Suryaa.co.in

Andhra Pradesh

బిడ్డింగ్‌ ద్వారా వచ్చే ఉక్కు తీసుకెళ్లి వాళ్లేమి చేసుకుంటారో?

-విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై బీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటి?
-ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారా? లేక సమర్థిస్తున్నారా?
-వ్యతిరేకిస్తే బిడ్స్‌లో ఎలా పాల్గొంటారు?
-కేటీఆర్‌ మాటలతో ప్రభుత్వంపై విపక్షాల బురద
-అంతులేని విమర్శలు. విపరీతంగా దుష్ప్రచారం
-బీఆర్‌ఎస్‌ ఆనాడు పోరాడతాం అంటే స్వాగతించాం
-కేటీఆర్‌ కూడా జగన్‌ చెప్పిందే చెప్పారు
-విశాఖ ఉక్కుపై బాధ్యతారహితంగా మాట్లాడం సబబేనా?
-మాట్లాడే రాజకీయ పార్టీలకు కనీస అవగాహన ఉండాలి
-ఏది చేసినా కన్విన్స్‌గా చేయాలే తప్ప , శంఖం పూరించి యుద్ధం చేస్తామంటే అయ్యేది కాదు
-పోరాడితే పోయేదేమీ లేదు అనడానికి ఇదేమీ యూనియన్‌ కాదు.-
-విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం వైయస్‌ జగన్‌కు ఒకే వైఖరి
-అందరి కంటే మందు ఆయనే స్పందించారు
-నిర్మాణాత్మక ప్రతిపాదనలతో ముందుకొచ్చారు
-విశాఖ స్టీల్స్‌ విషయంలో జగన్‌దే సరైన విధానం
-ప్రైవేటీకరణ ఛాంపియన్‌ చంద్రబాబనాయుడే
-ఆయన హయాంలో ఎన్నో సంస్థల మూసివేత. విక్రయం
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

ముందుగా స్పందించింది జగన్‌ :
విశాఖ స్టీల్‌ కంపెనీ ప్రైవేటీకరణ యత్నాలపై అందరి కంటే ముందుగా నిర్మాణాత్మకంగా స్పదించింది సీఎం అందుకే విశాఖ ఉక్కుపై మాట్లాడే రాజకీయ పార్టీలకు కనీస స్పష్టత ఉండాలి. కేంద్రం దీనిలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దానిపై కార్మిక, ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అయితే అందరి కంటే మందుగానే ఒక నిర్మాణాత్మక ప్రతిపాదనతో స్పందించింది సీఎం వైయస్‌ జగన్‌. నిజానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాటల్లో కూడా జగన్‌ విధానమే వినిపించింది. విశాఖ స్టీల్‌ కంపెనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది మన రాష్ట్రంలో ఉంది కాబట్టి, ఇక్కడి ప్రయోజనాలు కాపాడుతూ, విశాఖ స్టీల్స్‌ను ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్మాణాత్మక ప్రతిపాదన చేసింది. కార్మికులను కలిసినప్పుడు కూడా సీఎం తన విధానాన్ని స్పష్టంగా చెప్పారు. అలాగే ఢిల్లీ వెళ్లినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు అక్కడి పెద్దలతోనూ ప్రస్తావించారు. విశాఖ స్టీల్స్‌ను నిలబెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని జగన్‌ స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా క్యాప్టివ్‌ మైన్స్‌ కేటాయిస్తే ప్రైవేటీకరణ చేయకుండా ఉండొచ్చని కూడా చెప్పారు. సరిగ్గా నిన్న కేటీఆర్‌ చెప్పింది కూడా అదే.

