– సర్కారును నిలదీసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలన తర్వాత తనను తాను సమీక్షించుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలా పనులు, ప్రజలకు ప్రామిస్ చేసిన ఎన్నికల హామీల గురించి మాట్లాడేందుకు ధైర్యం లేక ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేసేందుకు రోజుకో కొత్త పేరు, కొత్త కథతో వస్తోందని మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎమర్జెన్సీ వచ్చి 50 ఏళ్ళు పూర్తయిందని చెప్పి జూన్ 25వ తారీఖుకి ఈ దేశమంతా ఎమర్జెన్సీని గుర్తు చేసుకొని, భారత రాజ్యాంగాన్ని కాలరాసిన చీకటి రోజులని గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకి తెలియజేసే కార్యక్రమాలు నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇంగిత జ్ఞానం పక్కన పెట్టి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లను ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చిన ఇందిరమ్మ క్యాంటీన్ పేరుగా మార్చడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యాన్ని, దిగజారుడుతనాన్ని తెలుపుతోందని దుయ్యబట్టారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే…
ఐదు రూపాయలకు అన్నం అన్నపూర్ణ పథకానికి ఇప్పుడు పేరు మార్చి ఇందిరమ్మ పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడూ పథకాలకి వ్యక్తుల పేర్లు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రతిదానికీ ఇందిరమ్మ పేరు పెడుతోంది. ఆ పేరు చెబితే చీకటి రోజులు గుర్తొస్తాయని కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసి లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. మంచి నీళ్లు సరిగ్గా రావడం లేదు. డ్రైనేజీలు సరిగా లేవు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో అక్రమ కట్టడాలు నడుస్తున్నాయి. రేషన్ కార్డులు లేవు, కొత్త పెన్షన్ లేవు. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. మహిళలకు స్కూటీ లేదు, మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఆర్థిక సాయం అందలేదు, నిరుద్యోగులకు రూ.4,000 రావడం లేదు.
బస్తీల్లో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తోంది. మేయర్ స్ట్రీట్ లైట్లపై స్పందించాలి. వీధి కుక్కలు పిల్లల మీద దాడి చేస్తూ చంపేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కాలనీల్లో మురుగు నీళ్లు వస్తున్నాయి. అన్నపూర్ణ క్యాంటీన్‌కి ఇందిరమ్మ క్యాంటీన్ పేరు పెట్టినంత మాత్రాన జిహెచ్ఎంసికి ఏ ఫలితం లేదు. పథకాల పేర్లు మార్చడం మానేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ప్రచార ఆర్భాటాలు తగ్గించండి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి. ఇందిరమ్మ ఇళ్ల సెలెక్షన్ అనీ పెట్టారు. ఎంపీడీఓలకు లిస్ట్ పంపారు. ఏ ఊరికి వెళ్లినా అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఓ మీటింగ్ పెడదాం. ఇంటి లేని వాళ్లకి ఇళ్లు వచ్చాయా? కాంగ్రెస్ వాళ్లకే వచ్చాయా? అనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఒక్క ఊరిని శాంపుల్ గా చెక్ చేయండి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు అయినా వెళ్లండి. ఒక ఊరికి వెళ్లి క్షీరాభిషేకం కాకుండా క్షేత్ర పరిశీలన చేసి, నిజంగా ఇళ్లు అర్హులకే వచ్చాయా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఇదే మీ పని తీర్పుకు దర్పణం. కనీసం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. కోర్టులు చెప్పినా కూడా మీరు ఎన్నికలు పెట్టలేకపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ ఉంటే ప్రతి పథకానికి ‘ఇందిరమ్మ’ అని పేరు పెట్టి ప్రజల మీద ఎమర్జెన్సీలా బలవంతపు సంస్కరణలను రుద్దే కార్యక్రమాలు చేయొద్దని హితవు చెబుతున్నాం.
రోజు దినపత్రికల ఫ్రంట్ పేజీల కోసం, ఫ్రంట్‌లైన్ వార్తల కోసం పనిచేస్తోంది ఈ ప్రభుత్వం తప్ప, మరేంలేదు. గ్రౌండ్ రియాలిటీ లో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమవుతోంది. దానికి సజీవ తార్కాణం టెలిఫోన్ ట్యాపింగ్ పంచాయితీ. 18 నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారంలో సిట్ వేసి, దానిపై విచారణ నడిపిస్తున్నామంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలైందీ దుబ్బాకలో ఉపఎన్నిక సమయంలో.. అప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటున్నారని నేను అప్పటి డీజీపీకి కంప్లైంట్లు పెట్టాను. కాని స్పందన లేదు.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి సిట్ నోటీసులు పంపిస్తుంది. గాంధీ భవన్‌లో పని చేసేవారికి ఇస్తుంది. వాళ్లందరినీ విచారిస్తున్నామంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై అప్పటి డీజీపీకి పది సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఎన్నికల సమయంలో, గెలిచిన తర్వాత కూడా ఇచ్చాను. కానీ ఆ ఉత్తరాలు సిట్‌కి చేరలేవు. అప్పుడు ఉన్న డీజీ, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీలను పిలిచారు. ప్రభాకర్ రావును పట్టుకొచ్చినట్టు చెప్పి మిగతా వారిని పట్టుకుంటామని చెబుతున్నారు తప్పితే విచారణ పూర్తి చేసింది లేదు. విచారణ పేరిట టైం పాస్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పెద్దలకి నిజాయితీ ఉందా? సంబంధం లేని కాంగ్రెస్ నాయకుల్ని పిలుస్తున్నారు. 2020 నవంబర్‌లో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఆ ఎన్నికల్లో మా మీద 24 కేసులు పెట్టారు. బీఆర్ఎస్ వాళ్లు మమ్మల్ని టార్గెట్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను. కానీ నన్ను వదిలేసి, పీసీసీ ప్రెసిడెంట్‌ను పిలుస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నది “కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్” అనే పంచాయితీ చేయడమేనా? ఇదేనా సిట్ చేస్తున్న విచారణ? ఇక్కడే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదని. ఈ ప్రభుత్వానికి తప్పు చేసినవారిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు న్యాయం చేయలేదు, ఇప్పుడు కవిత బీసీ ఉద్యమాన్ని నడపిస్తామంటే ప్రజలు నమ్మరు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు క్షమాపణ చెప్పాలి.