– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ
విజయవాడ: లిక్కర్ స్కాం లో సిట్ విచారణ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుంది.. ఎంతసేపు డిస్టిలరీ ల చుట్టే విచారణ సాగుతుంది.. లిక్కర్ స్కాం వెనుక కమీషన్లు మాత్రమే చూపుతున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే..
కమీషన్ల కోసం డిస్ట్రిలరీలను బెదిరించారని చెప్తున్నారు.. డెన్ లు ఉన్నాయని, కిక్ బ్యాగ్స్ అందాయని, నెలకు 50 నుంచి 60 కోట్లు ముడుపులు అందాయని అంటున్నారు. లిక్కర్ స్కాం ఇంతకే పరిమితం కాదు. లిక్కర్ స్కాం లో 3500 కోట్లు మాత్రమే కాదు. డిస్టిలరిల దగ్గర నుంచి కన్జ్యుమర్ వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణం మే. లిక్కర్ స్కాంలో ప్రపంచంలో ఎక్కడ లేని అవినీతి జరిగింది.
డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. డిజిటల్ పేమెంట్స్ ఉండాలని చెప్పే ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం బహుశా ఎక్కడా జరగలేదు. ఏపీ లిక్కర్ స్కాం ఆర్థిక నేరం. ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేసింది అనధికార అమ్మకాల కోసమే.. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను భారీగా అమ్మారు. అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ స్కాం మీద శ్వేతపత్రం ఇచ్చారు. లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్స్ కేవలం 600 కోట్లు వచ్చాయన్నారు.
99 వేల కోట్లు ఎక్కడ పోయాయో తెలియదు అన్నారు. ఒక్క శాతం కూడా లిక్కర్ సొమ్ము ప్రభుత్వానికి రాలేదు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఆరోపణలో విచారణ జరపాల్సి ఉంది. లక్ష కోట్ల లిక్కర్ స్కాం పై నిజాలు నిగ్గు తేల్చాలి. వైసీపీ హయంలో ట్రస్టెడ్ లిక్కర్ అమ్మలేదు. హానికరమైన మద్యాన్ని అమ్మారు. హానికర మద్యాన్ని ప్రోత్సహించారు. అటువంటి కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చాయని కూటమి ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో హానికరమైన మద్యాన్ని తాగి 30 వేల మంది వరకు చనిపోయారని చెప్పారు. లక్షల మందికి నరాల బలహీనత సమస్యలు వచ్చాయని మీరు నియమించిన కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయి. ఈ అంశంపై కూడా దర్యాప్తు జరగాలి.
క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మకాలు చేశారో విచారణ జరగాలి. ట్రస్టెడ్ కంపెనీ ల లిక్కర్ ను ఎందుకు నిషేధించారో విచారణ జరగాలి. లిక్కర్ విచారణ సందర్భంగా జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. ట్రస్టెడ్ లిక్కర్ కాకుండా..లో గ్రేడ్ లిక్కర్ ను ఎందుకు అనుమతించారు ?
డిజిటల్ పద్ధతిలో కాకుండా ఓన్లీ క్యాష్ ఎందుకు అమ్మారు?. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎందుకు అమ్మారు? జగన్ కి అవసరం అయిన వాటిని మాత్రమే సమాధానం చెప్తారు. ఆయనకు హాని అనుకున్నవి మాత్రం నోరు విప్పరు. రుషికొండ ను ఎందుకు కోరిగారు చెప్పలేదు? వివేకా హత్య విషయంలో సాక్షి గుండెపోటు అని చెప్తే దానికి సమాధానం చెప్పలేదు. రక్తపు మడుగులో వివేక హత్య జరిగితే హార్ట్ ఎటాక్ అని కథలు అల్లారు. జలయజ్ఞం ప్రాజెక్ట్ లు ఎందుకు పూర్తి చేయలేదు అంటే సమాధానం చెప్పలేదు.
గంగవరం పోర్ట్ ను అదానీ కి అప్పజెప్తే ఎందుకు…చేశారు అంటే సమాధానం లేదు. పోలవరం ఎత్తు తగ్గించిన పాపం జగన్ ది అంటే…దానికి సమాధానం లేదు. సమాధానం చెప్పాల్సిన పాయింట్ ను పక్కన పెట్టీ చుట్టూ ఉన్న అంశాలు మాట్లాడటం జగన్ కి అలవాటు. జగన్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. విచారణను బట్టి ఏం నిర్ణయం తీసుకుంటున్నారో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కి బి టీమ్ అవ్వాల్సిన అవసరం లేదు
జగన్ మోహన్ రెడ్డి మాత్రమే బీజేపీ కి బి టీమ్.. దత్తపుత్రుడు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీ కి జగన్ దత్తపుత్రుడు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైసీపీ ఎంపీలు ఈనాటికి మోడీకి మద్దతు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి తొత్తులు.