జగన్‌ దే సరైన విధానం:
బీఆర్‌ఎస్‌ ఆనాడు తాము వైజాగ్‌ స్టీల్స్‌ గురించి పోరాడతాం అంటే మేం కూడా స్వాగతించాం. వడ్డీ ఎక్కువ ఉన్న అప్పులను రీస్ట్రక్చర్‌ చేసి క్యాపిటల్‌లో పార్ట్‌గా చేయాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు
దాదాపు 7 వేల ఎకరాల విలువైన భూమి ఉంది..దాన్ని అమ్మి వచ్చిన సొమ్మును విశాఖ స్టీల్స్‌ను ముందుకు తీసుకెళ్లేలా చేయాలని సిఎం చెప్పారు. విశాఖ స్టీల్స్‌ విషయంలో జగన్‌ చెప్పిందే సరైన విధానం. ఇదే పని చంద్రబాబునాయుడు చేసినా, ఇంకెవరు చేసినా స్వాగతించాల్సిందే. వైజాగ్‌ స్టీల్‌ అనేది సెంటిమెంట్‌గా చరిత్రలో తెరమరుగు కాకూడదు అనుకునే అందరికి నచ్చే ప్రపోజల్‌ ఇది.

ప్రభుత్వంపై బురద:
తెలంగాణా ప్రభుత్వం సింగరేణి ద్వారా టెండర్ల ప్రక్రియలో పాల్గొనబోతుంది అని పత్రికల్లో వచ్చినట్లుంది. దాని మీద ఏపీలో ప్రతిపక్షాలనబడే శక్తులు, జగన్‌ కి వ్యతిరేకంగా ఏకమై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్మోహన్‌రెడ్డి సంక్షేమబాటను ఎదుర్కోలేక, వామపక్షాలతో సహా అన్ని పక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చినట్లు లేదు. కేటీఆర్‌ మాటల్లో మాత్రమే చెప్పినట్లున్నారు. జగన్‌ ని పక్కకు తప్పించి చంద్రబాబును అర్జంటుగా సిఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే రామోజీ పత్రిక, రాధాకృష్ణ, ఇతర పచ్చ మీడియా కథనాలు రాస్తున్నాయి. వాళ్ల కంటే పైత్యం ఎక్కవైంది అనుకుంటే, వారికి తోడు సీపీఐ, సీపీఎం వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. ఒక సీరియస్‌ అంశాన్ని ఇంత నాన్‌ సీరియస్‌గా తీసుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు సరైందేనా అని ప్రశ్నిస్తున్నా. వైజాగ్‌ స్టీల్స్‌ అనేది తెలుగు ప్రజలు, ఏపీకి సంబంధించినంత వరకూ చరిత్రతో ముడిపడి ఉంది..ఒక సెంటిమెంట్‌ కూడా. ఆంధ్రప్రదేశ్‌ అంటే వైజాగ్‌ స్టీల్‌ అనేంతగా దానికి చరిత్ర ఉంది

దాన్ని వాళ్లేం చేసుకుంటారో?:
ఇప్పుడు జరుగుతోంది చాలా విచిత్రంగా ఉంది. టెండర్లో ఏం ఉందో కూడా చూడటం లేదు. ఐరన్‌ ఓర్‌ లాంటి ముడిసరుకు ఇచ్చే వారుంటే స్టీల్‌ ప్లాంటులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలా పెట్టుబడులు పెట్టిన వారు ప్లాంటులో ఉత్పత్తి చేసే ఉక్కును తీసుకుని మార్కెట్‌ చేసుకోవాలి అని టెండర్లో ఉంది. లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ పెట్టినా సరే, ఉక్కును తీసుకుని అమ్ముకోండి అని కేంద్రం పిలిచిన దాంట్లో ఉంది.
దీంట్లో పాల్గొనే వారు తప్పనిసరిగా స్టీల్‌కానీ, స్టీల్‌ మేకింగ్‌ రామెటీరియల్స్‌ రంగంలో ఉన్నవారై ఉండాలని చెప్పారు. కేంద్రం స్టీల్‌ ప్లాంటులో ఖర్చు తగ్గించుకోవచ్చనే ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈరోజు కేటీఆర్‌ చాలా జాగ్రత్తగా అచితూచి మాట్లాడినట్లున్నాడు. అగ్రెసివ్‌గా మేం విశాఖ స్టీల్స్‌ తీసుకుంటాం అన్నట్లు లేదు. బహుశా సింగరేణి పోతోందని అలా అన్నారో ఏమో తెలియదు. వీళ్లిచ్చిన స్టీల్‌ ప్రొడక్ట్‌ తీసుకెళ్లి వాళ్లేమి చేసుకుంటారో కూడా తెలియదు.

