రాజన్నరాజ్యంలో ఇసుకటెండర్లను ఫిక్స్ చేసిన ఫిక్సింగ్ రాజా ఎవరు?

– ఇసుకరీచ్ లను జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టడానికే, రెండుకంపెనీలను డమ్మీలనిచేసి, తతంగం నడిపారు.
– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో సాగించిన కుంభకోణాల్లో ఇసుకకుంభకోణమే అత్యంతకీలకమైనదని, ఈ వ్యవహారంలో టెండర్లను తమకు అనుకూలమైన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీకి కట్టబెట్టడంకోసం, వేలకోట్ల దోపిడీకోసం రెండుకంపెనీలతో డమ్మీ టెండర్లువేయించిందని, ఎంఎస్ టీసీ వారు ఇచ్చిన సమాచారంతో ప్రభుత్వపెద్దల అసలు బండారం బయటపడిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ఇసుకరీచ్ లలో అక్రమతవ్వకాలు, ఇసుక అక్రమరవాణాద్వారా రాష్ట్రముఖ్యమంత్రి మొదలు కిందిస్థాయిలో ఉన్న వైసీపీనేతలవరకు వేలకోట్లరూపాయలు దిగమింగుతున్న సంగతి ప్రజలకు తెలిసిందే. ప్రభుత్వదోపిడీ ఫలితంగా ఇసుకదొరక్క లక్షలాదిమంది భవన నిర్మాణకార్మికులు రోడ్డునపడటం, ఆకలిచావులకు గురవడం కూడా అందరం చూశాం. ఇసుక బ్లాక్ మార్కెట్ వల్ల, పేద మధ్యతరగతివారు నిర్మాణంజోలికి వెళ్లకపోవడంతో, నిర్మాణరంగంకుదేలై లక్షలాదిమంది నిర్మాణరంగకార్మికులు పనుల్లేక, తినడానికి తిండిలేక పస్తులతో అలమటించారు. పరిస్థితిని గమనించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారు కార్మికులకు న్యాయంచేయడంకోసం, కార్మిక, ప్రజాసంఘాలతో కలిసి ఇసుకదీక్ష కూడా చేపట్టారు.
ప్రతిపక్షం మొత్తుకున్నా, కార్మికులు ఆకలితో మరణించినా జగన్ ప్రభుత్వం తన పంథా మార్చుకోకుండా, ఇసుకదోపిడీని యథావిధిగా కొనసాగిస్తూనేఉంది. ఇసుక టెండర్లను జగన్ ప్రభుత్వం గంపగుత్తగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టినప్పుడే, బాధ్యతగల ప్రతిపక్షంగా తాముకొన్నిప్రశ్నలు లేవనెత్తి, పలుఆధారాలతో, ప్రభుత్వాన్ని నిలదీయ డంజరిగింది.
ఆ సందర్భంలో ఇసుకటెండర్లతో తమకేం సంబంధంలేదని, కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్ టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలోనే ఇసుకటెండర్ల వ్యవహారం పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం బుకాయించింది. సంబంధిత శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా, సదరుశాఖకు చెందిన ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణద్వివేది, ప్రభుత్వ ప్రధానసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వనిర్వాకాన్ని సమర్థిస్తూ, ప్రజలను మాయచేయడానికి ప్రయత్నించారు. ఇసుకటెండర్లకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన టెక్నికల్ గైడ్ లైన్స్ రూపకల్పనతో తమకు ఎలాంటి సంబంధంలేదని గతంలోనే ఎంఎస్ టీసీ కుండబద్ధలు కొట్టింది. తాము కేవలం టెండర్ ప్రక్రియను మాత్రమే నిర్వహించామని, వ్యవహారమంతా రాష్ట్రప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే జరిగిందని, తాము సమాచార హక్కుచట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎంఎస్ టీసీ వివరణ ఇచ్చింది.
ఆనాడే ఎంఎస్ టీసీ ఇచ్చిన సమాచారంతో గతంలోనే ప్రభుత్వాన్ని నిలదీసినా, పాలకులు స్పందించలేదు. ఇసుకటెండర్లకు సంబంధించి, ఎంఎస్ టీసీ తాజాగా తాను అడిగినప్రశ్నకు సమాచారహక్కు చట్టంకింద సమాధానమిస్తూ, తమకు 01-10-2021న ఇచ్చిన సమాచారంతో, నేడుప్రభుత్వం ముందు కొన్నిప్రశ్నలుఉంచుతున్నాం.సమాచారహక్కుచట్టం కింద ఎంఎస్ టీసీ వారిని ఎన్నిప్యాకేజీల్లో ఇసుకటెండర్లు పిలిచారు.. ఎన్నికంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.. ప్రతిప్యాకేజీకి ప్రభుత్వం నిర్ణయించిన కనీసధరఎంత.. టెండర్లలో పాల్గొన్నకంపెనీలు కోట్ చేసినధర ఎంతని, ఏ ధరకు ఎల్1 టెండర్లను ప్రభుత్వం సదరుకంపెనీలకు అప్పగించిందని ప్రశ్నించడం జరిగింది.
