు ఎందరున్నారు? డాబు-దర్పం అధికార హోదాలను అడ్డుపెట్టుకుని.. ఉచిత దర్శనాలను ప్రతిష్ఠగా భావించే ఈరోజుల్లో, కలిదిండి వంటి మహోన్నతులు కనిపిస్తారనుకోవడం అత్యాశ అవుతుందేమో?!