టెండర్లో ఏముందో కూడా చూడరా?:
44 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక అంశంపై రియాక్ట్‌ అయ్యేటప్పుడు దాంట్లో ఏముందో చూసుకోవద్దా..? తెలంగాణా ప్రభుత్వం దీంట్లో పాల్గొనే అవకాశం ఉందా..? ఒక వేళ చేస్తే ప్రభుత్వం కిందా..? ప్రైవేటుగానా..? అక్కడ ఇబ్బంది పెట్టడానికి వెళ్తున్నారా..? ఉద్యోగుల కుటుంబాలను కాపాడటానికి వెళుతున్నారా…? అన్నింటికి మించి టెండర్లో ఉన్న నిబంధనలు ఏమిటినేది కూడా చూడరా..? చివరికి కార్మికుల శ్రేయస్సు కోరుకునే వాళ్లయితే సీపీఐ, సీపీఎం వాళ్లయిన వివరాలు తెలుసుకోవాల్సింది. వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సమస్య వస్తే ఎలా వ్యవహరిస్తారో చూసుకోవాలి. జగన్‌ ప్రతిపాదించిన ప్రకారం సమాజానికి భారం లేకుండా చేయాలి.. దానికి జగన్మోహన్‌రెడ్డి అందరికంటే ముందుంటారు..ఆ విషయంలో మేం ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్నాం

పనికి మాలిన అస్త్రాలెందుకు రామోజీ..?:
టెండర్‌ చూసిన తర్వాత అర్ధం చేసుకోవాల్సింది ఇది చాలా పరిమితమైనదనే. కానీ ఈరోజు ఈనాడులో బ్యానర్‌ చూస్తే ఎవరికైనా గుండెలు పగులుతాయి. మొన్న ఎప్పుడో చూస్తే రామోజీ సీఐడీ వాళ్లు వెళితే బెడ్‌ మీద పడుకున్నట్లన్నారు. ఈ వయసులో ఇలాంటి దిక్కుమాలిన, పనికి మాలిన అస్త్రాలు ఎందుకు వేస్తున్నాడో అర్ధం కావడం లేదు. చంద్రబాబు కోరుకున్నట్లుగా రేపో ఎల్లుండో ఎన్నికలు తీసుకు రావాలి, అర్జంటుగా కంకణం కట్టుకుని చంద్రబాబును గద్దెనెక్కించాలనేదే రామోజీ స్టోరీల్లో కనిపిస్తోంది.