ఎంఎస్ టీసీ వారిచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇసుకటెండర్లలోని ఫిక్సింగ్ వ్యవహారం బట్టబయలైంది.ఇసుకటెండర్లలో మూడుప్యాకేజీలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధరలు ఇలాఉన్నాయి. ప్యాకేజీ-1కి రూ.470కోట్లు, ప్యాకేజీ-2కి రూ.740కోట్లు, ప్యాకేజీ-3కి రూ.300 కోట్లుగా కనీసధరలు నిర్ణయించారు.ప్యాకేజీ-1లో కేవలం రెండుకంపెనీలే టెండర్లలో పాల్గొన్నాయి. అవి కేఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీ. రెండో ప్యాకేజీలో కూడా ఆ రెండుకంపెనీలే టెండర్లు వేయడంజరిగింది. మూడోప్యాకేజీలో ట్రైడెంట్ కెమ్ ఫర్ లిమిటెడ్, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీలు మాత్రమే టెండర్లువేశాయి. ప్రభుత్వం ఇసుకటెండర్లకు సంబంధించి నిర్ణయించిన మూడుప్యాకేజీలకుకలిపి, మొత్తంగా మూడుకంపెనీలు మాత్రమే పాల్గొన్నాయి. ఆకంపెనీలు ఎంతెంత ధరలు కోట్ చేశాయో చూస్తే దాన్నిబట్టే జగన్ ప్రభుత్వం ఇసుకటెండర్లలో ఎంత పారదర్శకంగా, ఏవిధంగా ఫిక్సింగ్ చేసిందో అర్థమవుతోంది.
మొదటిప్యాకేజీకి ప్రభుత్వం నిర్ణయించిన కనీసధర రూ.470కోట్లు అయితే, టెండర్లలో పాల్గొన్న కేఎన్ ఆర్ కనస్ట్రక్షన్స్ కంపెనీ అత్యంతఅద్భుతంగా కేవలం రూ.472 కోట్లువేసి, రూ.2కోట్లుమాత్రమేఅదనంగా చెల్లించడానికి పెద్దమనసుతో ముందుకొచ్చింది. ఇక జగనన్న గారి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు రూ.477కోట్ల50లక్షలకు టెండర్ వేశారు. రూ.ఏడున్నరకోట్లు అధికంగా వేసిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కే టెండర్లు కట్టబెట్టారు. ప్యాకేజీ -2లో ప్రభుత్వం ప్రకటించిన కనీసధర రూ.740 కోట్లు అయితే , కేఎన్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ కేవలంగా రూ.741కోట్లకు మాత్రమే టెండర్ వేసింది.
అంటే కనీస ధర కంటే కేవలం రూ.ఒకకోటి మాత్రమే జతకలిపి బిడ్ దాఖలుచేసింది. ఇక జయప్రకాశ్ పవర్ వెంచర్స్ రూ.745కోట్ల70లక్షలకు వేసి, టెండర్ దక్కించుకోవడం జరిగింది. రూ5కోట్ల 70లక్షలు అదనంగా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు కోట్ చేసింది. ఇక మూడోప్యాకేజీకి ప్రభుత్వ కనీసమద్ధతుధర రూ. 300కోట్లు అయితే, ట్రైడెంట్ కెమ్ ఫర్ కంపెనీ రూ.1కోటి 50లక్షలు అదనంగా కోట్ చేస్తూ, రూ.301కోట్ల50లక్షలకు బిడ్ దాఖలుచేస్తే, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ రూ.305కోట్ల60లక్షలకు కోట్ చేయడంజరిగింది. దాంతో మూడోప్యాకేజీ కూడా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పరమైంది.
ఈ టెండర్లన్నీ చూస్తుంటే, కేఎన్ఆర్ కన్ స్ట్రక్షన్స్, ట్రైడెంట్ కెమ్ ఫర్ కంపెనీలను డమ్మీలుగా మార్చేసి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు టెండర్లన్నీ కట్టబెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుగానే తీసుకున్నట్లు తేలిపోయింది. రెండుకంపెనీలను టెండర్లలోకిదించి, కావాలనే వాటిని డమ్మీలను చేశారని, టెండర్ల తంతుని, ఆయా కంపెనీలు కోట్ చేసిన ధరల్నిబట్టే తెలుస్తోంది. నిజంగా టెండర్ దక్కించుకోవాలనిఉంటే, ఏకంపెనీలుఅయినా కనీసమద్ధతుధరకంటే కేవలం రూ.కోటి, రూ.కోటిన్నర, రూ.2కోట్లరూపాయలుమాత్రమే అదనంగా జతకలిపి బిడ్లు దాఖలు చేస్తాయా?సాధారణంగా ఆలోచిస్తే మనమే రూ.1000లు కనీసధరగా నిర్ణయించిన వేలంపాటలో పాల్గొంటే, అక్కడ పోటీ డిమాండ్ ఉంటే, రూ.1001కి వేలంపాట పాడతామా? రూ.1001కి పాటదక్కుతుందని రంగంలోకి దిగుతామా?
