– విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలి
– శ్రీవారి భక్తులను రాజకీయానికి వాడుకునే నీచస్థితికి దగజారిన టిడిపి
-ఏపీకి 16 కేంద్ర అవార్డులు
-బీసీలకు రాజ్యాధికారం సీఎం జగన్ తోనే సాధ్యం
-జగన్ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
పదవి పోయినప్పుడల్లా చంద్రబాబుకి “చారిత్రక అవసరం” గుర్తుకొస్తుంటుందని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నప్పుడు ఇలాగే సమర్థించుకున్నాడని ఇప్పుడు 2024లో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమంటూ పాట పాడుతున్నాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇదే పాట పాడిన చంద్రబాబుకి అక్కడి ప్రజలు తమ ఓటుతో గుణపాఠం చెప్పారని, 2024 లోనూ అదే తీర్పు రాష్ట్రంలో పునరావృతమవుతుందని అన్నారు.
ప్రజలకు అంతా తెలుసని, చంద్రబాబుది ఏ అవసరమో వారు తప్పక నిర్ణయిస్తారని అన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆకస్మిక నిర్ణయమేమీ కాదని, చంద్రబాబు లాగా ఎమ్మెల్యేలను కొని వారికి మంత్రుల కిరీటాలు పెట్టలేదని అన్నారు. ఏదో జరుగుతుందని కలలు కని వారి అంచనాలు తలక్రిందులవ్వడంతో ఇప్పుడు శోకాలు పెడుతున్నారని అన్నారు. ముక్కలైన సైకిలును తుక్కు చేసేది ఎల్లో మీడియా భజన బృందాలేనని, పాతాళానికి గోతులు త్రవ్వుకుంటున్నారని అన్నారు.
లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ప్రజాభిప్రాయాన్ని ధిక్కరించమేనని ఆర్ఐఎన్ఎల్ అమ్మకానికి బిడ్లు స్వీకరించడం కార్మికులను అవమానించడమేనని అన్నారు. ప్రస్తుత ఏడాది స్టీల్ ప్లాంట్ కు 835 కోట్ల ఆదాయం వచ్చిందని. అప్పులు తీర్చగలిగే సత్తా పరిశ్రమకు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా తమ స్వార్థ రాజకీయానికి వాడుకునే నీచస్థితికి టిడిపి దిగజారిందని అన్నారు. భక్తులకు రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకునే టిడిపి నేతలకు భంగపాడు ఎదురయ్యిందని, క్యూలైన్లలో మీకేం పనంటూ సామాన్య భక్తులు పచ్చనేతలకు చీవాట్లు పెట్టారని అన్నారు. సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ టిటిడి 5 రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగిందని అన్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 16 అవార్డులు దక్కించుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 11 గ్రామ పంచాయతీలు, నాలుగు మండల పరిషత్ లు, ఒక జిల్లా పరిషత్ కు ఈ అవార్డులు లభించాయని, ఆయా పంచాయతీలు, పరిషత్ ల పాలకవర్గాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోది ఆన్ లైన్ విధానంలో అవార్డులు ప్రదానం చేయనున్నారని అన్నారు.
బీసీల రాజ్యాధికారం సీఎం జగన్ తోనే సాధ్యపడిందని, బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని దేశానికి బ్యాక్ బోన్ అని అన్నారు. కొత్త మంత్రివర్గంలో బిసి వర్గాలకు చెందిన 10 మందికి అవకాశమిచ్చి బిసి వర్గాలపై ముఖ్యమంత్రి తన ప్రేమను చాటుకున్నారని అన్నారు. బలహీన వర్గాల ఆరాధ్యదైవం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి (ఏప్రిల్ 11) రోజునే 10 మంది బీసీలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం గొప్ప విషయమని అన్నారు.
రాష్ట్ర చరిత్రలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య రంగంలో 39 వేల పోస్టుల భర్తీని చేపట్టిందని అన్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, పీహెచ్ సీల నుంచి బోధనాసుపత్రుల వరకు ఆధునికీకరణ, వైద్య ఆరోగ్య రంగంలో నాడు – నేడు ద్వారా మెరుగైన వసతుల కల్పనకు రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించిందని అన్నారు.