ప్రైవేటీకరణకు ఛాంపియన్‌ చంద్రబాబే:
వీళ్లంతా ప్రైవేటీకరణ మీద ఇంతగా మాట్లాడుతున్నారు…అసలు ప్రైవేటీకరణ ఛాంపియన్‌ ఎవరు..? దీనిపై గోల్డ్‌ మెడల్‌ లాంటిది ఇవ్వాలంటే మొదటిగా విన్పించే పేరు చంద్రబాబునాయుడుదే
1999లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పనికట్టుకుని పెట్టబడుల ఉపసంహరణ కోసం ఇంప్లిమెంటేషన్‌ సెక్రటేరియట్‌ పెట్టాడు. ఆయన మనసుకు అద్దం పట్టేలా ప్రైవేటైజేషన్, ఏ సక్సెస్‌ స్టోరీ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే గ్రంథం రాశాడు. దానిలో ఆయన భుజం ఆయన చరుచుకుని ప్రపంచ బ్యాంకుకు అనుగుణంగా ఏం చేస్తున్నాడో, యూఎస్‌బాటలో ఎలా వెళ్తున్నాడో చెప్తూ తయారు చేసిన డాక్యుమెంట్‌ అది. ఆయన్ని ఆయన పొగుడుకుంటూ ఒక విజనరీగా చెప్పుకుంటూ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రిఫార్మ్స్‌–అచీవ్‌మెంట్స్‌ 1999–2004 అనే లిస్టు కూడా ప్రకటించాడు. 2004లో కూడా తానే వస్తాను అనుకున్నట్లున్నాడు. ఫేజ్‌ 2 కింద 2003–2006 వరకూ అంటూ మరొక లిస్టు కూడా పెట్టుకున్నాడు.

అవి ఎవరికి కట్టబెట్టారో అందరికీ తెలుసు:
రాష్ట్రం అదృష్టం, ఉద్యోగుల అదృష్టం రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన క్లోజ్‌ చేస్తున్న సంస్థలను కూడా నిలబెట్టాలని ప్రయత్నం చేశారు. సంస్కరణలని ముద్దుపేరు పెట్టుకుని 54 సంస్థలను టార్గెట్‌ పెట్టుకుని 22 సంస్థలను మూసివేశాడు…11 సంస్థలని ప్రైవేటైజ్‌ చేశాడు. అలా మూసివేసిన విలువైన స్పిన్నింగ్‌ మిల్లులు, కో ఆపరేటివ సుగర్స్‌ మిల్లులు.. వాటి భూములు ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు. ఆర్టీసీని చంద్రబాబు ప్రైవేటీకరణ చేయాలంటే జగన్‌ ప్రభుత్వంలో విలీనం చేశారు. చంద్రబాబు అడ్డగోలుగా ప్రైవేటైజ్‌ చేసి మూసేయాలని అనుకున్న ఆర్టీసీని భారమైనా ప్రభుత్వంలో కలిపిన వ్యక్తి వైఎస్‌ జగన్‌.

కమ్యూనిస్టులకు ఏమైంది?:
నేను చంద్రబాబును ఏమీ అనను…కమ్యూనిస్టులకు ఏమైంది..?
రాజకీయంగా పొత్తుల కోసం ఒక సీటు ఇస్తాడని మీరు అలా ఆయనకు ఊడిగం చేయడం సబబు కాదు. పొత్తుల విషయంలో చంద్రబాబు మీకు ఏమాత్రం విలువ ఇచ్చాడో కూడా మీకే తెలుసు. కమ్యునిస్టులు అర్జంటుగా చంద్రబాబును తీసుకురావాలని ఎందుకు కంకణం కట్టుకున్నారు..?

ఆనాడెందుకు మౌనం?:
రామోజీ, కమ్యూనిస్టులు…ఆరోజు చంద్రబాబు సంస్థలను అడ్డంగా మూసేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు. ఈ రోజు ఏమీ లేకముందే…మన రాష్ట్రానిది కాకపోయినా విశాఖ స్టీల్స్‌ విషయంలో ఎందుకు ఇంత యాగీ చేస్తున్నారు.? కేంద్ర ప్రభుత్వంలో మనకు కూడా వాటా ఉంది. వారి చేతిలో ఐరన్‌ ఓర్‌ గనులున్నాయి…వాటిని క్యాప్టివ్‌ మైన్స్‌గా పెట్టే అవకాశం ఉంది. బ్యాంకుల్లో అప్పులను రీస్ట్రక్చర్‌ చేయించే అవకాశాలు ఉన్నాయి. వీళ్లు తీసుకోబోతున్న ఒక నిర్ణయాన్ని ఆపాలనంటే కన్విన్స్‌ చేసి మీకు మంచి పేరు వస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.