ఈ తంతు అంతాచూస్తేనే తెలియడంలా.. ముందుగానే తాడేపల్లి ప్యాలెస్ లో ఇసుకటెండర్ల ఫిక్సింగ్ వ్యవహారం జరిగిందని. జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం ముందుగానే ఇసుకటెండర్లను ఫిక్స్ చేసి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కి కట్టబెట్టిందో చాలా క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఆ క్రమంలోనే రెండు డమ్మీకంపెనీలతో, రూ.కోటి, రూ.కోటిన్నరమాత్రమే కనీసధరకు అదనంగా చేర్చి, అతితక్కువధరలకు కావాలనే మోసపూరితంగా టెండర్లు వేయించారని ఎంఎస్ టీసీ ఇచ్చిన సమాచారంతో తేలిపోయింది.
ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతారు? రాజన్న రాజ్యంలో ఇసుకటెండర్లలో కీలకపాత్ర పోషించి, వాటిని చాలాగొప్పగా ఫిక్స్ చేసిన “ఫిక్సింగ్ రాజా” ఎవరోతేలాలి. కేబినెట్ మంత్రి పెద్దిరెడ్డి ఫిక్సింగ్ చేశారా….లేక ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదీనా…లేక ముఖ్యమంత్రికి అత్యంతనమ్మకంగా పనిచేసే ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫిక్స్ చేశాడా? ఎవరో తక్షణమే బయటపెట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. “హూ ఈజ్ ది ఫిక్సింగ్ రాజా ఇన్ రాజన్నరాజ్యం” అనే ప్రశ్నకు మిస్టర్ చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే.
చేయాల్సిందంతా తెరవెనుక చేసేసి, పైకైమో పారదర్శకత, నీతి, నిజాయితీ అంటూ కలరింగ్ ఇస్తారా?
రూ. 100కోట్లు పైబడిన ప్రతిఒక్క ప్రభుత్వటెండర్ని న్యాయపరిశీలనకు (జ్యుడీషియల్ ప్రివ్యూ) పంపిస్తామని, ప్రజలముందుఉంచుతామని, వారిసలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పిన జగన్ రెడ్డి అండ్ కో ఇసుక టెండర్లను ఎందుకు పంపలేదు? మూడు ప్యాకేజీలుగా విభజించిన ఇసుకటెండర్ల కనీసధర రూ.100కోట్లకు పైబడిఉంటే, వాటిని ఎందుకు న్యాయసలహాకు పంపలేదో, మిస్టర్ చీఫ్ మినిస్టర్ స్పష్టంచేయాలి. రూ.470కోట్లు, రూ.740కోట్లు, రూ.300కోట్లుగా ఉన్న టెండర్లను ప్రభుత్వం ఎందుకు జ్యుడీషియల్ ద్వారా ప్రజలముందు ఉంచలేదు?
న్యాయపరిశీలనకు పంపకుండా దేనికి దొంగచాటుగా ప్రభుత్వం వ్యవహారం నడిపిందంటే, ముందుగా ఫిక్సింగ్ జరగబట్టి. ఫిక్సింగ్ బాగోతం బయటకు పొక్కు తుందనే మిస్టర్ చీఫ్ మినిస్టర్ జ్యుడీషియల్ రివ్యూని పక్కకుపెట్టి, తాను అనుకున్నది సాధించారు. ఇసుకటెండర్లకు సంబంధించినఒక్క కాగితంకూడా జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్ సైట్ లో లేదు. ఇసుక టెండర్లకు సంబంధించి తాములేవనెత్తిన ప్రశ్నలకు మిస్టర్ చీఫ్ మినిస్టర్ సమాధానంచెప్పాల్సిందే. ప్రభుత్వ ఫిక్సింగ్ వ్యవహారానికి బలైన లక్షలాదిమందికార్మికులకు సమాధానం చెప్పాలి. ఇసుకటెండర్ల ఫిక్సింగ్ అనుభవంతో ఈ ముఖ్యమంత్రి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుకీలను, ఫిక్సింగ్ రాయుళ్లను రాష్ట్రానికి పిలిపించి, శిక్షణఇప్పిస్తే బాగుంటుంది.
ఎలాగూ రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసేస్తున్న జగన్ రెడ్డి, వ్యవహారాలను ఎలాఫిక్సింగ్ చేయాలనే సిలబస్ రూపొందించి, దాన్ని బోధించడానికి రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్శిటీ నెలకొల్పితే సూపర్ గా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిమొదలు, అధికారపార్టీ వారి వరకు ఫిక్సింగ్ పాఠ్యాంశాలను అద్భుతంగా బోధించగలరని ఇసుకటెండర్ల ఫిక్సింగ్ ని బట్టే అర్థమవుతోంది కదా!
ఇసుకను అడ్డంపెట్టుకొని వేలకోట్లను దోపిడీచేయడానికి, ముందుగానే జయప్రకా శ్ పవర్ వెంచర్స్ కు టెండర్లుకట్టబెట్టడంకోసం, ప్రభుత్వం కావాలనే రెండు కంపెనీలను డమ్మీలనుచేసి, తూతూమంత్రంగా టెండర్లవ్యవహారం నడిపిందని సుస్పష్టమైంది. ప్యాకేజీ-1 కనీసధర రూ.470కోట్లయితే, కేఎన్ ఆర్ కనస్ట్రక్షన్స్ చేత కేవలం రూ.472కోట్లకు టెండర్ వేయించి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ తో రూ.477.50లక్షలకు వేయించి, టెండర్ దక్కించుకున్నారు. అలానే ప్యాకేజీ-2లో కనీసధర రూ.740కోట్లు గా నిర్ధారించి, కేఎన్ ఆర్ కనస్ట్రక్షన్స్ తో అత్యంత అద్భుతంగా రూ.741కోట్లకు టెండర్ వేయించి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ తో రూ.745కోట్ల70లక్షలకు వేయించి, ప్యాకేజీ దక్కించుకున్నారు. మూడో ప్యాకేజీలో కనీసధర రూ.300కోట్లుగా ఉంటే, రూ.301కోట్ల 50లక్షలకు ట్రైడెండ్ కెమ్ ఫర్ వారితో టెండర్ వేయించి, వ్యవహారమంతా సెటిల్ చేసి అదికూడా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు దక్కేలాచేశారు.
సమాచార హక్కు చట్టం కింద, నేను అడిగినప్రశ్నలకు ఎంఎస్ టీసీ వారిచ్చిన సమాచారంతో ఇసుకటెండర్లు ముందే ఫిక్స్ అయినట్లు రుజువుచేశాను. ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఫిక్సింగ్ రాజా ఎవరో ముఖ్యమంత్రి తక్షణమే సమాధానంచెప్పాలి. జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపించకుండా, ఎందుకుదొంగచాటుగా టెండర్ల వ్యవహారం నడిపించారోకూడా స్పష్టంచేయాలి. రూ.100కోట్లు పైబడిన ప్రతిటెండర్ని న్యాయపరిశీలనకు పంపాలనే నిబంధనను ప్రభుత్వం ఇసుకటెండర్లలో ఎందుకు అమలుచేయలేదో కూడా ప్రభుత్వం ప్రజలకుసమాధానంచెప్పాలి. ఈ వ్యవహారమంతా ప్రజలముందుఉంచి, ప్రభుత్వం స్పం దించేవరకు వదిలిపెట్టమని తేల్చిచెబుతున్నాం.
ఇసుకదోపిడీకోసం లక్షలాదికార్మికులను ఏవిధంగా రోడ్డునపడేశారో ప్రజలంతా గమనించాలి. ఓట్లుఅడగడానికి ఇళ్లముందుకొచ్చే వైసీపీనేతలను కాలర్ పట్టుకొని నిలదీయాలని ప్రజలకు పిలుపునిస్తున్నా. గోపాలకృష్ణ ద్వివేదీ గారు గతంలో మూడుసార్లు ప్రెస్ మీట్ పెట్టినా, కేఎన్ ఆర్ కనస్ట్రక్షన్స్ ఎంతధర కోట్ చేసింది.. ట్రైడెంట్ కెమ్ ఫర్ వారు ఎంతధర కోట్ చేశారో చెప్పారా? లేదుకదా.. ఆయనగానీ, పెద్దిరెడ్డిగానీ ఏనాడైనా ఫిక్సింగ్ ఫిగర్స్ ను మీడియా ముందుఉంచారా? అసలు ఇసుకటెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకి ఎందుకు పంపలేదో సమాధానం చెప్పమనండి. మేం మీడియాతో మాట్లాడేముందు పక్కాగా ఆధారాలతోనే మాట్లాడతాం. కాబట్టే ఎంఎస్ టీసీవారు సమాచారం ఇచ్చేవరకు వేచిచూశాం.