ఆ సౌండ్‌ తట్టుకోలేకపోతున్నారు:
జగనన్నే మా భవిష్యత్తు రీసౌండ్‌ను వారు తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్షాలుగా మీరు చేస్తున్నది బాధ్యతారాహిత్యం తప్ప వేరేది కాదు. వీటన్నిటి వెనుక అధికారానికి దూరం అయ్యామనే దుగ్ధ కన్పిస్తోంది. జగన్‌ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల తమకు పుట్టగతులు ఉండవనే బాధ వారిలో కన్పిస్తోంది. మేం మొదలు పెట్టిన జగనన్నే మా నమ్మకం, మా భవిష్యత్తు అనే కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి స్పందన చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో నుంచి పాజిటివ్‌గా వస్తున్న రీసౌండింగ్‌ చూసి తట్టుకోలేకపోతున్నారు. రోజూ ఎక్కడో ఒక చోట ఏదో చేయిస్తున్నారు. పక్క రాష్ట్రాల వ్యవహారాలను తీసుకొచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు. వాళ్లేదో వాళ్ల రాజకీయ ప్రయోజనాలకో అక్కడ మాట్లాడితే , దాన్ని తీసుకొచ్చి ఈ సీరియస్‌ ఇష్యూకి ముడిపెడుతున్నారు. ఇందులో వారి సంకుచిత, స్వార్ధ ప్రయోజనాలను గుర్తించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రయత్నిస్తూనే ఉన్నాం:
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం మేము ప్రధాని మోదీని అడగడం లేదని ఎవరు చెప్పారు..? అడుగుతూనే ఉన్నాం..అన్ని స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది చేసినా కన్విన్స్‌గా చేయాలే తప్ప , శంఖం పూరించి యుద్ధం చేస్తామంటే అయ్యేది కాదు. ఎవర్నో మభ్యపెట్టడానికో అలాంటి మాటలు ఉపయోగపడొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అవి ఉపయోగ పడతాయని మా నాయకుడు విశ్వసించడం లేదు. పోరాడితే పోయేదేమీ లేదు అనడానికి ఇదేమీ యూనియన్‌ కాదు.

నిర్మాణాత్మక ప్రయత్నాలు:
నిర్మాణాత్మక ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్‌రెడ్డి గారు అలాంటి నిర్మాణాత్మక విధానంలోనే వెళ్తున్నారు. దాన్ని అమలు చేస్తే వచ్చే మంచిని కూడా కేంద్రానికి చెప్తున్నాం..
రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్లు కూడా ఆ పని చేయాలి. బీజేపీలో ఉన్న టీడీపీ స్లీపర్‌ సెల్స్‌ కూడా కేంద్రాన్ని ఇంప్రెస్‌ చేసే పని చేయాలి. టీడీపీ అడిగినా, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అడిగినా మరీ మంచిది..ఎంత మంది అడిగితే అంత మంచిది. అది జస్ట్‌ స్టీల్‌ ప్లాంట్‌ కాదు..ఏపీ చరిత్రతో, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సంస్థ.

అందుకే టెండర్లు కావొచ్చు:
కేంద్రం పూర్తిగా అమ్మేస్తాం అనడం లేదు. బహుశా వర్కింగ్‌ క్యాపిటల్‌లో పార్ట్‌ తీసుకోమంటున్నారు. బహుశా వడ్డీ ఖర్చు తగ్గించుకోడానికి అయి ఉంటుంది. అలా పెట్టుబడి పెట్టిన వారు చెల్లింపులకు సరుకు తీసుకెళ్లమంటున్నారు. డబ్బు ఇవ్వడం కాదు. అప్పు భారం, రా మెటీరియల్‌ కాస్ట్‌ తగ్గించుకోడానికి ఈరోజు టెండర్లు పిలిచినట్లుంది.

జగన్‌ కూడా అదే చెప్పారు:
జగన్మోహన్‌రెడ్డి కూడా ఆరోజు చెప్పింది అదే చెప్పారు. లోన్లు క్యాపిటలైజ్‌ చేయడం, అప్పు తగ్గించుకోవడం, క్యాప్టివ్‌ మైన్స్‌ ఇవ్వడం వంటి చర్యల ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడమే ముఖ్యం. ఇందులో తెలంగాణా ప్రభుత్వం ఏమి ప్రతిపాదన చేసిందో తెలియదు. వర్కింగ్‌ క్యాపిటల్‌ అయితే పెట్టొచ్చు. కానీ స్టీల్‌ తీసుకెళ్లలేరు కదా? బహుశా స్టీల్‌ బిజినెస్‌ పెడతారేమో…?

తెలంగాణా వేస్తోంది కాబట్టి మీరూ బిడ్‌ వేయండి అంటున్నారు
ఎక్కడికి వెళ్లి ఏం వేయాలి..వాళ్లిచ్చే స్టీల్‌ తీసుకొచ్చుకుని ఏం చేయాలి..?
వాళ్లు సింగరేణి ద్వారా వెళ్తున్నారా అనేది నాకు తెలియదు. వీళ్లు రాసిన స్టోరీల్లో రాశారు కానీ వాళ్లు అలా అని చెప్పారా..? సింగరేణి కోల్‌ అయితే స్టీల్‌ ప్లాంటుకు పనికొచ్చేది కాదు..బహుశా ఇక్కడ ఇన్వెస్ట్‌ చేసి స్టీల్‌ తీసుకంటారేమో?. వారి స్టేట్‌మెంట్‌ను చూడాల్సిన బాధ్యత, అవసరం మాకు లేదు. అది తెలంగాణాలో రాజకీయ పార్టీ. వారి ఇంటెన్షన్స్‌ ఏమిటో వారే చెప్పాలి. మాకు తెలిసి ఇక్కడి శక్తుల వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు చూపడమే మా ప్రయత్నం.

ఆనాడు వీళ్లంతా ఏం చేశారు..?
పోరాటం అంటే ఏ రూపంలో చేయాలి? రకరకాలుగా పోరాటాలు రూపాలు మారాయి. అడిగే వాళ్లంతా ఆనాడు చంద్రబాబు సంస్థలన్నిటినీ మూసేస్తుంటే ఏం పోరాటాలు చేశారు?. ప్రపంచీకరణ అనే కాన్సెప్ట్‌ వచ్చిన తర్వాత వీళ్లంతా ఏం చేశారు? ఉన్న వనరులను వాడుకుంటూ, ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఒక సంక్షేమ ప్రభుత్వం చేయగలిగింది చేయాలి. దానిలో ఆనాడు రాజశేఖరరెడ్డి, నేడు జగన్మోహన్‌రెడ్డిగారు మిగిలిన వారికి మార్గదర్శిగా నిలబడుతున్నారు.
ఇదే రియాలిటీ…దాన్ని వదిలేసి నేలవిడిచి సాములా కలలు కంటే కుదరదు.

జట్టు కట్టి ఒక్కటే మాట:
కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుతుండగానే కాలం మారిపోతోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో కూడా అధికారంలోంచి పక్కకు రావాల్సి వచ్చింది. కమ్యూనిస్టులు ఎక్కడో ఏదో మిస్‌ అవుతున్నారు. ఎవరైతే ప్రైవేటీకరణకు ఛాంపియనో అలాంటి చంద్రబాబుతో జట్టుకట్టి వీరంతా మాట్లాడుతున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే చంద్రబాబుతో జతకలిసి చిలకపలుకులు పలుకుతున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్స్‌ విషయంలో ఏ అవకాశం వచ్చినా మేం ప్రస్తావిస్తూనే ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

LEAVE A RESPONSE